బరువు పెరిగితే గర్భధారణ అవకాశాలు తగ్గుతాయా?

21 Nov, 2015 23:24 IST|Sakshi

కార్డియాలజీ కౌన్సెలింగ్

నా వయసు 64. నాకు గత ఏడాది ఛాతీలో నొప్పి రావడంతో యాంజియోగ్రామ్ చేసి  ఒక స్టెంట్‌ను వేశారు. ఇటీవల శ్వాసలో తీవ్రమైన ఇబ్బందితో పాటు ఛాతీలో నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. డాక్టర్ నన్ను పరీక్షించి,  గుండెలో విద్యుత్ సమస్య ఏర్పడిందనీ, దాన్ని సరిచేయడానికి పేస్‌మేకర్‌ను అమర్చాలని చెబుతున్నారు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
 - కె. ప్రకాశ్‌రావు, జగ్గయ్యపేట
 
గుండెలో జబ్బు అనగానే మనకు ఒకటే అంశం గుర్తుకు వస్తుంది. అదే గుండెపోటు.  కానీ నిజానికి గుండెకు సంబంధించి ఇతర చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి గుండెకు సరఫరా అయ్యే కరెంటు. గుండె ద్వారా శరీరానికి ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. కాబట్టి గుండె పంపుగా పని చేయడానికి శక్తి కావాలి. ఇందుకు గుండె పై భాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ (ఎస్‌ఎ) నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ (ఏవి) నోడ్ అనే కేంద్రాలుంటాయి.

వీటి నుంచి గుండెకు విద్యుత్ ప్రేరణలు అందుతుంటాయి. ఈ విద్యుత్ ప్రేరణల వల్ల గుండె ఒక క్రమపద్ధతిలో స్పందించడం వల్ల రక్తనాళాల్లోకి రక్తం పంప్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఈ విద్యుత్ ప్రేరణల్లో మార్పులు వచ్చి గుండె లయ దెబ్బతింటుంది. దాంతో ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందీ, ఒక్కోసారి దీన్నే వైద్య పరిభాషలో ట్యాకి కార్డియా అంటారు. గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ పై భాగంలో చర్మం క్రింద పేస్‌మేకర్‌ను అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు.

గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ అనే మందులు ఉపయోగించి గుండె లయను క్రమబద్ధీకరిస్తారు. గుండె లయ తప్పకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...  డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి  క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి  బరువు పెరగకుండా చూసుకోవాలి  రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి  కొలెస్ట్రాల్ పాళ్లు అదుపులోనే ఉండేలా చూసుకోవాలి  మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
 
పల్మనాలజీ కౌన్సెలింగ్

నేను వృత్తిరీత్యా డీజిల్ పొగ వెలువడే ప్రదేశంలో ఎక్కువగా ఉండాల్సి వస్తోంది. నాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందేమో అన్న భయం ఎక్కువగా ఉంది. దయచేసి లంగ్ క్యాన్సర్ నివారణ చెప్పండి.
 - అహ్మద్‌బాషా, గుంటూరు
 
మీరు చెప్పినట్లుగా డీజిల్ వంటి ఇంధనాల నుంచి వెలువడే పొగ వల్ల ఊపిరితిత్తుల (లంగ్) క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే. పురుషుల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లలో మొదటిది ఊపిరితిత్తుల క్యాన్సర్. మహిళలతో పాటు పురుషుల్లోనూ లెక్కచూస్తే ఇది నాలుగోది. పురుషుల్లో ఉండే పొగాకు వాడే అలవాటు, ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల వెలువడే పొగ, పట్టణప్రాంతాల్లోని కాలుష్యం వంటి అంశాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం.  

ఇక ఇంట్లో ఎవరికైనా పొగతాగే అలవాటు ఉంటే, వాళ్లతో పాటు ఆ పొగపీల్చేవారూ (ప్యాసివ్ స్మోకింగ్ చేసేవాళ్లూ) ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను టీబీ వ్యాధిగా నిర్ధారణ చేయడం (మిస్ డయాగ్నోజ్) వల్ల అది ముదిరిపోయే అవకాశాలూ ఎక్కువ. ఒకవేళ మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. లేకపోతే మీరు వృత్తిరీత్యా పీల్చే కాలుష్యానికి తోడు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఈ అలవాటు మరింత వేగవంతం చేయవచ్చు.

