పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం

29 Jul, 2019 00:33 IST|Sakshi

కథాసారం

‘నా వ్యక్తిగత విశ్వాసాలు– నేను నా పఠనం ద్వారా, అనుభవాల ద్వారా, తర్కించుకొని ఏర్పరచుకొన్నవి. ఈ ప్రపంచంలో సర్వవిశ్వాసాలకి, చర్యలకి, ‘వ్యక్తి’ కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్‌ కావచ్చు; సిన్నర్‌ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం. అయితే– ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యమే’ అంటారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ(29 మే 1944 – 25 జూలై 2019).
శ్రీకాంత శర్మ ప్రధానంగా కవి. అనుభూతి గీతాలు, సుపర్ణ, శిలామురళి, ఏకాంత కోకిల ఆయన కవితా సంపుటాలు. లలిత గీతాలు, యక్షగానాలు రాశారు. తూర్పున వాలిన సూర్యుడు, ఉపాసన, క్షణికం ఆయన నవలలు. కథలు, నాటకాలు, నాటికలు, సాహిత్య వ్యాసాలు, ఇట్లా అన్ని ప్రక్రియల్లోనూ కృషి చేశారు. ఆధునిక, ప్రాచీన సాహిత్యాల వారధి. పాత కావ్యాలకు నవలారూపం ఇచ్చారు. సినీ కవిగానూ పరిచితులే. పాత్రికేయుడిగానూ, ఆకాశవాణిలోనూ పనిచేశారు. ఆయన సాహిత్య సర్వస్వం 2014లో వెలువడింది. గతేడాది ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరుతో ఆత్మకథ వెలువరించారు. ఇంద్రగంటి వారిది సాహిత్య కుటుంబం. శ్రీకాంతశర్మ తండ్రి హనుమచ్ఛాస్త్రి, భార్య జానకీబాల ఇరువురూ రచయితలే. కొడుకు మోహనకృష్ణ సినిమా దర్శకుడు. కూతురు కిరణ్మయి డాక్యుమెంటరీ మేకర్‌. పై కథ ‘పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం’కు సంక్షిప్త రూపం. దీని ప్రచురణ 1967.

మనుషులు కదులుతూ– మనుషుల ఆవేదనలూ, ఆనందాలూ, అశ్రువులూ, కడుపున భరిస్తూ, గబగబా మలుపులు తిరిగిపోయే రైలుబండి, మానవ ప్రకృతి అనే పెద్ద ‘గ్రంథం’ తాలూకు సంక్షిప్త సంకలనంలాగ కనిపిస్తుంది. సమాజంలో ఉన్న అంతస్తులూ, ఎడం ఎడంగా బతికే ఆ లక్షణం– పేలవమైన ఆలోచనా తత్వం, ఆ ప్రయాణంలో ఎంత స్పష్టంగా కనిపిస్తాయని! రాజమండ్రి స్టేషన్లో, హౌరా నుండి మద్రాసు పోయే ఎక్స్‌ప్రెస్‌ ఆగింది. హరగోపాల్‌ భీమవరం దాకా కలిసివస్తా– స్టేషన్లో చూడమని ఉత్తరం రాశాడు. కంపార్ట్‌మెంట్లోంచి బయటకు తొంగి చూశాను. కనిపించలేదు. లోపల ఊపిరి ఆడటం లేదు. అసలే థర్డ్‌ క్లాస్‌. అందులో వేసవి కాలం. రైలు గంట కొట్టారు. ఇంతలో గబగబా ఓ తెలుగురాని– ముతక ఖద్దరు చొక్కా, పిలకా, మీసాలు ఉన్న మనిషి(అంత క్రితం బండిలోంచి దిగినవాడే) లోపలికి జొరబడి, తువాలు గుడ్డతో మొహం తుడుచుకొంటున్నాడు. జామకాయలేవో తినివస్తున్నాడు లాగుంది. మీసాల మీద గింజలు అంటుకున్నాయి. అంత క్రితం తను భద్రపరచుకొన్న సీట్లో కూర్చున్నాడు.

