దేశంలోనేతొలి మహిళా సౌండ్‌ రికార్డిస్ట్‌

21 Jan, 2020 09:01 IST|Sakshi
సాజిదా ఖాన్‌

ధ్వనిముద్రణ చాలా నైపుణ్యంతో కూడిన పని.ఏళ్ల తరబడి ఈ రంగంలో పురుషులే ఉన్నారు.కాని ఇన్నాళ్లకు ఒక స్త్రీ ఈ రంగంలో ప్రతిభ చాటుతోంది.సినిమా రంగంలో పని చేస్తూ దేశంలోనేతొలి మహిళా సౌండ్‌ రికార్డిస్ట్‌గా చరిత్ర లిఖించింది.ఈమెది హైదరాబాద్‌. ఇది మన ఘనత.

స్టూడియోలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
రికార్డింగ్‌లో లగ్నమై ఉంది సాజిదా ఖాన్‌. ఏ శ్రుతిని ఎక్కడ పెంచాలి.. ఏ లయను ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు ఆమెకు. ఆ నైపుణ్యం ఉండటం వల్లే తెలుగు, తమిళ, మలయాళ భాషలన్నిటిలో ఇప్పటి వరకు 60 సినిమాలకు ఆడియో ఇంజనీర్‌గా అవకాశం దక్కింది. ఆ ఘనత ఢిల్లీకి తెలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా దేశంలోనే తొలి మహిళా మ్యూజిక్‌ టెక్నీషియన్‌గా అవార్డు
(2019లో) అందుకునేలా చేసింది. సంగీత జ్ఞానం సరే.. తేనెలూరే ఆమె స్వరానికి డబ్బింగ్‌ చెప్పే చాన్స్‌ వచ్చింది. అలా ‘హరి ఓం’ అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌ నిషా కొఠారీకి, ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’, ‘చోర్‌’ అనే హైదరాబాదీ మూవీస్‌లోని హీరోయిన్స్‌కూగొంతిచ్చింది.

సాజిదా గురించి..
హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తండ్రి సలీం అహ్మద్‌ ఖాన్‌ రెల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో రిటైర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌. తల్లి జైనబ్‌ ఖాన్‌ గృహిణి.  సాజిదానే మొదటి సంతానం. ఆమెకు ఒక తమ్ముడు, చెల్లి. కల్చరల్‌ యాక్టివీటిస్‌ అంటే సాజిదాకు మొదటి నుంచీ ఆసక్తే. అందులో సంగీతం అంటే మరీ. నాల్గవ తరగతిలో ఉన్నప్పుడే వీణ నేర్చుకుంది. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనడం బహుమతులు తెచ్చుకోవడమే.  స్కూల్‌ తరపున దూరదర్శన్‌లోనూ ప్రోగ్రామ్‌లు ఇచ్చేది. ‘దానివల్ల స్టేజ్‌ ఫియర్‌ పోయింది. మైక్‌ ముందు ఎలా ఉండాలి అన్న డిసిప్లిన్‌ కూడా అలవడింది’ అంటుంది సాజిదా. ఇవే ఆ తర్వాత ఆమె విజయాలకు సోపానాలయ్యాయి.

టెక్నీషియన్‌గా..
చాలామంది తల్లిదండ్రుల్లాగే సాజిదా తల్లిదండ్రులూ అమ్మాయి ఇంజనీర్‌ కావాలి అనుకున్నారు. ఆ లక్ష్యం కోసమే ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుంది. కాని మనసంతా స్వరాలు, రాగాల మీదనే. వార్షిక పరీక్షలైపోగానే ఎప్పుడు టైమ్‌ దొరికితే అప్పుడు సంగీతం నేర్చుకోవడానికి వెళ్లేది. అలాగే టెక్నికల్‌ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికీ కంప్యూటర్స్‌ కోర్స్‌లో చేరింది. మల్టీమీడియాలో జాయిన్‌ అయ్యి యానిమేషన్, ఇల్లస్ట్రేషన్స్‌ వంటివాటిలోనూ శిక్షణ పొందింది. ఇంటర్‌ పూర్తయ్యాక.. ఇంజనీరింగ్‌కు వెళ్లక గీతాంజలి అనే మ్యూజిక్‌ రికార్డింగ్‌ స్టూడియోకు మళ్లింది. తల్లిదండ్రులు ఆశ్చర్యపోలేదు. ఆగ్రహావేశాలకూ లోనుకాలేదు. ఏదో తపన పడుతోంది.. ఏదో సాధించాలనుకుంటోంది.. చేయనీ అని ప్రోత్సహించారు. గీతాంజలి స్టూడియో యజమాని, సంగీత దర్శకుడు లలిత్‌ సురేష్‌కు అసిస్టెంట్‌గా చేరింది సాజిదా. ముందు యేడాదిన్నర మెలకువలు నేర్చుకుంది. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్, డబ్బింగ్‌ రికార్డ్‌ చేయడం అన్నిట్లో తర్ఫీదు పొందింది. తర్వాత అక్కడే పని చేయడం ప్రారంభించింది. ఇవన్నీ మరింత సమర్థవంతంగా చేయాలంటే సంగీత స్వరజ్ఞానం తప్పనిసరి అని అర్థమైంది సాజిదాకు. ఓ వైపు స్టూడియోలో వర్క్‌ చేస్తూనే తెలుగు యూనివర్శిటీలో మ్యూజిక్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న శేషులత దగ్గర సంగీతమూ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇంకోవైపు పియానో, వెస్ట్రన్‌ నొటేషన్‌లో ట్రైనింగూ స్టార్ట్‌ చేసింది. ‘ఆ టైమ్‌లో కేవలం నాలుగు గంటలే నిద్రపోయేదాన్ని. ఇప్పుడూ అంతే అనుకోండి. అప్పుడు నేర్చుకోవడంలో.. ఇప్పుడు పనితో’ నవ్వుతూ అంటుంది సాజిదా.

