అమెరికాలో భార'టీ'యత

4 Jun, 2016 23:53 IST|Sakshi
అమెరికాలో భార'టీ'యత

గరమ్ గరమ్
శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒక పెద్ద కంపెనీలో ఇంజనీరింగ్ మేనేజర్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం ఉద్యోగం నుంచి కొద్దిగా విరామం తీసుకున్న గౌరవ్ చావ్లాకు తరచూ టీ తాగాలని నాలుక పీకేస్తూ ఉంటుంది. అందులోనూ సరైన ఐడియా కోసం బుర్ర బద్దలు కొట్టుకుంటున్నప్పుడు తేనీరు సేవించాలని అనిపిస్తుంటుంది. ఇంట్లో చేసుకొనే టీ లాంటి టీ కోసం తహతహలాడతాడు. గమ్మత్తేమిటంటే, గౌరవ్ లాంటి టీ ప్రియులు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే సమస్య. అల్లం, ఏలకులు వేసి, వేడివేడి పాలతో కమ్మటి టీ పెట్టుకొని తాగడానికి అలవాటు పడ్డ ప్రాణానికి టీ లేకుండా కష్టమే!

ఈ ఇబ్బందులకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గౌరవ్‌చావ్లా, ఆయన మిత్రుడైన సమీప్ భావ్‌సర్‌లు ఒక పరిష్కారం కనుక్కున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఈ ఇద్దరు భారతీయ అమెరికన్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కార్పొరేషన్లకూ, గృహాలకూ భారతీయ టీ సంస్కృతిని పరిచయం చేయదలిచారు. రైస్ కుక్కర్ తీసుకొని, దానికి మార్పులు చేర్పులు చేశారు. దాన్ని ఛాయ్ పెట్టుకొనే యంత్రంగా మార్చారు. అలా పెట్టుకొన్నది ఇంట్లో చేసుకున్న కమ్మటి తేనీటి రుచితో ఉండడంతో ఎగిరి గంతేశారు. ఇలా చేసిన మిషన్‌కు మరికొన్ని నకళ్ళు సిద్ధం చేశారు.

ఆ నమూనా టీ మిషన్లను గూగుల్ ఆఫీసుల్లో, అలాగే శబ్ద సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన ‘డాల్బీ’ సంస్థలో ప్రయోగాత్మక పరీక్షలకు పెట్టారు. అక్కడ నుంచి మంచి స్పందన వచ్చింది. అంతే! ఈ టీ మిషన్ల తయారీకి రంగం సిద్ధమైంది. ‘బ్రూచైమ్ డాట్‌కామ్’ అనే సంస్థ దీన్ని ముందుకు తీసుకువెళుతోంది. వచ్చే ఏడాది మార్చికల్లా ఈ టీ తయారీ మిషన్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయట! ప్రస్తుతానికి ఈ మిషన్‌ను 249 డాలర్ల తగ్గింపు ధరకు అమ్మాలని నిర్ణయించారు.

 అమెరికా వీధుల్లో టీ బండ్లు
‘బ్రూచైమ్’ సహ వ్యవస్థాపకురాలు కూడా మన ఇండియనే! పావన్ కొఠారీ. డిజైన్ ఇంజనీర్ అయిన ఆమె వంటింటి వస్తువుల రూపకల్పనలో పేరున్న ఓ సంస్థలో ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌లో పనిచేశారు. ఫ్రాన్స్‌లోని బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చివరకు, 2009లో ఛాయ్ అమ్మకాలకు సంబంధించి ఒక స్టార్టప్ ప్రారంభించారు. శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో ఛాయ్ అమ్మే సైకిల్ బండ్లను మొదలుపెట్టారు. ఇంట్లో చేసే టీ తాలూకు రుచిని అందరికీ అందించాలని శ్రమించారు.

టీ మిషన్ ఎలా పనిచేస్తుందంటే...

గౌరవ్ చావ్లా, సమీప్‌ల సమష్టి కృషి అయిన ఈ ‘ఛైమ్’ మిషన్‌తో ఏకకాలంలో ఒక కప్పు ఛాయ్ మాత్రమే తయారు చేసుకోవచ్చు. టీ పొడి, మసాలా దినుసుల్ని ముందుగానే మిక్స్ చేసి మిషన్‌లో ఉంచుతారు. వాటితో బ్లాక్ టీ సిద్ధమవుతుంది. దానికి పాలు కలుపుకొని, మళ్ళీ మరగబెట్టాలి. అప్పుడు టీ తయారవుతుంది. కేవలం మూడే మూడు నిమిషాల్లో ఎవరికి కావాల్సిన పద్ధతిలో వారు కమ్మటి తేనీరు సిద్ధం చేసుకోవచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా