హేరామ్!

14 Aug, 2016 22:43 IST|Sakshi
హేరామ్!

‘మహాత్మ’ గాంధీ (78), భారత జాతిపిత
పూర్తిపేరు :      మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
జననం   :      2 అక్టోబర్ 1869
జన్మస్థలం      :      పోర్బందర్ (గుజరాత్)
తల్లిదండ్రులు   :      కరమ్‌చంద్ గాంధీ, పుత్లీబాయ్
తోబుట్టువులు  :      లక్ష్మీదాస్, గోకిబెన్ కర్సన్‌దాస్
చదువు   :      న్యాయశాస్త్రం
భార్య     :      కస్తూర్బా (వివాహం: 1883 మే)
సంతానం :      హరిలాల్, మణిలాల్, రామ్‌దాస్,  దేవదాస్


ఒక అతివాది తన దారికి అడ్డమని చెప్పి  పిస్తోలు తీసి దండం పెడుతూనే మహాత్మాగాంధీని  గుండెల్లో కాల్చాడు! అలా చేసినవాడిపై ఆగ్రహించాలి. ‘ఎందుకిలా చేశావ్’ అని అరవాలి. కానీ గాంధీజీ అహింసావాది. చనిపోతూ కూడా అతడిని ద్వేషించలేదు.  ‘హే రామ్!’ అంటూ ఒరిగిపోయారు. ఇది 1948 జనవరి 30న జరిగిన ఘాతుకం.


ఇప్పుడు మళ్లీ అదే అతివాదం...
2016 ఆగస్టు 5న  దారికి అడ్డంగా ఉందని చెప్పి మహాత్మాగాంధీ ప్రతిమను కాళ్లూ చేతులు విరగ్గొట్టి ఏట్లో పడేసింది! 69 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చింది. 69 ఏళ్ల తర్వాత మరో అర్ధరాత్రి పాలకవాదం మనకు తలవంపులు తెచ్చింది.  ఆనాటిది.. ఎ ప్రైడ్‌ఫుల్ మిడ్‌నైట్. ఈనాటిది.. ఎ షేమ్‌ఫుల్ మిడ్‌నైట్. గాంధీజీకి జరిగిన ఈ ఘోర అవమానానికి

ప్రాయశ్చిత్తంగా, ప్రక్షాళనగా...
ఈ స్వాతంత్య్ర దినోత్సవాన.. ఆయన జీవితచరిత్రను  మళ్లీ ఒకసారి మననం చేసుకుందాం. 1947. ఆగస్టు 14-15. అర్ధరాత్రి.  దేశానికి స్వాతంత్య్రం వచ్చింది! నెహ్రూ మాట్లాడుతున్నారు పార్లమెంటు హాల్లో.  కొద్ది క్షణాల్లో ఆగస్టు 15 రాబోతుండగా... ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ మొదలైంది. తొలి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం.. ట్రిస్ట్ విత్ డెస్టినీ.  తల్లి కునుకు తీస్తున్నప్పుడు మేల్కొని కేరింతలు కొడుతున్న బిడ్డను కనిపెట్టుకుని ఉండే రెప్పలకు ఆహ్వానం అన్నారు నెహ్రూ.

గాంధీజీ అక్కడ లేరు!
వగచిన యుగం అంతరించి, జాతి ఆత్మ వికసించిన ఈ నడిరేయిలో మళ్లీ ఒక ఒట్టుపెట్టుకుందాం.. యావత్ మానవాళి క్షేమం కోసం కట్టుబడి ఉంటామని.. అన్నారు నెహ్రూ.


గాంధీజీ అక్కడ లేరు!
ఈ తొలి క్షణాలలో మన భావాలు జాతిపిత బాపూజీని అభిషేకించాలి. భారతీయాత్మకు బాహ్య స్వరూపమైన బాపూజీ మనకొక సందేశం... అన్నారు నెహ్రూ. గాంధీజీ అక్కడ లేరు.

 
సమరయోధుడు, శాంతి యోధుడు.. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడు.. దేశ ఆవిర్భావ క్షణాలలో ఢిల్లీలో లేకుండా ఎక్కడ ఉన్నట్లు? కలకత్తాలో! హిందూ ముస్లింల మధ్య రాజుకున్న మత కలహాల జ్వాలల్ని చల్లార్చే కర్తవ్య దీక్షలో నిమగ్నమై ఉన్నారు ఆయన! స్వాతంత్య్రాన్ని ఆస్వాదించడం కన్నా, శాంతి సామరస్యాలను పునరుద్ధరించడం ముఖ్యం అని భావించారు బాపూజీ.


ఇలాంటి వ్యక్తి ఉంటారా?!
ఇవాళ భారత స్వాతంత్య్ర దినం. 70వ ఇండిపెండెన్స్ డే. 68 ఏళ్ల క్రితం బాపూజీ తన 78వ యేట ఒక అతివాది పేల్చిన బులెట్‌లకు నేలకొరిగారు. స్వతంత్ర భారతదేశపు తొలి ఉలికిపాటు అది. గాంధీ హత్య వార్త వినగానే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ - ‘ఇంతటి మహావ్యక్తి ఈ భూమి మీద నడిచాడా! మన మధ్య జీవించాడా అని భావితరాల వారు ఆశ్చర్యపోతారు’ అని వ్యాఖ్యానించారు.


ఆయన జీవితమే... ఆయన సందేశం
దేశ విభజనకు ముందు, తర్వాత... దేశంలో చెలరేగిన మత కలహాలు గాంధీజీని ఎంతో అశాంతికి గురి చేశాయి. స్వాతంత్య్రానికి ముందు ఏడాది 1946లో ఆయన హిందూ ముస్లిం అల్లర్లలో శాంతి పునఃస్థాపనకు కలకత్తాలో పాదయాత్ర చేస్తున్నారు. ‘బెంగాలీ ప్రజలకు సందేశం ఇవ్వండి’ అని పాత్రికేయులు అడిగారు. ఆరోజు గాంధీజీ మౌనవ్రతం. ఒక పలక మీద బెంగాలీ లిపిలో ‘అమార్ జీబనీ అమార్ బానీ’ అని రాశారు. ‘నా జీవితమే నా సందేశం’ అని దాని అర్థం. సత్యం, అహింస అనే ఆదర్శాలను ఆయుధాలుగా చేసుకున్న మహనీయుని జీవితం కేవలం సందేశం మాత్రమే అవుతుందా? దిక్సూచి కూడా అయింది. అగ్రరాజ్యాలు సైతం నేడు గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నాయి!


ఇరవై ఏళ్ల దక్షిణాఫ్రికా ఉద్యమం
గాంధీజీ జీవితానికి ఉద్యమ స్వరూపం తప్ప మరో రూపం లేదు. వేరే రూపు రేఖలూ లేవు. ఈ భారతీయుడి జీవితం ఇంగ్లండ్‌లో మొదలైంది. దక్షిణాఫ్రికాలో పదును తేలింది. భారత్‌లో కదం తొక్కింది. సముద్రయానం హిందువులకు నిషిద్ధం. నిషేధాన్ని ధిక్కరించి ‘లా’ చదవడం కోసం 1888లో ఇంగ్లండు వెళ్లారు గాంధీజీ! మూడేళ్లు లండన్‌లో ఉండి వచ్చారు. ముంబైలో ‘లా’ ప్రాక్టీస్ పెట్టారు. 1893లో దక్షిణాఫ్రికాలో ఒక భారతీయ ముస్లిం కంపెనీ దావాలో వాదించడానికి జూనియర్ లాయర్‌గా వెళ్లే అవకాశం వస్తే డర్బన్ బయల్దేరి వెళ్లారు. అలా వెళ్లడం వెళ్లడం దక్షిణాఫ్రికాలో 21 ఏళ్లు (1893-1914) గడిపారు. దక్షిణాఫ్రికాలో అనుభవాలు, అవమానాలు, పరాజయాలు ఆయన్ని ఓ ఉద్యమ శిల్పంలా చెక్కాయి!


ముప్పై ఏళ్ల స్వదేశీ ఉద్యమం
1914లో దక్షిణాఫ్రికా నుంచి తిరుగు ప్రయాణమై, మధ్యలో కొన్నాళ్లు లండన్‌లో ఉండి, అక్కడ ఆరోగ్యం క్షీణించడంతో 1915లో గాంధీజీ ఇండియా చేరుకునే నాటికి.. ఇక్కడ స్వాతంత్య్ర కాంక్ష  ఉద్ధృత రూపం దాలుస్తూ ఉంది. గాంధీజీ ఏడాది పాటు దేశమంతా తిరిగారు. మొదట శాంతి నికేతన్ వెళ్లి ఠాగూర్‌ని కలుసుకున్నారు. తర్వాత గుజరాత్ వచ్చారు. అహ్మాదాబాద్‌లో సబర్మతీ నదీ తీరాన ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. ఇండియాలో కూడా దక్షిణాఫ్రికాలోని పరిస్థితులే! తెల్లవాళ్లు, నల్లవాళ్లు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు. ప్రభుత్వంపై ఉద్యమకారుల ఆగ్రహాలు! బీహార్‌లోని చంపారన్ జిల్లాలో నీలిమందు పండించే పేద రైతుల పట్ల తెల్లజాతి యజమానులు అనుసరిస్తున్న దోపిడి విధానంపై ప్రతిఘటనతో 1917లో భారత్‌లో మొదలైన గాంధీజీ ఉద్యమ జీవితం.. రౌలత్ చట్టం, జలియన్‌వాలా బాగ్ ఉదంతం, సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమం, చౌరాచౌరీ ఘటన, సంపూర్ణ స్వరాజ్య తీర్మానం, ఉప్పు సత్యాగ్రహం, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆమరణ నిరాహార దీక్ష .. వంటి వాటితో 1932 నాటికి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన అధ్యాయం అయింది!


1933లో గాంధీజీ సబర్మతి నుంచి మహారాష్ట్రలోని వార్ధా వచ్చి అక్కడ సేవాగ్రాం పేరుతో ఆశ్రమం నెలకొల్పారు. అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. హరిజన్ వార పత్రిక స్థాపించారు. హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఖాదీ ఉద్యమం ప్రారంభించారు. తర్వాత రాజకీయ ఉద్యమం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పటికి గాంధీజీ వయసు 77 ఏళ్లు. 1917 నుంచి 1947 వరకు 30 ఏళ్లు గాంధీజీ ఉద్యమ జీవితం గడిపారు.


మౌంట్ బాటన్ ప్లాన్
1945 నాటికి బ్రిటిష్ ప్రభుత్వానికీ, భారత జాతీయ కాంగ్రెస్‌కు మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ‘మౌంట్‌బాటన్ ప్లాన్’ తయారైంది. ఆ ప్రకారం 1947లో బ్రిటిష్ ఇండియా విభజన జరిగి ఇండియా, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు మత ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. అయితే విభజనకు ముందు, తర్వాత కూడా కొన్ని నెలల పాటు రెండు ప్రాంతాలలో మతకల్లోలం చెలరేగింది. గాంధీజీ ఈ విభజనను వ్యతిరేకించారు. కల్లోలాన్ని చల్లబరిచేందుకు ఆయన కలకత్తా, ఢిల్లీలలో నిరాహార దీక్షలు చేపట్టారు కూడా. అటు, ఇటు.. ప్రజలు, ప్రభుత్వాలు సద్దుమణిగే సమయంలో మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. గాంధీజీ మరణం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మహాత్ముడికి మరణం అనేది ఉంటుందా?! ఉండదు. మానవాళి గాంధీమార్గంలో నడుస్తున్నంత కాలం ఏ తరంలోనైనా మహాత్ముడు జీవించి ఉన్నట్లే.         


మహాత్మాగాంధీ - మరికొన్ని విశేషాలు
గాంధీజీ పేరు ఐదుసార్లు నామినేట్ అయినా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు! గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పౌరహక్కుల ఉద్యమం నాలుగు ఖండాలకు, 12 దేశాలకు విస్తరించింది!  గాంధీజీ అంతిమ యాత్ర 8 కి.మీ. పొడవున సాగింది! గాంధీ ఏ దేశానికి వ్యతిరేకంగా పోరాడారో ఆ దేశమైన బ్రిటన్ ఆయన చనిపోయిన 21 ఏళ్ల తర్వాత ఆయన గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది.    గాంధీజీ తన ఉద్యమ జీవిత కాలం మొత్తం మీద రోజుకు 18 కిలోమీటర్ల చొప్పున నడవడమో ప్రయాణించడమో చేశారు. అది ప్రపంచాన్ని రెండుసార్లు చుట్టి వచ్చినంత దూరం.


బోయర్ యుద్ధంలో గాంధీజీ  డచ్చివాళ్లపై పోరాడుతున్న బ్రిటన్‌కు మద్దతుగా క్షతగాత్రులకు సేవలు అందించారు.  అప్పుడే ఆయనలో అహింసా బీజాలు నాటుకున్నాయి. టాల్‌స్టాయ్, ఐన్‌స్టీన్, హిట్లర్ వంటి ప్రసిద్ధులతో గాంధీజీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.  ఆపిల్ కంపెనీ సీఈవో, స్టీవ్ జాబ్స్ గాంధీజీ అభిమాని. అచ్చు గాంధీజీ ధరించిన గుండ్రటి కళ్లజోడు లాంటివే ఆయన స్మృత్యర్థం జాబ్స్ వాడేవారు. గాంధీజీ ఇంగ్లిష్ మాట తీరు ఐరిష్ యాసతో ఉండేది. బాల్యంలో ఒక ఐరిష్ టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవడమే అందుకు కారణం. దేశంలో 50కి పైగా ప్రధాన రహదారులు, విదేశాలలో దాదాపు 50 వరకు రోడ్లు గాంధీజీ పేరు మీద ఉన్నాయి. జాతి వివక్షకు వ్యతిరేకంగా గాంధీజీ తన అహింసా ఉద్యమ ప్రచారానికి ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించారు. దక్షిణాఫ్రికాలో ఫుట్‌బాల్ క్లబ్బుల స్థాపనకు చొరవ చూపారు.


జాతిపిత జలసమాధి!
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో అధికారులు నీళ్లల్లో పడేసిన గాంధీ విగ్రహాన్ని వెతికి బుడమేరు కాలువ నుంచి బయటకు తీస్తున్న దృశ్యం.

మరిన్ని వార్తలు