నటనలోనూ..
సాజిదాకు నటన కూడా తెలుసు. ఆ రంగంలో అవకాశం వచ్చినా వద్దనుకుంది. టెక్నీషియన్‌గానే స్థిరపడ్డం ఇష్టం అంటుంది. అయితే లలిత్‌ సురేష్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడే తన గొంతును అరువు ఇచ్చే అవకాశం రావడంతో ఒక తెలుగు, రెండు హైదరాబాదీ సినిమాల్లో డబ్బింగ్‌ చెప్పింది. ఆడియో ఇంజనీర్‌గా గురి, శోకం, ఆంధ్రావాలా, కేక, అడవి నా తల్లిరో, ముళ్ల కిరీటం, వాల్‌పోస్టర్, లవకుశ, జూన్‌ ఆర్‌ వంటి తెలుగు, తమిళ, మలయాళ భాషా సినిమాలతోపాటు ఒక భోజ్‌పురి సినిమాకూ పని చేసింది. ‘‘హిందీలోనూ చాన్స్‌ వచ్చింది కాని తీసుకోలేదు’’ అని చెప్పింది సాజిదా.

బుక్‌ ఆఫ్‌ షాడో.. స్టూడియో 6htz
సినిమాలతోపాటు డాక్యుమెంటరీలు,జింగిల్స్, అన్ని మతాల భక్తి గీతాలు, ఆల్‌ ఇండియా రేడియో రికార్డింగ్స్‌కు పని చేసింది. చేస్తూనే ఉంది కూడా. సాహిత్యం అంటే ఇష్టపడే సాజిదా ఎలాంటి పుస్తకమైనా అందరికీ అర్థం కావాలంటే వినిపించాలి. అప్పుడే అది అందరికీ చేరుతుంది అంటుంది. పిల్లలు, పెద్దల సాహిత్యాన్ని ఇంటింటికీ వినిపించేందుకు ‘బుక్‌ ఆఫ్‌ షాడో’ అనే యూట్యూబ్‌ పాడ్‌కాస్ట్‌ చానెల్‌ను స్టార్ట్‌ చేసింది. ఈ చానెల్‌ ద్వారా ఎవరి పుస్తకాలను వాళ్లే వచ్చి చదువుకోవచ్చు పిల్లలైనా.. పెద్దలైనా! అలాగే యేడాదిన్నర కిందట సొంతంగా రికార్డింగ్‌ స్టూడియో పెట్టుకుంది 6htz పేరుతో.

భవిష్యత్‌ ప్రణాళికలు..
ఈఎండాకాలం నుంచి అమ్మాయిలకు, యంగ్‌ విడోస్‌కు మల్టీమీడియాలో శిక్షణా తరగతులను మొదలు పెట్టాలనుకుంటోంది. అలాగే త్వరలోనే త్వరలోనే పోస్ట్‌ప్రొడక్షన్‌ స్టూడియోను ప్రారంభించాలనుకుంటోంది. దీనిద్వారా యువతకు  గ్రాఫిక్స్, ఎడిటింగ్, రికార్డింగ్‌.. ఇలా పోస్ట్‌ప్రొడక్షన్‌కు సంబంధించిన అన్ని రంగాల్లో శిక్షణ ఇప్పించాలనుకుంటోంది  నామమాత్రపు రుసుముతో. అంతేకాదు సూఫీ సంగీతం, తబలా వంటి కళల్లోని వాటికి సంబంధించిన పెద్దతరం కళాకారులతో ఈ తరానికి బోధనా తరగతులను నిర్వహించాలనుకుంటుంది. ‘‘దీనివల్ల ఆ కళాకారులకు ఉపాధినివ్వడంతోపాటు ఆ కళను బతికించుకున్న వాళ్లమూ అవుతాం’’ అంటుంది సాజిదా ఖాన్‌.

సవాళ్లు.. అవకాశాలూ..
రెండూ ఉంటాయి. మేల్‌ డామినేటింగ్‌ ఫీల్డే. కాని ఆడవాళ్లకు అవకాశాలు లేవు అనడానికి లేదు. నిజానికి నేనెక్కడా అలాంటి డిస్క్రిమినేషన్‌ ఎదుర్కోలేదు ఇంటి నుంచి వర్క్‌ప్లేస్‌ దాకా. ఆ మాటకొస్తే పనికి, టాలెంట్‌కు, వర్కింగ్‌ టైమ్‌కు జెండర్‌ ఉండదు అంటాను. సవాళ్ల విషయానికొస్తే.. అవి ఉంటేనే కదా మన సామర్థ్యం బయటపడేది. పనెప్పుడూ టాలెంట్‌నే వెతుక్కుంటుంది కదా.  చేసిన వర్క్‌కు గుర్తింపు దొరికింది అంటే మనం మరింత నైపుణ్యం పెంచుకోవాలని అర్థం. ఈ ఫీల్డ్‌లో పోటీలో ఉండాలంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి యాక్టివ్‌గా ఉండాలి. అలా ఎప్పుడూ చాలెంజింగ్‌గా ఉండడానికే ఇష్టపడ్తాను.– సాజిదా ఖాన్‌

మరిన్ని వార్తలు