ధీరోదాత్త కథానాయిక

29 Nov, 2019 01:50 IST|Sakshi

ప్రియా శక్తి

‘ప్రియాస్‌ శక్తి’ ఒక గ్రాఫిక్‌ నవల. 2014లో విడుదలైంది. అందులో హీరోయిన్‌ పేరు ‘ప్రియా శక్తి. ఆమె శక్తి స్వరూపిణి. తాజాగా ఇప్పుడు సీక్వెల్‌గా ‘ప్రియా అండ్‌ ది లాస్ట్‌ గర్ల్స్‌’ అనే నవల రిలీజ్‌ అయింది. ఈ మధ్య వ్యవధిలో మూడేళ్ల క్రితం ‘ప్రియాస్‌ మిర్రర్‌’ అనే నవల వచ్చింది. ఈ మూడు నవలల్లో ప్రియ పాత్రలో ఒక పరిణామ క్రమం కనిపిస్తుంది. తొలి నవల్లో ప్రియ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై పోరాడుతుంది.

రెండో నవల్లో అత్యాచారాలు, ఆసిడ్‌ దాడులపై ఫైట్‌ చేస్తుంది. తాజా నవలలో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపుతున్న వారిపై యుద్ధం చేస్తుంది. ఇటువంటి శక్తిమంతమైన పాత్రలతో అమ్మాయిలలో ఆత్మవిశ్వాసాన్ని నింపవచ్చని, సమాజంలో మార్పు తేవచ్చని ఈ సీక్వెల్‌ నవలల రచయిత రామ్‌ దేవినేని అంటున్నారు.

‘జెండర్‌ ఈక్వాలిటీ ఛాంపియన్‌’గా ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రియా శక్తి కామిక్‌ పాత్రను సృష్టించింది ఇండో–అమెరికన్‌ రైటర్‌ రామ్‌ దేవినేని. ఆ ప్రియ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తింది. అమ్మాయిలను, మహిళలను వ్యభిచారంలోకి దింపడం కోసం జరుగుతున్న అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ మూడోనవలలో పోరాటానికి సిద్ధమైంది ప్రియ. అమాయకులైన అనేకమంది అమ్మాయిలను మభ్యపెట్టి, చీకటిగృహాలకు తరలించి, వ్యభిచారం చేయిస్తుంటుంది ఒక గ్యాంగ్‌. చివరికి గ్రామంలో ఒక్క అమ్మాయి కూడా కనపడదు! అప్పుడు ప్రియాశక్తి పులిమీద కూర్చుని సాహసయాత్ర ప్రారంభించి, దుష్టుడైన రాహు గుహకి చేరుకుంటుంది. రాహు  ఆశబోతు, అసూయాపరుడు, కామమోహితుడు.

అతడే ఆ ప్రదేశాన్ని పాలిస్తుంటాడు. అక్కడ మహిళలు కేవలం మగవారికి ఆనందాన్ని కలిగిస్తూండాలి, వ్యతిరేకిస్తే, వారిని శిలగా మారుస్తాడు రాహు. రాహు కోసం పనిచేస్తున్న ఒక మహిళ, ప్రియను రాహుకి అప్పచెప్పాలనుకుంటుంది. అతడిపై పోరాడి, అతడిచేత చిక్కిన బాలికల్ని విడిపించడానికి అదే అదను అనుకుంటుంది ప్రియ. అయితే ఆమెకు విజయం కనుచూపుమేరలో కనపడదు. ఎట్టకేలకు అమ్మాయిలను విడిపించి, వెనక్కు తీసుకువస్తే, వారి తల్లిదండ్రులు ఆ పిల్లలను కుటుంబంలో చేర్చుకోవడానికి అంగీకరించరు. వెనక్కు వచ్చిన వారిని కుష్ఠువ్యాధి గ్రస్థుల కంటె నీచంగా చూడటం ప్రారంభించారు. వారిని ఊరికే తిట్టడం, నిందించడం, వెటకారాలాడటం చేస్తుంటారు.

వారిలో మార్పు కోసం ప్రియ కృషి చేస్తుంటుంది. ఇది తాజా నవల థీమ్‌. ఈ నవల రాయడం కోసం రచయిత రామ్‌ భారతదేశంలోని కొన్ని రెడ్‌ లైట్‌ ఏరియాలకు వెళ్లి స్వయంగా అక్కడి పరిస్థితులు చేశారు. ఒక చిన్న ఇరుకు గదిలో ఇద్దరు ముగ్గురు మహిళలు జీవిస్తున్నారు. వారిలో చాలామందికి వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు. వారి ఎదుటే ‘అన్నీ’ జరిగి పోతుంటాయి. ‘‘ఇది నిజంగా హృదయాన్ని కలచివేసే దృశ్యం’’ అన్నారు రామ్‌ దేవినేని. ఏటా ప్రపంచవ్యాప్తంగా పది కోట్లమంది అక్రమ రవాణా జరుగుతోందని, ఇందులో రెండు కోట్ల ఏడు లక్షల మంది పిల్లలు, మహిళల అక్రమ రవాణా ఒక్క భారతదేశంలో జరుగుతోందని ‘అప్నే ఆప్‌’ సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి  మంచి మంచి సందేశాత్మక సినిమాలు తీయడం, ప్రతీకాత్మక చిత్రాలు గీయడం వంటివి మంచి సాధనాలుగా ఉపయోగపడతాయని రామ్‌ అంటున్నారు. కామిక్స్‌తో కూడా యువతకు మంచి అవగాహన కలిగించవచ్చని అన్నారు.
– డా. వైజయంతి పురాణపండ

శక్తి బయటికి రావాలంటే భయాన్ని విడిచిపెట్టాలి!
రామ్‌ దేవినేని నిర్మాత, కథా రచయిత, సినీ దర్శకులు, పబ్లిషర్‌. న్యూయార్క్, న్యూఢిల్లీలలో సినిమాలు తీస్తూ, మ్యాగజీన్లు నడుపుతున్నారు. ‘కర్మ కిల్లింగ్స్‌’ అనే చిత్రాన్ని తీసి, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఆయన నిర్మించిన ‘రష్యన్‌ ఉడ్‌పెకర్‌’ డాక్యుమెంటరీ చిత్రానికి సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్రాండ్‌ జ్యూరీ అవార్డు లభించింది. ఇండిపెండెంట్‌ స్పిరిట్‌ అవార్డుకూ ఆ చిత్రం నామినేట్‌ అయింది. తన పాత్ర ‘ప్రియ శక్తి’ గురించి చెబుతూ.. ‘‘ప్రియ అసాధారణమైన ‘సూపర్‌ హీరో’. ఆమె ఆలోచనా విధానమే ఆమె బలం. సూపర్‌మ్యాన్‌ శక్తి కంటె, ఒక ఆలోచనే శక్తిమంతమైనది. ప్రతి మనిషిలోను ఆ శక్తి అంతర్లీనంగా దాగి ఉంటుంది. అయితే మనిషిలో ఉండే భయం ఆ శక్తి మరుగున పడేస్తుంది. ఆ భయాన్ని వదులుకుంటే దేన్నయినా జయించగలం’’ అని అన్నారు రామ్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు