స్వర్గంలో... చిరునవ్వు

16 Dec, 2015 02:56 IST|Sakshi
స్వర్గంలో... చిరునవ్వు

గులాబీని వేరే పేరుతో పిలిచినా  దాని పరిమళం మారదు. రేప్ విక్టిమ్‌ని మరో పేరుతో పిలిచినా ఆ బాధ మానదు. ‘నాపై అత్యాచారం చేసిన ఐదుగురూ... బాహాటంగా తిరుగుతుంటే... అత్యాచారానికి బలైన నేనెందుకు తల వంచుకోవాలి? నేనెందుకు ముఖం దాచుకోవాలి?’ అని ప్రశ్నించి... తన ఉనికి నిర్భయంగా చాటుకున్న తొలి రేప్ విక్టిమ్ ఇండియాలో
బహుశా... సుజెట్ జోర్డన్ ఒక్కరేనేమో!! ఐడెంటిటీని బయట పెట్టుకున్నందుకు సుజెట్‌ను కొందరు అవమానించారు.
ఎందరో అభినందించారు. మూడున్నరేళ్లు నడిచిన ఈ కేసులో నిన్నమొన్ననే తీర్పు వచ్చింది. దోషులకు కఠిన శిక్ష పడింది.
కానీ తీర్పును వినడానికి సుజెట్ జోర్డన్ బతికిలేరు. స్వర్గంలో మాత్రం ఆమె ముఖంపై చిరునవ్వు పూసే ఉంటుంది.
 

కోల్‌కతా పార్క్‌స్ట్రీట్ గ్యాంగ్ రేప్... మూడేళ్ల కిందట సంచలనం రేపింది. సుజెట్ జోర్డన్ అనే 38 ఏళ్ల మహిళను టాక్సీకారులో పార్క్‌స్ట్రీట్ అంతా తిప్పుతూ అయిదుగురు రేప్ చేశారు. మూడేళ్ల న్యాయ పోరాటం తర్వాత ఈ నెల పదో తారీఖున కోల్‌కతా సెషన్స్ కోర్టు అయిదుగురిలో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్షతోపాటు, లక్ష రూపాయల జరిమానా విధించింది. ఇంకో ఇద్దరు నేటికీ పరారీలో ఉన్నారు.
 
ఎవరీ సుజెట్ జోర్డన్?

 కోల్‌కతాలోని ఒక ఆంగ్లో ఇండియన్. ఇద్దరు టీనేజ్ ఆడపిల్లల తల్లి. ఆ పిల్లలను పెంచడానికి అష్టకష్టాలు పడ్డ  సింగిల్ పేరెంట్. కొన్నాళ్లు సేల్స్ ఉమన్‌గా.. ఇంకొన్నాళ్లు హోటల్ తాజ్ బెంగాల్‌లోని హెల్త్ క్లబ్‌లో రిసెప్షనిస్ట్‌గా, మరికొన్నాళ్లు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌గా... ఏ పని దొరికితే ఆ పని చేసింది. ఆ ఉద్యోగాలతో సుజెట్  విసిగివేసారి ఉన్నప్పుడే.. అంటే 2011లో ఆమె  చెల్లెలు కొంతమంది స్నేహితుల సహాయంతో  ఓ కాల్ సెంటర్ పెట్టింది. నిర్వహణా బాధ్యతను అక్క సుజెట్‌కు ఇచ్చింది. అయితే ఏడాది తిరక్కుండానే చెల్లెలిని స్నేహితులు మోసం చేశారు. డబ్బు నష్టపోయి కాల్‌సెంటర్‌ను షట్ డౌన్ చేసుకోక తప్పలేదు. సుజెట్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఉద్యోగాల వేటలో పడింది. ఆ సమయంలో కోల్‌కతాలోని పార్క్‌స్ట్రీట్‌లో ఉన్న పార్క్ హోటల్ నైట్‌క్లబ్ ‘తంత్రా’లో తన స్నేహితులను కలుస్తుండేది. అలా 2012, ఫిబ్రవరి అయిదో తారీఖునా కలిసింది. ఆ రాత్రి తిరిగి ఇంటికి వెళ్తుంటేనే ఆమె మీద లైంగిక దాడి జరిగింది.
 
పార్క్‌స్ట్రీట్ రేప్ విక్టిమ్

 ఆ దారుణం గురించి సుజెట్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఈ గుట్టు మీడియాలో గుప్పుమని దేశమంతటా రట్టయింది. విచారణ ఇంకా మొదలవకముందే బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీ.. దీన్నో  కల్పిత ఘటనగా ప్రకటించింది. అంతే ఆమె స్టేట్‌మెంట్ మీడియా పుట్టించిన అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. వెంటనే ఈ కేసును పార్క్‌స్ట్రీట్ రేప్ కేస్‌గా, సుజెట్ జోర్డన్‌ను ‘పార్క్‌స్ట్రీట్ రేప్‌విక్టిమ్’గా అభివర్ణించడం మొదలుపెట్టింది మీడియా. వార్తా పత్రికల్లో, వార్తా ఛానళ్లలో సుజెట్ ఫోటోను బ్లర్ చేస్తూ న్యూస్ రాశారు, ప్రసారం చేశారు. వాటిని చూసిన ప్రతిసారి ఆమెలో అసహనం పెరిగేది. తనను మీడియా పార్క్‌స్ట్రీట్ రేప్ విక్టిమ్‌గా పిలుస్తుంటే మనసును ముల్లుతో గుచ్చినట్టు విలవిల్లాడేది. తప్పు చేసింది ఆ అయిదుగురు అయితే నేనెందుకు పేరు మార్చుకొని, నా మొహం కనిపించకుండా తప్పించుకుని తిరగాలి? అని మథనపడింది.

అదే ఏడు డిసెంబర్‌లో నిర్భయ ఘటన జరిగింది. నిర్భయ తల్లిదండ్రులకు సంఘీభావం తెలుపుతూ వాళ్లకు అండగా నిలబడింది సుజెట్. అప్పుడే తనను పార్క్‌స్ట్రీట్ రేప్ విక్టిమ్‌గా కాకుండా తన సొంత పేరుతో ఉచ్చరించమని మీడియాకు చెప్పాలనుకుంది. కానీ ఆమె బిడ్డల భవిష్యత్ దృష్ట్యా తొందరపడొద్దని స్నేహితులు వారించారు.
 
కముదిని గ్యాంగ్‌రేప్
 నిర్భయ ఉదంతం తర్వాత అంత చర్చ జరిగినా దేశంలోని స్త్రీల పరిస్థితుల్లో మార్పులేదు. రేప్‌లు ఆగలేదు. 2012, జూన్‌లో బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో కముదిని అనే 20 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్‌రేప్ చేసి చంపేశారు. దానికి వ్యతిరేకంగా.. కోల్‌కతాలో పెద్ద ర్యాలీ జరిగింది. అందులో సుజెట్ కూడా పాల్గొంది. అప్పటికే స్త్రీల మీద జరుగుతున్న హింసకు, లైంగిక దాడులకు వ్యతిరేకంగా గొంతు విప్పి చాలా చర్చల్లో పాల్గొంటోంది సుజెట్. కానీ పార్క్‌స్ట్రీట్ రేప్‌విక్టిమ్ తానేనని ఎక్కడా బయటపెట్టలేదు. అయితే కముదిని తల్లిదండ్రులకు మద్దతుగా జరిగిన  ఈ ర్యాలీలో మాత్రం తన ఉనికిని దాచుకోవాలనుకోలేదు. ఏమైనా సరే ఆత్మబలంతో ముందుకు నడవాలనుకుంది. అందుకే ఆ ర్యాలీలో ‘పార్క్‌స్ట్రీట్ రేప్ విక్టిమ్‌ని నేనే.. ఇక నుంచి నన్ను ఆ పేరుతో పిలవద్దు. నా పేరు సుజెట్ జోర్డన్.. సుజెట్ జోర్డన్ అనే ఉచ్చరించండి. నా ఫోటోను బ్లర్ చేయొద్దు.. స్పష్టంగానే చూపించండి’ అంటూ ప్రకటించింది  పేరును బయటపెట్టిన తొలి రేప్ విక్టిమ్‌గా ఆత్మవిశ్వాసంతో నిలబడింది సుజెట్. ఇదీ పెద్ద సంచలనమే అయింది.
 
