కేన్సర్‌కు వినూత్నమైన వ్యాక్సిన్‌!

3 Feb, 2018 00:31 IST|Sakshi
కేన్సర్‌ కణుతులు

ప్రాణాంతకమైన కేన్సర్‌పై పోరాటంలో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మరో కీలక విజయం సాధించారు. శరీర రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించగలిగే రెండు రసాయనాలతో కేన్సర్‌ కణుతులన్నింటినీ నాశనం చేయవచ్చునని వీరు ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. రోగ నిరోధక వ్యవస్థతోనే కేన్సర్‌ కణాలపై దాడులు చేసేందుకు ఇమ్యునోథెరపీ పేరుతో కొంతకాలంగా ప్రయత్నం జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం శరీరాన్ని కాకుండా, కణుతులున్న ప్రాంతంలో మాత్రమే రోగ నిరోధక వ్యవస్థ చైతన్యవంతమయ్యేలా చేయగలిగామని, ఫలితంగా అతి తక్కువ దుష్ప్రభావాలతోనే కేన్సర్‌ను దూరం చేయగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రొనాల్డ్‌ లెవీ తెలిపారు.

అతితక్కువ ఖర్చుతో ఇమ్యునోథెరపీకి ఇది మేలైన మార్గమని అన్నారు. అంతేకాకుండా కణుతుల్లోని కణాలకు మాత్రమే సంబంధించిన రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయాల్సిన అవసరం తప్పుతుందని ఆయన చెప్పారు. తాము ఉపయోగించే రెండు రసాయనాల్లో ఒకదానికి ఇప్పటికే అనుమతులు ఉన్నాయని, రెండో రసాయనాన్ని కూడా మానవుల్లో పరీక్షించి చూశామని లెవీ వివరించారు. ఈ రెండు రసాయనాల సమ్మేళనాన్ని లింఫోమా రకం కేన్సర్లతో పాటు ఇతర కేన్సర్లలోనూ ఉపయోగించవచ్చునని తెలిపారు. పరిశోధన వివరాలు సైన్స్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.  

మరిన్ని వార్తలు