లాక్మేలో న్యూ లుక్‌

10 Jan, 2017 23:21 IST|Sakshi
లాక్మేలో న్యూ లుక్‌

ఇండియన్‌  ర్యాంప్‌పై తొలి ట్రాన్స్‌జెండర్‌
రిపోర్టర్స్‌ డైరీ

అంజలి లామా (32). నేపాల్‌ ‘అమ్మాయి’. వచ్చే నెల ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేయబోతోంది. ఒక ట్రాన్స్‌ జెండర్‌ మోడల్‌ తొలిసారి ఇండియన్‌ ర్యాంప్‌పైకి వెళ్లబోవడమే ఇందులోని సంచలనం. అంజలి అమ్మాయి కాదు. అబ్బాయి.  నవీన్‌ వైబా అనే అబ్బాయి! అతడు అంజలిగా మారడమే ఒక విశేషమైతే, ఏకంగా గ్లామర్‌ వరల్డ్‌లో పాదం మోపడం మరీ విశేషం. ఈ న్యూస్‌ తెలియగానే ‘సాక్షి’ ఆమెను అభినందించింది. ఆమెతో ముచ్చటించింది. అంజలి మనోభావాలివి.

ఇంట్లోంచి.. వెళ్లగొట్టారు
నేపాల్‌లోని నువాకట్‌ నా బర్త్‌ ప్లేస్‌. మాది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచే సమాజంలో లైంగికపరంగా ఉన్న వైరుధ్యాలను చూస్తూ పెరిగాను. అబ్బాయిలు, అమ్మాయిలు తమదైన సహజ స్వభావంతో ఎలా ప్రవర్తిస్తారో గమనిస్తున్నప్పుడు అందుకు భిన్నంగా.. నా ప్రవర్తన, ఆలోచనలు ఉండడం గ్రహించాను. అమ్మతో నాకు ఎక్కువ దగ్గరితనం. నా ఫ్రెండ్స్‌ అంతా అమ్మాయిలే. ఎప్పుడూ వాళ్లతో ఉండేవాడిని. వాళ్లతో కంఫర్ట్‌గా అనిపించేది. నేనూ దాదాపుగా ఒక అమ్మాయిలా మారిపోయాను. అందరూ నన్ను వింతగా చూడడం మొదలైంది. చివరకు నా ప్రవర్తనతో తలెత్తుకోలేకపోతున్నామంటూ నా కుటుంబం కూడా నన్ను తరిమేసింది.

గ్లామర్‌ ఫీల్డ్‌ ‘ఛీ’ కొట్టింది
చిన్నప్పటి నుంచి మోడలింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఖాట్మాండులో మోడలింగ్‌ ట్రైనింగ్‌ పూర్తి చేశాను. ఒక మ్యాగజీన్‌ కవర్‌ పేజీ కోసం ఏర్పాటు చేసిన ఫోటో షూట్‌తో.. నా జీవితం ప్రారంభం అయినప్పఅయింది. అయితే అడుగడుగునా నా ప్రయాణం  కష్టంగా మారింది. అనేక రకాలుగా ఎదురు దెబ్బలు తగిలాయి. ట్రాన్స్‌ జెండర్‌ అనే ఏకైక కారణంతో గ్లామర్‌ ప్రపంచం నన్ను తిరస్కరించింది. చాలా ఏడ్చాను. స్నేహితులు, బంధువులు అంతా ఈ వృత్తిని వదిలేయమని సలహా ఇచ్చారు. కాని  నేను వదిలిపెట్టలేదు. నా పై నాకున్న నమ్మకంతో, ట్రాన్స్‌జెండర్‌లు గ్లామర్‌ ఫీల్డ్‌కు పనికిరారనే అపోహ తొలగించాలనే దృఢ సంకల్పంతో ముందుకు నడిచాను. ప్రతిష్టాత్మకమైన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ దాకా రాగలిగాను. నాకు ఇష్టమైన మోడల్‌ ఆండ్రియానా లిమా. బ్రెజిల్‌.

నేనింకా పైపైకి ఎదగాలి
పూర్తిగా నా ప్రొఫెషన్‌పైనే దృష్టి పెట్టాను. మోడల్‌గా ఉంటూనే ఇంకా పెద్ద పోటీల్లో పాల్గొని గెలవాలనేది నా కోరిక. మోడలింగ్‌ రంగంపైనే పూర్తిగా నా దృష్టి ఉంటుంది. ఇక్కడే నా స్థానాన్ని ఏర్పరచుకుంటా. కానీ ఇందుకు నేను చాలా కష్టపడాలి. దేశంలో ట్రాన్స్‌జెండర్‌ కమ్యునిటీ అయిన ఎల్‌జీబీటీ (లెస్బియన్‌ గే బై సెక్సువల్‌ ట్రాన్స్‌ జెండర్‌ పీపుల్‌) హక్కుల పట్ల ఎవరికి పట్టింపు లేదు. మమ్మల్ని ఈ సమాజం అంగీకరించడం చాలా కష్టం. అయినప్పటికీ, నేను మాత్రం అతి కష్టమ్మీద అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ స్థాయికి వచ్చాను. నా విజయాలతో నాతోటి వారికి స్ఫూర్తిని కలిగించడం నా బాధ్యతగా భావించి  పని చేస్తాను.

ఫిట్‌నెస్‌ గురించి అంజలి
ఆహారం మితంగా తీసుకుని.. తగిన మోతాదులో నీళ్లు తాగుతాను. శరీరాన్ని నిరంతరం హైడ్రేట్‌గా ఉంచుకుంటాను. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఎంపికయిన తర్వాత, ఇప్పుడిప్పుడే జిమ్‌కు వెళ్లడం మొదలు పెట్టాను. నా సలహా ఒక్కటే.. మన శరీర తత్త్వాన్ని తెలుసుకుని, దానికి తగ్గ పని చెప్పాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేచురల్‌గా, సింపుల్‌గా ఉండాలి. అదే మన అందాన్ని కాపాడుతుంది.
– ఎస్‌.సత్యబాబు

మరిన్ని వార్తలు