ఎదురీత..
 సుజెట్ స్నేహితులు హెచ్చరించినట్టే.. ఆమె తన పేరును బయటపెట్టుకున్న మరుక్షణమే సుజెట్ ఉంటున్న కాలనీలో ఆమె పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్లు వెళ్తుంటే ‘పార్క్‌స్ట్రీట్ రేప్ విక్టిమ్ ఎవరో కాదు వీళ్ల అమ్మే’ అంటూ వేలుపెట్టి చూపించేవారు. తుంటరి మగపిల్లలు రాత్రుళ్లు సుజెట్  వాళ్లింటి ముందుకు వచ్చి ఈలలు వేయడం,  నువ్వు వస్తావా? నీ పిల్లల్ని పంపిస్తావా?’ అంటూ అరిచేవాళ్లు. ఈ న్యూసెన్స్, నాన్‌సెన్స్ భరించలేక ఉన్న పళంగా సుజెట్‌ను ఇల్లు ఖాళీ చేయించేశారు ఇల్లు గలవాళ్లు. ఆ తర్వాత ఆమెకు ఇల్లు దొరకడమే కష్టమైంది. ఉద్యోగం అయితే సరేసరి. అయినా అధైర్యపడలేదు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆ ఎదురీతను ఆపలేదు. ఒకవైపు తన కేసుకి సంబంధించి న్యాయపోరాటం చేస్తూనే తతిమా రేప్ విక్టిమ్‌లకు అండగా నిలబడింది. అలా సోషల్‌మీడియాలోని రేప్ సర్వైవర్స్ గ్రూప్స్ అన్నిటికీ ఆమె ఓ రోల్‌మోడల్ అయింది. ఆ గ్రూప్స్‌లో ఈమెనూ చేర్చుకున్నారు. రేప్ విక్టిమ్స్‌కి సామాజిక న్యాయం అందజేయడానికి ఓ హెల్ప్‌లైన్‌ను ఆరంభించింది సుజెట్.  చైల్డ్ అబ్యూజ్, సెక్సువల్ ఎబ్యూజ్ లాంటి వాటి మీద మాట్లాడ్డానికి కోల్‌కతాలోని స్కూళ్లు, హోమ్స్, కాలేజీలు, ఆఫీసులు, స్వచ్ఛంద సంస్థలు ఆమెనే  పిలవసాగాయి. ఇన్ని సానుకూలతలను సాధించగలిగినా పోయిన ఉద్యోగాన్ని మాత్రం పొందలేకపోయింది సుజెట్. అయినా కుంగిపోలేదు. పోరాటం సాగించింది.
 
మూడేళ్లకు గెలిచింది.. ఆ అయిదుగురిలో  ముగ్గురికి శిక్షపడేలా చేసి
!
అయితే.. తన విజయాన్ని చూసుకోవడానికి..  సుజెట్ ఇప్పుడు లేదు. ఎనిమిది నెలల కిందట మెనింజైటిస్ (మెదడువాపు వ్యాధి) ఆమెను ఈలోకం నుంచి తీసుకెళ్లిపోయింది. కానీ ఆ పోరాట స్ఫూర్తి మాత్రం ఉంది.. ఉంటుంది మహిళలందరికీ మద్దతుగా!
 

మరిన్ని వార్తలు