ఊపిరి ఆగిన ఫీలింగ్!

13 Jun, 2014 01:11 IST|Sakshi
ఊపిరి ఆగిన ఫీలింగ్!

డుడుమా జలపాతం
పని ఒత్తిడికి తోడు మిత్రుల ఒత్తిడి ఎక్కువైంది. పదిమంది మిత్రులం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అని ప్లాన్ వేసుకున్నాం. వారం రోజుల కుస్తీ తర్వాత... ఒరిస్సా లోని ‘మాచ్‌ఖండ్’ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్లాం. హైదరాబాద్ నుంచి రైల్లో విశాఖ బయల్దేరి, అరకు మీదుగా మరో వంద కిలోమీటర్లు ప్రయాణించి మాచ్‌ఖండ్‌కు చేరుకున్నాం. రెప్పవాల్చనివ్వని ప్రకృతి అందాలు.. కోరాపుట్ జిల్లాలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో.. రెప్ప వాల్చితే ప్రకృతి అందాలు మిస్ అవుతామేమో అనే ఉత్కంఠకు లోనయ్యాం. అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ..  మాచ్‌ఖండ్ చేరుకున్నాం. ఈ ప్రాంతం ఉన్నది ఒరిస్సాలోనే అయినా ఇక్కడ చాలా మంది తెలుగువాళ్ళున్నారు. రాత్రి గెస్ట్ హౌజ్‌లో బస, కొండ కోనల్లో విహారం.. వర్ణనకు మాటలు సరిపోవు.
 
డుడుమా జలపాతం... తెల్లవారుజామునే లేచి ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత... ఎదురుగా డుడుమా జలపాతం. ఆ దృశ్యం చూసి ఊపిరి ఒక్కసారి నిలిచిపోయిన ఫీలింగ్ కలిగింది. ఎత్తయిన కొండలు, వాటి మధ్య కిలో మీటర్‌లోతు లోయ ప్రాంతం... వాటి మధ్య మూడు జల పాతాలు. అయితే మొదట మనకు కనిపించే జలపాతం సహజ సిద్ధమైంది కాదు. జల విద్యుత్ కేంద్రం నుంచి బయటికి వచ్చే నీటి ద్వారా ఏర్పాటైంది అని తెలుసుకుని ఆశ్చర్యపోయాం. మిగతా రెండు జలపాతాలు ప్రకృతి సృష్టి. జలపాతాలు లోయలోకి దూకే ప్రాంతాలకు వెళ్ళేందుకు దాదాపు 1800 మెట్లు ఉన్నాయి. ఆలోయలోకి దిగాలంటే వెంట మిత్ర బృందమే కాదు మెండుగా గుండెధైర్యమూ కావాలి. ఆ లోయ జలపాత అందాలు చూశాక... కష్టం దూదిపింజల్లా తేలిపోయింది. ఆ తర్వాత ముందస్తు అనుమతితో పవర్ ప్రాజెక్టును సందర్శించాం.

పవర్ ప్రాజెక్ట్... కిలో మీటర్ లోతైన లోయలో ఉన్న ప్రాజెక్టుకు...లోపలికి వెళితే రైల్వే ట్రాక్, ఓ రెండు టాప్ లెస్ బోగీలు కనిపించాయి. అదే వించ్ హౌజ్. 1957లో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ ట్రాక్ నిర్మించారు. ఈ తరహా ప్రాజెక్టు గానీ, ప్రయాణంగానీ ప్రపంచంలో మరెక్కడా లేదని అక్కడ ఓ ఉద్యోగి చెప్పాడు. నిట్టనిలువుగా, లోతుగా ఉన్న లోయలోకి రైలు ప్రయాణం... ఊహించుకోవడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. లోయలోకి రైలు ప్రయాణం ద్వారా విద్యుత్ ప్రాజెక్టుకు చేరుకున్నాక, అక్కడ విద్యుత్ ఉత్పత్తి విధానం తెలుసుకున్నాం. ఒరిస్సా సరిహద్దుల్లో సాగిన మా ప్రయాణంలో మరపురాని ప్రకృతి అందాలను కళ్ళనిండా నింపుకుని విశాఖ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యాం.
 - బందు శ్రీకాంత్ బాబు,  సాక్షి టీవీ, హైదరాబాద్

>
మరిన్ని వార్తలు