సరైన తీర్పు

24 Jun, 2018 01:36 IST|Sakshi

ఇస్లాం వెలుగు

ఒకవ్యక్తి పనిమీద దూరప్రాంతానికి వెళుతూ తనవద్ద ఉన్న సొమ్మును మిత్రుడివద్ద దాచాడు.  కొన్నాళ్ళకు తిరిగొచ్చి తన పైకం ఇమ్మని మిత్రుణ్ణి అడిగాడు. దానికి మిత్రుడు, ఏమి పైకం? నాకెప్పుడిచ్చావు? అని అమాయకంగా ఎదురు ప్రశ్నించాడు. దాంతో సొమ్ము దాచుకున్న వ్యక్తి లబోదిబోమంటూ, న్యాయస్థానం గడప తొక్కాడు. ‘నువ్వతనికి సొమ్ము ఇచ్చినట్లు ఏమైనా సాక్ష్యం ఉందా?’ అని అడిగారు న్యాయమూర్తి. లేదని సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. డబ్బు తీసుకున్న వ్యక్తిని కూడా హాజరు పరిచి ప్రశ్నించారు. ఇరువురి వాదనా విన్న తరువాత ఇతను సొమ్ము దాచింది నిజమే, అతను అబద్ధమాడుతున్నదీ నిజమే అని న్యాయమూర్తికి అర్ధమైపోయింది. కాని సాక్ష్యం లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్ధంకాక, విచారణను మరుసటి రోజుకు వాయిదా వేశాడు.

ఇంటికి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. భర్త పరధ్యానంగా ఉండడం చూసి, ఏమిటని ప్రశ్నించింది. న్యాయమూర్తి ఏమీలేదని దాటవేసే ప్రయత్నం చేశాడు. కాని ఆమె గుచ్చిగుచ్చి అడగడంతో చెప్పక తప్పింది కాదు. ‘ఓస్‌ ఇంతేనా! నేనొక ఉపాయం చెబుతా వినండి’ అన్నదామె. న్యాయమూర్తి నవ్వుకున్నారు. కాని నిజంగానే ఆమె చెప్పిన ఉపాయానికి ఆశ్చర్యపోవడం అతని వంతయింది. మరునాడు న్యాయమూర్తి ఇద్దర్నీ పిలిచి, నువ్వు పైకం అతనికిచ్చినప్పుడు సాక్షులెవరూ లేరంటున్నావు. కనీసం అక్కడ ఏదైనా చెట్దుగాని, పుట్టగాని మరేవైనా ఇతర వస్తువులన్నా ఉన్నాయా? అని ఇచ్చిన వ్యక్తిని ప్రశ్నించారు. అప్పుడా వ్యక్తి, అవునండీ అక్కడొక జామచెట్టు ఉంది. అని చెప్పాడు. ‘‘అయితే ఆ జామ చెట్టునే వచ్చి సాక్ష్యం చెప్పమను’’ అన్నాడు న్యాయమూర్తి. దీంతో సభికులంతా ఆశ్చర్యపోయారు. చివరికి మిత్రద్రోహానికి ఒడి గట్టిన వాడు కూడా ‘జామ చెట్టు ఎలా సాక్ష్యమిస్తుంది’ అని వెటకారంగా నవ్వుకున్నాడు.

కాని న్యాయమూర్తి ఇవేమీ పట్టించుకోకుండా, నువ్వు వెంటనే వెళ్ళి జామచెట్టును సాక్ష్యంగా తీసుకురమ్మని బలవంతంగా పంపించాడు.అతడు వెళ్ళిన కొద్దిసేపటికి న్యాయమూర్తి డబ్బుతీసుకున్న వ్యక్తినుద్దేశించి, ‘అతనా జామచెట్టు దగ్గరికి వెళ్ళి ఉంటాడా?’అని అడిగాడు. దానికతను, ‘ఇంకా చేరుకోక పోవచ్చు’. అన్నాడు ఆద్రోహి.అంతలో వెళ్ళిన వ్యక్తి తిరిగొచ్చి,’అయ్యా..! మీరు చెప్పినట్లే నేను ఆ జామచెట్టు దగ్గరికెళ్ళి సాక్ష్యం చెబుదువు గాని పద.. అని అడిగాను. కాని అది చెట్టుకదా.. ఎలా వస్తుంది... ఎలా మాట్లాడుతుంది? మీరు నన్ను ఆటపట్టిస్తున్నట్లున్నారు.’ అన్నాడా వ్యక్తి.‘లేదు లేదు జామచెట్టు వచ్చి నువ్వు సొమ్ము ఇతని దగ్గర దాచినమాట నిజమేనని చెప్పి వెళ్ళిపోయింది’ అన్నారు న్యాయమూర్తి. దీంతో సభికులంతా నోరెళ్ళబెట్టారు. సొమ్ము తీసుకొని అబద్ధమాడుతున్న వ్యకి ్తకూడా, ‘అదేంటీ.. జామచెట్టు ఇక్కడికెప్పుడొచ్చిందీ?’ అన్నాడు.

అప్పుడు న్యాయమూర్తి,‘అతనా జామచెట్టు వరకు వెళ్ళి ఉంటాడా? అని ఇంతకుముందు నేనడిగినప్పుడు, నువ్వు, అప్పుడే వెళ్ళి ఉండడని సమాధానం చెప్పావు. అతను గనక నీకు పైకం ఇచ్చి ఉండకపోతే, నాకేం తెలుసు.. జామచెట్టో, గీమచెట్టో నాకేమీ తెలియదనేవాడివి. కాని, అతడింకా వెళ్ళి ఉండకపోవచ్చు అని చెప్పావు. అంటే, అతను నీకు పైకం ఇచ్చిందీ నిజమే, నువ్వు తీసుకుందీ నిజమే. ఎగ్గొట్టే ఉద్దేశ్యంతోనే నువ్వు అబద్ధమాడావు. వెంటనే అతని సొమ్ము అతనికి చెల్లించు. లేకపోతే జైలుకు పోతావు.’ అన్నారు న్యాయమూర్తి కఠినంగా..
ఈ మాటలు వినగానే అతనికి ముచ్చెమటలు పట్టాయి. వెంటనే అతని పైకం అతనికి చెల్లించి,క్షమించమని ప్రాధేయపడ్డాడు.
–ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

మరిన్ని వార్తలు