అందానికి ఉల్లి తోడు!

23 Dec, 2014 23:45 IST|Sakshi
అందానికి ఉల్లి తోడు!

సౌందర్య పోషణలో కురులదే కీలకపాత్ర. అందులోనూ స్త్రీలకు ఒత్తై తలకట్టు అందాన్నిస్తుందన్నది నిర్వివాదాంశం కూడా. తలవెంట్రుకలు రాలిపోయే సమస్యతో బాధపడేవారి పాలిట ఉల్లి మంచి మందు. అంతేకాదు, కొందరికి పేను కొరుకుడు వల్ల తలపై అక్కడక్కడ పాయలు పాయలుగా జుట్టు ఊడిపోయి, అసహ్యంగా కనపడుతుంది. అటువంటివారు ఉల్లిపాయను మెత్తగా చితక్కొట్టి లేదా మిక్సీలో వేసి రసం తీసి నెత్తిమీద వెంట్రుకలు పలుచగా ఉన్న చోట రాసుకుంటే నిద్రాణంగా ఉన్న వెంట్రుకల కుదుళ్లు చైతన్యవంతమై, తిరిగి అక్కడ జుట్టు మొలుస్తుందట. ఉల్లిలో ఉండే సల్ఫర్ జీవక్రియలను వేగవంతం చేయడం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రపరిశోధనలు నిరూపిస్తున్నాయి.

ఉల్లిపాయను బాగా దంచి, రసం తీసి, కొబ్బరినూనెలో లేదా ఇతర కేశవర్థక తైలాలలో కలిపి తలకు రాసుకున్నా మంచి ఫలితమే. చుండ్రుతో బాధపడేవారు ఉల్లిరసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి మాడుకు పట్టించి, అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే అందం ద్విగుణీకృతం అవుతుంది... నిజం! ఉల్లితోడు! అన్నట్టు ఉల్లికి ఆడ, మగ తేడా ఏమీ లేదు. మగవాళ్లు కూడా ఉల్లిరసం రాసుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు