భారతీయ గృహిణికి రాచమర్యాద

4 Apr, 2014 05:37 IST|Sakshi
భారతీయ గృహిణికి రాచమర్యాద

విశిష్ట సామాజిక సేవలను అందిస్తున్న వారికి బ్రిటిష్ రాజకుటుంబం చేతుల మీదుగా ఇచ్చే ‘డేమ్ కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ (డిబిఇ) టైటిల్ (ఇదే డేమ్‌హుడ్) ఆశా ఖేమ్కాకు దక్కింది. ఈ గౌరవం దక్కిన రెండో భారతీయ మహిళ ఆమె. ఒకప్పుడు ఇంగ్లీషు అక్షరం ముక్క రాని ఆశ నేడు విద్యావేత్తగా ఈ స్థాయికి ఎదగడం విశేషం. ఇకపై ఆమె బ్రిటన్‌లో ఎక్కడి కెళ్లినా ఆశా అని కాకుండా ‘డేమ్ ఆశా’ అని సంబోధిస్తారు.
 
బీహార్ లోని సీతామఢీ నుంచి 1978లో లండన్ వెళ్లే నాటికి ఆశాఖేమ్కా ఇంగ్లిష్ ముక్క ఎరుగరు. ఇంగ్లిష్ మాట్లాడ్డం, రాయడం రెండూ రావు. అయితే ఇవాళ ఆవిడ ఓ విద్యావేత్త. దీనర్థం ఆశ ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని మాత్రమే కాదు, తనతో పాటు ఎందరికో ఆమె జీవితాన్నిచ్చారనీ, వాళ్ల జీవన గతినే మార్చారనీ!
 
లండన్‌లోని వెస్ట్ నాటింగ్‌హామ్‌షైర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆశాఖేమ్కా అకస్మాత్తుగా ఇప్పుడు వార్తల్లోకి రావడానికి తగిన కారణమే ఉంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘డేమ్‌హుడ్’ టైటిల్‌ను ఇటీవలే ఆమె అందుకున్నారు. బ్రిటన్ రాణి లేదా రాజు స్వహస్తాలతో ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని 1917లో నెలకొల్పారు.
 
నాటి నుంచి నేటి వరకు ‘డేమ్‌హడ్’ టైటిల్ అందుకున్న రెండో మహిళ ఆశాఖేమ్కా. (తొలిమహిళ ధార్ మహారాణి లక్ష్మీదేవి. 1931లో ఆమె ఈ టైటిల్ పొందారు). మగవాళ్లకు ఇచ్చేది ‘నైట్‌హుడ్’ అయితే, ఆడవాళ్లకు ఇచ్చేది ‘డేమ్‌హుడ్’. ఎంతోకాలంగా అత్యంత అమూల్యమైన, విశిష్టమైన సామాజిక సేవలను అందిస్తున్న వారికి ఇచ్చే ‘డేమ్ కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ (డిబిఇ) టైటిల్ (ఇదే డేమ్‌హుడ్)ను ఆశాఖేమ్కా గతవారం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇకనుంచి బ్రిటన్‌లో ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమెను ఆశా అని కాకుండా ‘డేమ్ ఆశా’ అని సంబోధిస్తారు.
 
రుణపడి ఉంటాను...

 ‘‘సాధారణంగా నేను మాటలకు తడుముకోను. పదాలను వెతుక్కోను. కానీ డేమ్‌హుడ్‌ను స్వీకరిస్తున్నప్పుడు దాదాపుగా మూగబోయినంత పని చేశాను. ఈ టైటిల్ ఇచ్చినవారికి నేనెంతో రుణపడి ఉన్నాను. నా కలలను నిజం చేసుకోడానికి నాకు లభించిన ఈ ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని అన్నారు ఆశాఖేమ్కా అవార్డు అందుకుంటూ. ఆశా సేవలు లండన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఇండియాలో ‘అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్’కు ఆమె చైర్‌ప  ర్సన్. త్వరలోనే చండీగఢ్‌లో ఒక ‘స్కిల్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నారామె. అక్కడి నుంచి దేశంలోని యువతీయువకులకు ఇంగ్లిషులో, మేథమేటిక్స్‌లో ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పించాలని ఆమె ఉద్దేశం. ఆశ భర్త శంకర్‌లాల్ ఖేమ్కా పాట్నాలో ట్రామా, ఆర్థోపెడిక్  సర్జన్. 1975లో వైద్యార్హతల కోసం పాట్నా మెడికల్ కాలేజ్‌లోని ‘నేషనల్ హెల్త్ సర్వీస్’లో చేరారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. అమ్మాయి షాలిని, ఇద్దరు అబ్బాయిలు... షీల్, స్నేహ్.
 
పదిహేనేళ్లకే...

న్యాయమూర్తుల కుటుంబం నుంచి వచ్చిన ఆశ తన 13వ యేట చదువు మానేయవలసి వచ్చింది. 15వ యేట వివాహం అయింది. కుటుంబంతో సహా ఇంగ్లండ్ వెళ్లే నాటికి నిరక్షరాస్యురాలైన ఈ పాతికేళ్ల యువతికి అంత ఇంగ్లిషు ఎలా వచ్చింది? అంటే టీవీలో పిల్లల ఛానల్స్ చూసి నేర్చుకున్నారు. ఆపిన చదువును తిరిగి కొనసాగించారు. అప్పటికే ఆమె ముగ్గురు పిల్లలు స్కూలుకు వెళుతున్నారు. టీచర్  కెరీర్‌ను ఎంపిక చేసుకున్న ఆశ కార్డిఫ్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ డిగ్రీ పూర్తి చేశారు.

డేమ్‌హుడ్‌కు ఆశా ఎంపికైనట్లు ప్రకటిస్తూ -‘‘వెస్ట్ నాటింగ్‌హామ్‌షైర్ ప్రిన్సిపాల్‌గా ఆశాఖేమ్కా... వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని నిరాదరణకు గురైన వారెందరినో చేరదీసి విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఆమె నేతృత్వంలో ఆ కళాశాల బ్రిటన్‌కే వన్నెతెచ్చారు’’ అని బ్రిటన్ ప్రభుత్వ విభాగమైన కేబినెట్ ఆఫీస్ ప్రకటించింది.
 

మరిన్ని వార్తలు