ఇక మీరెలాగూ మీ వృత్తిరీత్యా డీజిల్ పొగకు ఎక్స్‌పోజ్ అయ్యే చోట ఉన్నారు కాబట్టి లంగ్ క్యాన్సర్ నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. మీకు వృత్తిపరంగా తీసుకునే జాగ్రత్తలలో భాగంగా రెస్పిరేటర్ వంటివి ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని తప్పనిసరిగా ధరించండి. ఇక అది సాధ్యం కాని పరిస్థితుల్లో ఎన్-95 రేటింగ్ ఉన్న మాస్క్‌లను ముక్కుకు అడ్డుగా కట్టుకోండి. దీనివల్ల చాలావరకు డీజిల్ పొగతో పాటు, కాలుష్యప్రభావాలనూ అధిగమించవచ్చునని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
 
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్

నా వయసు 28 ఏళ్లు. నా భార్య వయసు 24 ఏళ్లు. మాకు పెళ్లయి మూడేళ్లు అవుతోంది. మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. పెళ్లయిన దగ్గర్నుంచి పిల్లలను కోరుకుంటున్నాం. మేమిద్దరమూ ఆరోగ్యంగానే ఉంటాం. అయితే నా భార్య బరువు 115 కిలోలు. కొంచెం పొట్టిగా ఉంటుంది. మేం మా డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆమె నా భార్య బరువు ఎక్కువగా ఉందనీ, పిల్లలు పుట్టడానికి ఆమె బరువు  కూడా ఒక సమస్య అని చెప్పారు. ఇది నిజమేనా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి.
 - సురేశ్, చిత్తూరు

 
స్థూలకాయం (ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండటం) చాలా సమస్యలకు దారితీస్తుందన్న విషయం వాస్తవమే. అయితే బరువు తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యలను చాలా సులభంగా అధిగమించవచ్చు. బరువు పెరగడం వల్ల మహిళల్లో రుతుస్రావం సరిగా కాకపోవడం, ఫలదీకరణ సమస్యల వంటివి వస్తాయి. దీనివల్ల గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. కృత్రిమ గర్భధారణ ప్రక్రియలు అనుసరించే మహిళల్లోనూ బరువు ఎక్కువగా ఉన్నవారిలో మందులు వాడాల్సిన సమయం, గర్భధారణ కోసం పట్టే సమయం పెరుగుతాయి.

పైగా మందుల మోతాదు కూడా పెరుగుతుంది. గర్భస్రావాలూ పెరుగుతుంటాయి. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు (కాంప్లికేషన్లు) కూడా పెరుగుతుంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారిలో గర్భధారణ సమయంలో హైబీపీ, డయాబెటిస్ వచ్చే అవకాశాలూ పెరుగుతాయి. పైగా అవసరమైన బరువు కంటే ఎక్కువగా ఉండటం సాధారణ ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. అది దీర్ఘకాలంలో గుండెజబ్బులకూ, ఆర్థరైటిస్‌కూ, హైబీపీ, డయాబెటిస్‌కు దారితీస్తుంది. బరువును అదుపులో పెట్టుకుంటే ఎన్నో సమస్యలను నివారించవచ్చు.

కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మొదట ఆమె బరువు తగ్గడం ప్రధానం. జీవనశైలి మార్పులు, సమతులమైన, క్యాలరీలను తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. వీటితో పాటు తగినంత శారీరక శ్రమ చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడానికి అవసరమైన మార్గాలు పాటించడం వల్ల బరువు తగ్గవచ్చు.

ఇక తమ బరువు తమ జీవితానికి చేటు తెస్తుందనకున్న వారికి మందులు, బేరియాట్రిక్ సర్జరీ ఉపయోగపడతాయి. మందులు, బేరియాట్రిక్ సర్జరీ ఎవరికి అవసరం అన్న విషయాన్ని వైద్యనిపుణులు నిర్ణయిస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీరు, ఆమెతో పాటు ఒకసారి డాక్టర్‌ను కలిసి ఆమె బరువు తగ్గడానికి అవసరమైన సూచనలు పాటించండి.

>
మరిన్ని వార్తలు