జీవిత చిత్రంలో ఖాళీలు

30 Mar, 2020 00:29 IST|Sakshi

కొత్త బంగారం

నవల : ఇన్‌డెలికసీ
రచన : అమీనా కెయిన్‌ 

‘‘మళ్లీ ఒంటరితనం– వింతగా ఉందిప్పుడు. నా మధ్యాహ్నాలన్నీ నాక్కావలసిన దానికంటే ఎక్కువ విస్తారంగా ఉన్నాయి. నాతో నాకు కావలసినంత ఏకాంత సమయం, తోడుగా ఉన్న రచనాన్వేషణలో నాలో నన్ను కనుక్కుంటూ నేను...’’ మనిషి తన చేతనతో మమేకమవడానికీ, తన అస్తిత్వాన్ని గుర్తెరగడానికీ చేసే ప్రయత్నాన్నీ, ప్రయాణాన్నీ ఒక కవితాత్మక కథగా చెప్పగలగటం అమెరికన్‌ రచయిత్రి అమీనా కెయిన్‌ రాసిన తొలి నవల ‘ఇన్‌డెలికసీ’లో సాధించడం చూస్తాం. గత నెలలోఎఫ్‌.ఎస్‌.జి. ద్వారా ప్రచురింపబడిందీ పుస్తకం. 

ఒక మ్యూజియమ్‌లోని ఆర్ట్‌ గాలరీలో పెయింటింగ్స్, గదులూ శుభ్రం చేసే చిరుద్యోగి విటోరియా. గతకాలాల ఇరుకుదనాన్ని పట్టించుకోకుండా, ఉన్నంతలో ఒంటరిగా ధైర్యంగా హాయిగా బ్రతుకుతున్న వ్యక్తి. ఉద్యోగమూ, సంపాదనా తృప్తినివ్వకపోయినా జీవితంలోని స్వేచ్ఛని ఆస్వాదిస్తూ ఉంటుంది. రచయిత్రి కావాలన్న కోరికకు డబ్బూ సమయమూ రెండూ కరువైనా, ప్రతిరోజూ చూసినవాటి గురించి రాసుకుంటూ ఏనాటికైనా ఒక పుస్తకం ప్రచురించాలన్న ఆశతో ఉంటుంది. ఇంతలో, ఆర్ట్‌ గాలరీ చూడటానికి వచ్చిన ఒక సంపన్నుడు విటోరియాని పెళ్లిచేసుకుంటాడు. వివాహమైన తరవాత విటోరియాకి ప్రేమగా చూసుకునే భర్తతో పాటు తనకంటూ గదీ, రాసుకోవటానికి సమయం, స్వేచ్ఛ దొరుకుతాయి. ఈత కొట్టడం, బాలెరీనాలు చూడటం నేర్చుకోవటం వగైరాలు చేస్తూంటుందామె.

కళల పట్ల ఆసక్తీ, తనకేం కావాలో తెలుసుకోవాలన్న తపనా, చూసిన విషయాల గురించి రాసే అలవాటూ ఆమెని వదిలిపెట్టవు. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఏదో అసంతృప్తికి లోనవుతుంటుంది. రచయిత్రులంటేనే చిన్నచూపు ఉన్న భర్తకు తన రాతలపట్ల కూడా గౌరవం లేదని ఆమెకు తెలుసు. దీనికితోడు ఇంటి మెయిడ్‌ అయిన సొలాంజ్‌తో ఆమెకు సఖ్యత ఏర్పడదు. తనకున్న తపనకు ఇంటి బాధ్యతలు, భర్త స్నేహితులూ, వాళ్లతో పార్టీలూ అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆమెకు. ఇవన్నీ అర్థం చేసుకోని భర్త వల్ల విటోరియా ఒంటరితనానికి గురై, సంసార జీవితానికి కూడా దూరంగా ఉంటూ, భర్తనుంచి విడిపోవాలని అనుకుంటుంది. విడిపోయినా, మళ్లీ ఉద్యోగం చేసే అవసరం లేకుండా ఉంటే బావుండునని అనుకుంటున్నప్పుడే, భర్తకూ సొలాంజ్‌కూ మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. వారి బంధానికి పరోక్షంగా కారణం తనే అయినా, భర్తనుంచి విడిపోవడానికే సుముఖత చూపిస్తుంది. మళ్లీ ఒంటరి జీవితం– కానీ, ఈసారి చాలినంత డబ్బు, రాసుకునే తీరికా, ఇతర బాధ్యతలేమీ లేని జీవితం మొదలవడంతో కథ ముగుస్తుంది. 

విటోరియా ఉద్యోగస్తురాలైనప్పుడూ, వివాహమైనప్పుడూ, భర్తనుంచి విడిపోయిన తరువాతా– ఎప్పూడూ తనదైన పద్ధతిలోనే స్వేచ్ఛామార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. పెయింటింగ్స్‌ పరిశీలించటం, వాటిలో తన ఆలోచనలనూ ఆశలనూ వెతుక్కోవడం విటోరియాకి ఇష్టమైన వ్యాపకం. ‘‘నేను మ్యూజియంలో పనిచేస్తున్నప్పుడు ఒకోసారి కిటికీలోంచి బయటకి చూస్తూ నిలబడిపోయేదాన్ని. కిటికీ అద్దాల్లో నా వెనక ఉన్న పెయింటింగ్స్‌ ప్రతిఫలించేవి– నాతో సహా. వాటితోపాటు నన్నలా చూసుకోవటం ప్రత్యేకంగా అనిపించేది. ఇంకోలా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నట్టు, నన్ను నేను సరికొత్తగా చూసుకుంటున్నట్టు,’’ అంటుంది విటోరియా. పెయింటింగ్స్‌లో చిత్రంతో బాటు పక్కనే ఉన్న ఖాళీలూ, ఆ ఖాళీలను నింపిన వర్ణాలు కూడా ఏదో చెప్తున్నట్టే తోచేదామెకు. విటోరియా జీవిత చిత్రంలో పెయింటింగ్స్‌ ఒక వర్ణంలా కలిసిపోతే, రచనా జీవితంలోని పదాలు అంతరంగపుటావిష్కరణలు. 

తనలో ఉన్న అసంపూర్ణతల గురించి విటోరియాకి స్పృహ లేకపోలేదు. ఏకపక్షపు నిర్ణయాలతో భర్తని దూరం చేసుకోవడం, వివాహం అక్కర్లేకపోయినా దాన్నుంచి వచ్చే భరణాన్ని మాత్రం ఆశించడం లాంటివి విటోరియాని మరీ ఎక్కువగా ఆదర్శవంతం చేయకుండా, సగటు వ్యక్తి స్థాయిలో నిలిపే వాస్తవ ప్రయత్నం చేస్తుంది నవల. సౌజన్యం కొంతమేరకు కొరవడిన పాత్రతో నవలకి ‘ఇన్‌డెలికసీ’ అన్న పేరూ, వ్యక్తిత్వపు ఛాయల సమతూకం సాధించిందన్న పేరుకి నవలా ఒకదానికొకటి సరిపోయాయి!

- పద్మప్రియ 

మరిన్ని వార్తలు