కోడెవయసు రామ్మూర్తులు

13 Feb, 2017 23:40 IST|Sakshi
కోడెవయసు రామ్మూర్తులు

దంగల్‌

దంగల్‌ సినిమా పుణ్యమా అని ఉత్తర భారతదేశంలో మళ్లీ కుస్తీలకు గిరాకీ పెరిగింది. పల్లెపట్టుల్లో ఇప్పటికే ఆదరణ ఉన్న ఈ క్రీడకు సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’, ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ సినిమాల వల్ల భారీగా గ్లామర్‌ తోడయ్యింది. సుల్తాన్‌లో సల్మాన్‌ఖాన్‌ స్వయంగా ఒక మల్లయోధుడిగా నటిస్తే, దంగల్‌లో ఆమిర్‌ఖాన్‌ తన కూతుళ్లను తీర్చిదిద్దే మాజీ మల్లయోధుడిగా కనిపిస్తారు. స్త్రీలైనా పురుషులైనా పౌరుషంగా ప్రత్యర్థులను మట్టికరిపించవచ్చు అని నిరూపించిన ఈ సినిమాలతో ఒక్కసారిగా ఉత్తరాదిగా లంగోటీ బిగించే పిల్లల, కుర్రవాళ్ల శాతం పెరిగింది. అయితే దీనికి నేపధ్యం కూడా ఉంది. భారతదేశంలో మొదటి నుంచి ‘మల్లయుద్ధం’ ఉంది.

భీముడు మల్లయోధుడే. అయితే మొఘలులు మన దేశానికి వచ్చాక వారికి తెలిసి ‘పహిల్వానీ’ క్రీడను వ్యాప్తి చేశారు. దేశీయంగా ఉన్న మల్లయుద్ధం, మొఘలులు తెచ్చిన పహిల్వానీ కలిసి ఇప్పటి ‘కుస్తీ’గా మారిందని కొందరి అభిప్రాయం. తెలుగునాట తొలిరోజుల్లో కోడి రామ్మూర్తి, ఆ తర్వాతికాలంలో నెల్లూరు కాంతారావు మల్లయోధులుగా ఖ్యాతి పొందారు. దేశవ్యాప్తంగా అయితే ధారాసింగ్‌కు ఉన్న పేరు తెలిసిందే. ఆ స్థాయిలో కాకపోయినా ఆ తర్వాత చాలామందే వచ్చారు. ఇప్పుడు దంగల్‌ పుణ్యమా అని రానున్న కాలంలో క్రికెట్‌లోనే కాదు కుస్తీలో కూడా అంతటి గ్లామర్‌ ఉన్న హీరోలను మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నది రెండురోజుల క్రితం అమృతసర్‌ శివార్లలో కుస్తీ ప్రాక్టీసు చేస్తున్న ఔత్సాహికుల చిత్రాలు. కుస్తీ కోసం గోదాలో ఉన్న మట్టిని నీళ్లు, తేనె కలిపి ప్రత్యేకంగా మెత్తగా చేస్తారు. అలాంటి మట్టిలోనే కుస్తీ ఆడాలి. అప్పుడే వాళ్లకు క్షేమకరం. మనకు నయనానందకరం.


మరిన్ని వార్తలు