వ్యక్తిగత కేన్సర్‌ చికిత్స మరింత చేరువ!

5 Apr, 2018 00:21 IST|Sakshi

కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ మొదలుకొని వ్యాధి కణాల జన్యుక్రమం ఆధారంగా వ్యక్తిగత స్థాయిలో చికిత్స కల్పించేందుకు కూడా ఉపయోగపడే ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సింగపూర్‌ శాస్త్రవేత్తలు. కేన్సర్‌ కణితి నుంచి కొన్ని కణాలు విడిపోయి రక్తం ద్వారా శరీరం మొత్తం కలియదిరుగుతూంటాయని మనకు ఇప్పటికే తెలిసిందే. వీటిని సర్క్యులేటింగ్‌ ట్యూమర్‌ సెల్స్‌ (సీటీసీ) అంటారు. వీటిని క్షుణ్ణంగా విశ్లేషిస్తే చికిత్స మరింత సులువు అవుతుంది. అదే సమయంలో కణితి తాలూకు కణజాలాన్ని పదేపదే సేకరించాల్సిన అవసరం ఉండదు. రక్తంలో సీటీసీల ఉనికిని గుర్తించడం ద్వారా కేన్సర్‌ను నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిని లిక్విడ్‌ బయాప్సీ అంటారు.

ఈ లిక్విడ్‌ బయాప్సీతో పాటు ఒక్కో వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే సీటీసీలను మెరుగ్గా ఎదుర్కోగల మందులను ఎంపిక చేసుకునేందుకు ఉపయోగపడేలా  శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని తయారుచేశారు. దీంట్లో... మిల్లీమీటర్‌ కంటే తక్కువ సైజున్న గొట్టాలు ఉంటాయి. సీటీసీ కణాలు ఎదిగేందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ దీంట్లో ఉంటాయి. లిక్విడ్‌ బయాప్సీలు అందుబాటులోకి రాక మునుపు కణితి తాలూకు భాగాన్ని సేకరించడం ద్వారా వ్యాధి నిర్ధారణ జరిగేది. అంతేకాకుండా ఒక మందు పనిచేయకపోతే ఇంకోటి.. అది కూడా విఫలమైతే మూడో రకం మందు వాడటం చికిత్స పద్ధతి!! 

మరిన్ని వార్తలు