కరోనా : ఈ కుటుంబం అందరికి రోల్‌మోడల్‌

19 Apr, 2020 07:46 IST|Sakshi

కరోనా భయం ప్రపంచాన్ని బెదిరిస్తుంటే.. కేరళలోని ఓ కుటుంబం కరోనానే భయపెట్టే ప్రయత్నం చేసింది. అదీ.. రెడ్‌ జోన్‌ ఏరియా.. 8 మంది.. 15 రోజులు.. 24 అడుగుల లోతు బావి.. కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ సమయంలో మంచినీటి బావిని తవ్వి అందరికీ ఆదర్శంగా నిలిచిందీ కుటుంబం. ఆ కథాకమామిషు తెలుసుకోవాలంటే మనసును కేరళకు మళ్లించాల్సిందే! 

కరోనా మహమ్మారితో ఇంటికే పరిమితమైన కోట్లాది మందికి భిన్నంగా కేరళలోని ఓ కుటుంబం చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. కేరళలోని కన్నూరు ప్రాంతాన్ని ప్రభుత్వం హైలీ రెడ్‌ జోన్‌ గా ప్రకటించింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ లాక్‌ డౌన్‌ అయ్యాయి. కన్నూరు సమీపంలోని పినరాయ్‌లో సనీస్, జోస్‌ జాన్సన్‌ అనే సోదరులిద్దరూ తమ కుటుంబంతో నివసిస్తున్నారు. వ్యాపారులైన ఆ రెండు కుటుంబాల వారూ తల్లిదండ్రులతో కలిసి మొత్తం 11 మంది ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో వారికి ఏం చేయాలో తోచడం లేదు. అదే సమయంలో తమ నివాసంలోని బోర్‌ నీళ్లు తగ్గుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏదైనా మార్గం అన్వేషించాలనుకున్నారు.

అప్పుడు తట్టింది ఓ ఆలోచన. తమ ఇంటి వెనుక పెరటిలో ఓ చిన్న బావి తవ్వితే ఎలా ఉంటుందా...అని! ఇంట్లో అందరూ కూర్చుని తల్లి, తండ్రి, మూడేళ్ల కుమారుడు తప్ప మిగిలిన ఎనిమిది మంది రోజూ కొంచెం కొంచెంగా బావి తవ్వాలని నిర్ణయించారు. అంతే! ఖాళీ సమయంలో బావి తవ్వటం మొదలు పెట్టారు. 11 రోజుల్లో 15 అడుగులు తవ్వారు. 12వ రోజు 16 అడుగులకు నీటి తడి కనిపించింది. 13వ రోజు 17 అడుగులకు నీరు పడడంతో ఆ ఉత్సాహంతో మరో రెండు రోజుల్లో 24 అడుగుల లోతు తవ్వేసి బావి చుట్టూ గుండ్రటి వరలు వేసి రోజూ ఆ నీటిని వినియోగిస్తున్నారు. కరోనా లాక్‌ డౌన్‌ తమ నివాసానికి నీటి బావిని అందించిందని కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు. 
– సంజయ్‌ గుండ్ల,చెన్నై 

మరిన్ని వార్తలు