ఊపిరాడని ప్రపంచ జనాభా ఆందోళన అంతా మా కంపార్ట్‌మెంట్లో అవతరించిందేమో అనిపించింది. నేనూ చొరవ చేసి ఒక పైబెర్త్‌ సంపాదించాను. రెండ్రోజులుగా హరగోపాల్‌ వాళ్ల నాటకం రిహార్సల్స్‌కి వెళ్లడంతో నిద్ర చెడింది. గుబులు, చిరాకు వ్యక్తమయ్యే థర్డ్‌ క్లాస్‌ ప్రయాణం మధ్యతరగతి జీవితం లాగుంది. గోదావరి, కొవ్వూరు, నిడదవోలు... నిద్ర తోసుకొచ్చింది కళ్ల మీదికి. హరగోపాల్‌ నిడదవోలులో గాని కనిపిస్తాడేమోనని, బలవంతాన కళ్లు తెరిచి ప్రయత్నించాను దిగుదామని. పై నుంచి ఒక కాలు కిందికి పెట్టానో లేదో, అరడజను కంఠాలు ముక్తకంఠంగా విరుచుకు పడ్డాయి. నోరు మూసుకుని ఒరిగాను, న్యూస్‌ పేపరుతో విసురుకుంటూ. ఎప్పుడు పట్టిందో– హరగోపాల్‌ కేకేసేవరకూ మెలకువే రాలేదు. తమ నాటకంలో వేసే హీరోయిన్‌ డైలాగ్‌ డెలివరీ నచ్చక ఇంకొకామెని గుడివాడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో హరగోపాల్‌ భీమవరంలో ఒక మిత్రుని కలియడానికి దిగుతానన్నాడు నాతో ఉత్తరంలో. సర్దుకుని కిందికి దిగాను. ఎవరో ఒకతను. టక్‌ అప్‌ చేసుకున్నాడు. ఖరీదైన వేషం. కళ్ల గాగుల్స్‌ తీసేసి, చేత్తో షోగ్గా ఊపుతూ, చటుక్కున మా కంపార్ట్‌మెంట్లో జొరబడి, సుతారంగా విసుక్కుంటూ చరచరా వెళ్లిపోయాడు. ‘‘చూడండి ఎంత చలాకీగా ఉన్నాడో అతడు!’’ రైలు కదిలింది. తొందరగా లోపలి కెక్కాను. హరగోపాల్‌ వెళ్లిపోయాడు. హరగోపాల్‌ని ఇంప్రెస్‌ చేసినతను, నా బెర్త్‌ కింద సీట్లో కూర్చుని, పెర్సీ మేసన్‌ డిటిక్టెవ్‌ నవల చదువుతున్నాడు. బండి ఊపుకి మళ్లీ కళ్లు మూతలు పడుతున్నాయి. అతని గొంతు వినిపిస్తోంది.

డిటెక్టివ్‌ లిటరేచర్‌ ఆపోశన పట్టినవాడికి మల్లే లెక్చర్‌ దంచుతున్నాడు. మనిషి చామనఛాయ. చురుకైన కంఠం. కొంచెం సేపు మాట్లాడి, వెనకవైపు వరసల్లో కూర్చున్న ఎవళ్లనో పలకరిస్తూ, అక్కడికి వెళ్లిపోఊయాడు. చీకటి కమ్ముకుంటోంది. రైలు గుడివాడకీ, బెజవాడకీ మధ్య ఉందన్నారు. ఉండి ఉండి, ఉత్తరాది మనిషి గొల్లుమన్నాడు తన భాషలో. ఏం జరిగిందని అంతా ఆతృతగా అడిగారు. కళ్లనీళ్లు కుక్కుకుంటూ, లాల్చీ జేబు చూపించాడు. మధ్యకి తెగిపోయి ఉంది. అతని చేతిలో మధ్యకి తెగిపోయిన ఏడెనిమిది రెండు రూపాయల నోట్లూ ఒక పది రూపాయల నోటూ ముక్కలున్నాయి. పాతిక రూపాయలు పనికిరాకుండా పోయాయి. అతను ఏ ఒరిస్సా ప్రాంతం వాడిలాగో ఉన్నాడు. సంజ్ఞల్ని బట్టీ కొద్దిగా అర్థం అయింది. కటక్‌ జిల్లాలో ఏదో పల్లెటూరు. తెనాలి పోవాలట. చుట్టాలు ఎవరికో జబ్బు చేసిందట. టిక్కెట్టుకు పోగా, పాతిక రూపాయలుంచుకున్నాడు జేబులో. బెజవాడ వరకూ మాత్రమే టిక్కెట్టు తీశాడు. అక్కణ్ణించి ఇంకా ఎవర్నో తీసుకుని తెనాలి వెళ్లాలట. తను అటూ ఇటూ దిగడంలో ఎవళ్లో జేబు కొయ్యడంతో– సగం నోటుముక్కలు ఆ కోసినవాడికీ, మిగతా సగం ఇతనికీ దక్కాయి.

