ఇల్లే ఓ బ్యూటీ క్లినిక్

5 Apr, 2016 00:37 IST|Sakshi
ఇల్లే ఓ బ్యూటీ క్లినిక్

ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఎంత ఎండలు ఉన్నా, బయటకి వెళ్లనిదే ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి వాటితో సహా ఇతర పనులు జరగవు కదా! ఎండలోకి వెళ్లేముందు ముఖానికి, చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడం కష్టం. అయితే బోలెడంత ఖరీదు పెట్టి సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకుంటే సరి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది.

 

కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొబ్బరిపాలలో పసుపు కలిపి ముఖానికి రాసుకుని, ఆరాక కడుక్కున్నా మంచి ఫలితం ఉంటుంది. కేవలం ముఖానికి రాసుకోవడమే కాదు; కొబ్బరినీళ్లు తాగడం వల్ల కూడా చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది.

 

అదేవిధంగా ఒక్క ఎండాకాలంలోనే కాదు; చాలామందికి కళ్ల కింద నల్లటి వలయాలతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. దానికి ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన చల్లటి బంగాళదుంప లేదా కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అందులోని బ్లీచింగ్ ఏజెంట్ ఆ మచ్చలను మటుమాయం చేస్తుంది.

 

మరిన్ని వార్తలు