ఇండో-వెస్ట్రన్ బాలానందం...

12 Nov, 2014 22:38 IST|Sakshi
ఇండో-వెస్ట్రన్ బాలానందం...

ఏ పార్టీకైనా, ఏ ఇంటికైనా కళ తెచ్చేది పిల్లల నవ్వులే! వేడుకేదైనా ఉందంటే పెద్దలు పది రోజుల ముందుగానే కావల్సిన అలంకరణ వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఈ శ్రద్ధ పిల్లలపైనా పెట్టాల్సిందే! ఇటీవల పిల్లల అలంకరణలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఇండో-వెస్ట్రన్ స్టైల్‌లో ఉండే వస్త్రాలంకరణ, ఇతర అలంకరణ వస్తువులు పెద్దలను సైతం ఆకట్టుకుంటున్నాయి. అయితే సౌకర్యం, మన్నిక, ఆకర్షణీయం... ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని పిల్లలను తయారుచేస్తే రోజంతా వారి నవ్వులతో పెద్దలూ మురిసిపోవచ్చు.  
 
మెడ పొడవుగా ఉంటే...


చైనీస్ కాలర్ నెక్ బాగుంటుంది. డ్రెస్ డిజైన్లలో ఇటీవల ఎక్కువ ఫ్లెయిర్ ఉన్న చుడీదార్లు, గౌన్లను అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. అయితే అమ్మాయిలు బాగా సన్నగా ఉండి, పొడవుగా ఉంటే బాటమ్‌గా పటియాలా, బొద్దుగా ఉంటే చుడీని ఎంచుకోవడం మంచిది. వీటిని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలకు డ్రెస్ డిజైనింగ్ చేయవచ్చు.  ఎప్పుడూ కంఫర్ట్‌గా కనిపించాలంటే స్పోర్టివ్ లుక్‌తో కనిపించే క్యాజువల్ డ్రెస్‌ను ఎంపిక చేయాలి.
 
మెత్తటి ఫ్యాబ్రిక్...

నెట్టెడ్, రా సిల్క్, షిఫాన్, బెనారస్... చాలా మార్కెట్లో ఫ్యాబ్రిక్స్ ఎన్నో ఉన్నాయి. అయితే పిల్లల చర్మానికి తగ్గట్టు మల్‌మల్, మెత్తటి నెటెడ్, లినెన్, డెనిమ్.. ఫ్యాబ్రిక్స్ బాగా నప్పుతాయి. వీటిలోనే కాంతిమంతమైన రంగులను ఎంచుకోవడం మంచిది.
 
తెలుపు-నలుపు-ఎరుపు


 రెట్రో స్టైల్ అనిపించేలా పోల్కా డాట్స్ ప్రింట్లు గల ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన దుస్తులు పిల్లలను ఎప్పుడూ ఆకర్షణీయంగా చూపుతాయి. ఈ తరహా దుస్తులు సాయంకాలం పాశ్చాత్య వేడుకలకు అందంగా అమరుతాయి.
 
చలికాలంలో వెచ్చని ఫ్యాషన్...

వెచ్చగా ఉండటానికి స్వెటర్ వేస్తే చాలనుకునే రోజులు మారిపోయాయి. ఊలు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్లు, ఓవర్‌కోట్‌లు, షగ్స్,్ర క్యాప్స్.. రంగురంగుల్లో పిల్లలను చూపించడానికి ఉవ్విళ్లూరుతున్నాయి.  ఈ తరహా  దుస్తులను ఎవరికి వారు తమకు నచ్చిన డిజైన్లు చేసుకోవడానికి వీలుగా ఉన్ని మెటీరియల్ కూడా మార్కెట్‌లో అందుబాటులో లభిస్తోంది.
 
ఆధునికం...: చెక్స్ షర్ట్స్, ప్లెయిన్స్‌తో మిక్స్ అండ్ మ్యాచ్‌గా కలిపి ధరించి ఆధునికతకు కొత్త భాష్యం చెప్పడానికి ఈ దుస్తులు ముందుంటున్నాయి. అడ్డం, నిలువు మల్టీకలర్ చారలు ఈ దుస్తులలో ప్రధానంగా చోటుచేసుకుంటున్నాయి.
 
 
సంప్రదాయ దుస్తులు:

గౌను, సల్వార్-కమీజు, గాగ్రా-చోళీ, లంగా- జాకెట్టు, ధోతీ- కుర్తా.. ఇవన్నీ సంప్రదాయ దుస్తులు. పెద్దవారిలానే పిల్లల సంప్రదాయ దుస్తుల్లోనూ ఎక్కువ రంగులు, మెత్తటి ఫ్యాబిక్స్, మెరిసే అంచులు.. ఉండేలా రూపొందిస్తున్నారు డిజైనర్లు. ముఖ్యంగా చలికాలపు డల్ వాతావరణానికి ఇవి సరికొత్తగా జీవం పోస్తున్నాయి.
 
 సౌకర్యం...: సాధారణ చొక్కా, షార్ట్ ధరించినా కలర్‌ఫుల్‌గా, స్టైల్‌గా కనిపించాలంటే ఒక చిన్న స్కార్ఫ్‌తో రూపుమార్చేయవచ్చు.ఆటలకు, అల్లరికి సౌకర్యవంతమైన డ్రెస్‌గానే కాకుండా గెట్ టుగెదర్ పార్టీలకు ఆకర్షణీయంగా ఉంటుంది.
 
బొద్దుగా ఉంటే...

పిల్లలు బొద్దుగా ఉంటే వారి దుస్తుల్లో ఫ్రంట్ నెక్ వెడల్పుగా కాకుండా సన్నటి డీప్ నెక్‌కి ప్రాధాన్యత ఇస్తే చూడముచ్చటగా ఉంటారు. బ్రాడ్ నెక్ కావాలంటే దీంట్లో ‘యోక్ నెక్’ డిజైన్ చేసుకోవాలి.
 
మరిన్ని సూచనలు...

డ్రెస్ పైన అనవసరమైన, బరువైన అలంకరణ ఉండకూడదు.
డ్రెస్ లోపలివైపు మెత్తని కాటన్ లైనింగ్ తప్పనిసరి.
జరీ ఎంబ్రాయిడరీ, స్టోన్స్.. దుస్తులు పిల్లలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సాధ్యమైనంతవరకు దారంతో చేసిన ఎంబ్రాయిడరీ, రంగు రంగుల పూసలను డిజైనింగ్‌లో వాడవచ్చు.

మీరు ఎంపిక చేసిన డ్రెస్‌లో పిల్లలు రోజంతా సంతోషంగా నవ్వుతూ ఉన్నారంటే వారికి ఆ వేషధారణ సౌకర్యంగా ఉన్నట్టు. సంతోషంగా ఉంటేనే ధరించిన దుస్తులకు కొత్త అందం తెచ్చినట్టు.
 
 

మరిన్ని వార్తలు