జాలిగా చూశాడు అందరికేసి. మోసం కాదనిపించింది నాకు. మోసం చేసి సంపాదిద్దామని అనుకున్నా పోయినవి పాతిక రూపాయలు. జాలి వేసింది. ఓ అర్ధరూపాయిచ్చాను. ఇదంతా చూస్తున్న ఒక రైతు జాలిపడి, రైల్వే దొంగతనాల్ని తన పరిభాషలో తిట్టి, తన రొంటిన సంచీ తీసి చూశాడు. చిల్లరేమీ లేదు. ఒక రూపాయి నోటు ఇతని చేతిలో పెట్టాడు. వెనక నుంచి రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయి. హరగోపాల్‌ని ‘ఇంప్రెస్‌’ చేసిన వ్యక్తి తాలూకు ‘డిటెక్టివ్‌ గొంతు వేసే ప్రశ్నలూ, తెలుగురాని ఇతని తబ్బిబ్బూ వినిపించాయి. డిటెక్టివ్‌ గొంతు ఈ కేసుని ఇట్లా ‘ఎనలైజ్‌’ చేస్తోంది. ‘‘పది రూపాయల నోటు సంగతి చూడండి, నోటుని మధ్యకు మడిచి, మళ్లీ మధ్యకు మడిచాడు కదా. మడిచిన గుర్తు ఇదిగో, నోటు కూడా మరీ కొత్తది కాదు. రెండు రూపాయల నోట్లు కూడా రెండు మూడు దొంతర్లుగా పెట్టినట్టున్నాడు. మరి పదిరూపాయల నోటు అదే నాలుగు మడతల మీద కట్టినవై ఉండాలి. అప్పుడు నోటుకి ఈ పక్కా ఆ పక్కా చెరో అంగుళం ముక్కా ఇంచుమించు మడత స్వభావాన్ని బట్టి తెగిపోయి ఉండాలి. అయితే మిగిలేది మధ్యముక్క, అలాలేదే. రెండు రూపాయల నోటు మధ్యకి కట్‌ అయిపోయిన మాట నిజమే. మరి పదిరూపాయల నోటు కూడా మధ్య ఎలా తెగింది కొలిచినట్టుగా. ఇతను నోట్లు జేబులో పెట్టుకున్న పద్ధతి చూస్తే పది రూపాయల నోటు మధ్యకి మడిచి, దాన్ని మళ్లీ మధ్యకి మడిచి, మధ్యలో రెండు రూపాయల నోట్లు మడత పెట్టి ఉండాలి. ఇదంతా, ఇలా ఉండనివ్వండి– అయితే, ఎలా ఎందుకు చేశాడు! మోసగించి డబ్బు సంపాదించాలనుకునే వాడు పాతిక రూపాయలు చేతులారా నాశనం చేసుకుంటాడా? అని సందేహం కలగవచ్చు. దీన్ని ‘సాల్వ్‌’ చేయటం సింపుల్‌.

ఈమధ్య ‘ఫేక్‌’ నోట్లు వస్తున్నాయి కదా– ఎలాగా మారవని ఎవరో చెప్పివుంటారు. వీటిని తెగ్గోసుకుని, డబ్బు చేసుకుందామన్న ఆలోచన పుట్టి ఉండవచ్చు.’’ అతను జుట్టు పైకి ఎగదోసుకుని, చుట్టూ చూశాడు. అంతా ముగ్ధులైపోయారు. ‘ఫేక్‌ నోట్స్‌’ అనగానే నాకూ అనుమానం వచ్చింది. రూపాయి దానం చేసిన రైతు బూడిదలో పన్నీరు పోసిన మొహం పెట్టాడు. హరగోపాల్‌ కాలిక్యులేషన్‌ సాధారణంగా దెబ్బ తినదు. హరగోపాల్‌ను ఇతను తన వేషం చేతే ఇంప్రెస్‌ చేసినా, నేను ఇతని తెలివిని చూస్తున్నాను. అంతా అవహేళన చేసి, తిట్టి, కొట్టినంత పని చేశారు ఆ పల్లెటూరి ఆసామిని. ఆ ఆసామి ఏడుస్తూ ఏదో తన భాషలో ఘోషిస్తున్నాడు. ఎవరి హృదయం కరగలేదు. ఛీ దేశద్రోహం కదూ? ఇలాంటి వాళ్లకి డబ్బిచ్చి పోషించడం? పరోక్షంగా వాళ్లు చేసే వెధవ పనుల్ని ప్రోత్సహించడం కదూ, అనిపించి సిగ్గుపడ్డాను. ‘‘పోలీసులకి అప్పగించండి’’ అన్నారెవరో. ‘‘మరే, అప్పుడుగాని బుద్ధిరాదు.’’

