తండ్రి దక్షిణామూర్తి

23 Apr, 2017 01:08 IST|Sakshi
తండ్రి దక్షిణామూర్తి

జ్ఞానదాతా మహేశ్వరః – మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు పరమశివుడు. జ్ఞానమంటే – లౌకికమైన విషయాలైనా కావచ్చు, లౌకిక విద్యలైనా కావచ్చు లేదా లౌకిక విద్య వలన ఒక పరమ సత్యాన్నిదృష్టిలోకి తెచ్చుకునే ప్రజ్ఞ అయినా కావచ్చు లేదా అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుని, ఆ కారణం చేత పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడమైనా  కావచ్చు. ఏదైనా ఇవ్వగలిగినవాడు పరమశివుడే.

అందుకే ఆయన నటరాజస్వామిగా ఢమరుకాన్ని మోగిస్తాడు. అందులోంచి 14 మాహేశ్వర సూక్తాలొచ్చాయి. ఆ శబ్దంలోంచి సమస్త వాఙ్మయం వచ్చింది. ఆయనే సమస్త కళలకు ఆధారం. అందుకే ఇప్పటికీ శ్రీశైలక్షేత్రం లోపలికి  వెడుతుంటే పక్కనే వీణవాయిస్తూ కనబడతాడు. శారదాదేవి ఎలా వీణ పట్టుకుంటుందో దక్షిణామూర్తి కూడా అలా వీణ పట్టుకుని ఉంటాడు. సమస్త  విద్యలకు అధిదేవత పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, శారదకూడా తెలుపు. ఇద్దరూ జ్ఞాన ప్రదాతలే. అటువంటి పరమశివుడు, ఇంత జ్ఞానం ఇవ్వగలిగినవాడు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలేని రీతిలో ఆత్మ అనుభవంలోకి వచ్చేటట్లు చేయగలిగినవాడు తండ్రి రూపంలో ఇక్కడ తిరుగుతుంటాడు.

అందుకే తండ్రి కలిగిన పెన్నిధానమేల? అన్నారు. లోకంలో సహజంగా తనంత తానుగా  గురువు ఎవరంటే తండ్రే. ఎందుచేత అంటే...  ఉపదేశం ఎవరు చేస్తారో ఆయన గురువవుతాడు. దీక్ష ఇచ్చేవాడు తండ్రి. యజ్ఞోపవీతాన్ని ధరించే అధికారం ఉన్నవారికి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశించి జ్ఞానాన్ని పొందేటట్లుగా అనుగ్రహించగలిగినవాడు తండ్రి.

మంత్రదీక్షను ఇచ్చిన వాడు కనుక గురుస్థానంలో నిలబడతాడు. ఉపనయనం అంటే ఉప అంటే సమీపం, నయనము అంటే చేర్చుట. గురువు దగ్గరికి చేర్చి ఉపనయన ప్రక్రియ ద్వారా విద్యాభ్యాసానికి అర్హతను కలిగించాడు కాబట్టి తండ్రి గురువయ్యాడు. తండ్రి ఒకవేళ గాయత్రీ మహామంత్రం ఇవ్వకపోతే అక్షరాభ్యాసం చేస్తాడు. అక్షరాభ్యాసం చేయించి పిల్లవాడిని తొడమీద కూర్చోబెట్టుకుని ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’అని రాయిస్తాడు. అలా రాయించాడు కాబట్టి తండ్రి గురువు.

ఈ గురు స్థానానికి తండ్రి సమర్థతతో సంబంధం ఉండదు. కారణం– ధర్మం అన్నమాట ఎవడు ఆశ్రయిస్తున్నాడో(ఇక్కడ కుమారుడు) వాడివైపునుంచి ఉంటుంది తప్ప అవతలివాడు (తండ్రి) ఎటువంటివాడన్న దానినిబట్టి ఉండదు. ఉదాహరణకు మా నాన్నగారికి నాకంటే మా తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం, ఎప్పుడూ వాడినే పొగుడుతూ, నేనెంత ధర్మమార్గంలో ఉన్నా నన్నే నిందిస్తున్నారనుకోండి. అటువంటప్పుడు మా నాన్నగారిపట్ల నేనెందుకు గౌరవం ప్రదర్శించాలన్న ప్రశ్న వస్తే.....?? అసలు ఆ ఆలోచనే తప్పు. ధర్మం నీవైపు నుంచే చూడాలి కాబట్టి నీ వైపునుంచి దోషం లేకుండా నీవు గౌరవించాలి. తండ్రి ప్రవర్తనను పరిశీలించి తీర్పు చెప్పే అధికారం కొడుకుగా నీకులేదు. తండ్రి ప్రవర్తనను ఎంచడం నీకు ధర్మం కాదు. తండ్రి ఎటువంటివాడయినా సేవించడం ఒక్కటే నీ ధర్మం.

తండ్రి తాగుబోతయితే కుటుంబం ఎంత క్లేశపడుతుందో తెలిసి ఆ పరిస్థితి నీకు రాకుండా చేయడానికి నీ తండ్రిని తాగుబోతును చేశాడేమో ఈశ్వరుడు? ‘నా తండ్రి పనికిమాలిన వాడు’ అన్నమాట నీ నోటివెంట ఎన్నటికీ రాకూడదు. తండ్రి తప్పును ఎత్తిచూపే అధికారం కొడుకుగా నీకు లేదు. తండ్రి వందనీయుడు. అంతే. ఇది అతిక్రమిస్తే నీది దోషభూయిష్టమయిన జీవితం అవుతుంది. పరబ్రహ్మను తిరస్కరించిన వాడివవుతావు.

మరిన్ని వార్తలు