రెండు రెళ్లు ఆరు

9 Jun, 2015 23:16 IST|Sakshi
రెండు రెళ్లు ఆరు

ఒకాయనకి జ్ఞానం అజీర్ణమై దిక్కుతోచక ఒక పుస్తకం రాసి పడేశాడు. ఆ పుస్తకాన్ని కొందరు ప్రముఖులకి పంచి శాస్త్ర ప్రకారం ఆవిష్కరణ సభ పెట్టాడు. సభా మర్యాద మేరకు వక్తలు గొంతు సవరించుకున్నారు. ‘‘ఈ పుస్తకం చదివి వారం రోజులు జబ్బుపడ్డాను. మనుషులకి డబ్బు చేసినా, జబ్బు చేసినా మబ్బుపట్టిన ఈ లోకం విచ్చుకుంటుంది. పిల్లలంతా వచ్చి ఎలాగూ నేను పోతానని రాతకోతలు పూర్తిచేశారు. వెంటిలేటర్ వాడాల్సి వస్తే, ఎన్ని రోజుల్లో తీసివేయాలో కూడా లెక్కలేశారు. ఈ పుస్తకాన్ని ఇంకెవరైనా చదివేస్తారేమోనని భయపడి ఆస్పత్రి నుంచి చక్రాల కుర్చీలో సభకు వచ్చేశాను’’ అన్నాడో ముసలాయన.

 ఆ ఊళ్లో అనేకమంది పిచ్చికి కారణమైన ఒక మానసిక వైద్యుడు లేచి, ‘‘పిచ్చి రెండు రకాలు. తనకు మాత్రమే పిచ్చి ఉందనుకోవడం, తనకు తప్ప ఈ లోకానికంతా పిచ్చి ఉందనుకోవడం. లోకమంతా వీళ్లతోనే నిండి ఉండటం వల్ల నేను బిజీగా ఉండిపోయి, ఈ పుస్తకాన్ని ఒక మిత్రుడికి ఇచ్చాను. దాన్ని చదవడం ముగించి, ఆయన తలకిందులుగా మా ఆస్పత్రికి వచ్చాడు. ఈ లోకం తలకిందులుగా ఎందుకుందని గొడవపడ్డాడు. ఆయన్ని తలకిందులుగానే ఒక గోడకి ఆనించి, కౌన్సెలింగ్ స్టార్ట్ చేశాను. ఈ లోకం భక్తులకి హనుమంతుడి తోకలా, డాక్టర్లకి స్టెతస్కోప్‌లా, లాయర్లకి నల్లకోటులా, టీవీ యాంకర్లకి మైకులా, కొందరు నాయకులకి రహస్య కెమెరాలా కనిపిస్తుందని ఎవడి లోకం వాడిదని నచ్చజెప్పాను. కొంచెం స్థిమితపడ్డ తరువాత యధావిధిగా తలపైకి, కళ్లు కిందకి చేశాను. ఐదు నిమిషాల తరువాత ప్రతిదానికి తలకిందులైపోయే మనుషుల్ని తాను చూడలేనని శీర్షాసనంతో ఇంటికెళ్లిపోయాడు. పాఠకుల్ని తలకిందులు చేయగల ఈ పుస్తకం రచయితకి ఏమిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం పేషంట్లనిచ్చింది. మనకేంటి అనేది సమాజపు నినాదం కాబట్టి ఈ పుస్తకం సమాజ శ్రేయస్సుని కోరేదనడంలో సందేహం లేదు’’ అని ముగించాడు.

 రచయిత భార్య మైకు తీసుకుని, ‘‘తలకు చమురు, కణతలకి అమృతాంజనం, ఒంటికి సెంటు మాత్రమే రాసే ఈయన... ఒక పుస్తకం కూడా రాస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. రాసుకు పూసుకు తిరిగేవాళ్లే రచయితలవుతారని నానుడి. అక్షరాలు పుస్తకాలవుతాయేమో కానీ పుస్తకాలు మాత్రం ఎన్నటికీ రూపాయలు కావు. ఇది తెలిసినా ఆయన పుస్తకం రాయడానికి ఎందుకొప్పుకున్నానంటే ఒకరోజైనా మావారు అచ్చోసిన ఆంబోతులా తిరుగుతుంటే చూడాలని కోరిక’’ అని ముగించింది.అప్పటికీ మిగిలివున్న ఒక ప్రేక్షకుడు పారిపోతున్న ఇంకొకణ్ణి పట్టుకుని, ‘‘గురువుగారూ! ఇంతకూ ఆ పుస్తకంలో ఏముంది?’’ అని అడిగాడు. ‘‘చిన్నప్పుడు బట్టీపట్టిన ఎక్కాలన్నీ తిరగరాశాడు. అందులో కూడా ఆయన సొంతాభిప్రాయాలు అనేకమున్నాయి. రెండు రెళ్లు ఆరు అని రాశాడు తిక్కలోడు.’’ ‘‘ఎంత గొప్పగా రాశారండి. రెండు రెళ్లు నాలుగన్నవాణ్ణి ఈ లోకం ఎప్పుడైనా బతకనిచ్చిందా! రచయితల్లో కూడా మహానుభావులుంటారు.’’
 - జి.ఆర్.మహర్షి
 
 

మరిన్ని వార్తలు