ఈ కేస్‌ నడిపిన డిటెక్టివ్‌ చెయ్యి ఆ వ్యక్తిని ఉరిమి చూసి ఫెడీఫెడీ మని లెంపకాయలు కొట్టింది. గొల్లుమన్నాడు అతను. మానవ మనస్తత్వం– అందులోనూ మధ్యతరగతి మనస్తత్వం– అదేం చిత్రమోకాని అంతగా దయనీ చూపించగలదు. అంతగా కక్షనూ సాధించగలదు. అందరి తరఫునా అతను చెయ్యి చేసుకుని, అందరి మనస్సుల్లో ఉన్న కోపానికీ శాంతిని కలిగించాడు. బెజవాడ వస్తోంది. ‘‘దూరదేశప్పీనుగ పోలీసులకు ఒప్పగించడం ఎందుకులెండి’’ అనేసి, పైని ఉన్న బాగ్‌ తీసుకుని కంపార్ట్‌మెంట్‌ గుమ్మం దగ్గరికి వెళ్లి, కుడిజేబులోంచి సిగరెట్‌ పెట్టితీసి, వెలిగించుకుని, ఖాళీ పెట్టి అవతల పారేశాడు. రాత్రి పది గంటలు దరిదాపవుతోంది. బెజవాడ స్టేషన్‌ జనంతో హడావుడిగా ఉంది. రైలాగింది. అతను దిగి తన దారిన తను గబగబ వెళ్లిపోయాడు. గుమ్మం దగ్గర అతని రుమాలు పడిపోయింది. బండి దిగుతున్న రైతు అతని పట్ల అత్యంత గౌరవం కలిగిన వాడవటం చేత, ఆ రుమాలు తీసి దులిపి, ‘‘బాబూ’’ అని కేకేసి, అంతలోనే తెల్లబోయి... ‘‘హారి దొంగ నాయనోయ్‌’’ అని అరిచాడు. ముక్కలైన పది రూపాయల నోటు, రెండు రూపాయల నోట్ల భాగాలు చెదిరిపడ్డాయి. నాకు కళ్లు తిరిగాయి. అయితే, అతను తనని తను కొట్టుకోలేక ఆ మనిషిని ఎందుకు కొట్టినట్టు? హరగోపాల్‌ వాళ్ల నాటకంలో పాత్రకి ఇతను సజీవమూర్తి. నటించక్కరలేదు– అనిపించింది.(సమాప్తం)

పుట్టినప్పుడు సంక్రమించిన
పటకుటీరం తనువు–
మోసుకు తిరుగుతూ కలలు వండుకు తింటూ
నేటి కిక్కడ రేపటి కెక్కడో!
ఉత్సవాలు చూస్తూ ఉత్సాహాలు కొనుక్కుంటాం.
పచ్చని లోకపు బయళ్లలో
పగలంతా కోలాహలంగా గడుపుతూంటాం
పరిపరి పరిచయాలతో
నిద్దుర సంచుల్లో కలల అరల్ని నింపుకొంటాం.
నీలాకాశం కత్తిరించి
దుప్పటిగా కప్పుకుంటాం–
ఎన్నో కోరికల కథలకి
మనమే నాయకులమై కూర్చుంటాం.

కొంత కాలానికొక గొంతు బెదిరిస్తుంది
అంటుకొంటుందట పటకుటీరం
అప్పుడీ సంచులు వెంటరావటకద!
పోతే పోనీ–
పిడికెడు బూడిదగా లేద్దాం
మేఘాల్లో చరిద్దాం.
చిటికెడు నీటితడి సోకి
పువ్వులమై పుడదాం–
మనకేం?
ఆకాశాన్ని విసిరి పారేసి
పొమ్మన్న చోటికే పోదాం పద.

(శ్రీకాంత శర్మ ‘అనుభూతి గీతాలు’ లోంచి; 
ప్రచురణ– 1976) 

మరిన్ని వార్తలు