విజయానికి గొడుగు పట్టింది

3 Apr, 2018 00:34 IST|Sakshi

స్ఫూర్తి

ఉద్యోగం చేస్తే ఒకరు చెప్పినట్టుగా చేయాలి.స్వయం ఉపాధి అయితే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. చదవిన చదువుకు ప్రయత్నం తోడైతే ఏమవుతుందో పద్మావతిని చూస్తే అర్థమవుతుంది. ఆమె ఇప్పుడు పుట్టగొడుగుల రైతు. ఇంటి వద్దే ఉంటూ మంచి సంపాదన పొందుతున్న గృహిణి.

యూట్యూబ్‌ చూడటం ఆమెకు లాభించింది.ఒక వీడియో ఆమెను ఆకర్షించింది. హైదరాబాద్‌ నగరంలోని నాగోలు లక్ష్మీనరసింహ స్వామి కాలనీ(రోడ్‌ నెం:9) నివాసి ద్రోణంరాజు పద్మావతి జీవశాస్త్రంలో పట్టభద్రురాలు. స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లాలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి నగరానికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ దశలో మరో ఉద్యోగం వెతుక్కోవడం కన్నా స్వయం ఉపాధి కోసం సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించారు. ఆ సమయంలోనే పుట్టగొడుగుల పెంపకంపై యూట్యూబ్‌లో తారసపడిన వీడియో ఆమెను ఆకర్షించింది. మనమెందుకు పుట్టగొడుగులు పెంచకూడదు అనిపించింది. జీవశాస్త్రంలో లోతైన అవగాహన కలిగిన పద్మావతికి తర్వాత ఏం చేయాలో పెద్దగా చెప్పాల్సిన పని లేకపోయింది.

40 రోజులకు తొలి దిగుబడి
తన ఇంటి వద్ద 300 చదరపు అడుగులలో రేకుల షెడ్డు నిర్మించి 3 నెలల క్రితం పుట్టగొడుగుల పెంపకాన్ని పద్మావతి ప్రారంభించారు. 4 ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేసి 350 బెడ్స్‌లో పుట్టగొడుగులు పెంచుతున్నారు. వాట్సప్, ఫోన్‌ ద్వారా ఈ రంగంలో నిష్ణాతులైన వారి దగ్గర సందేహాలను తీర్చుకుంటూ పుట్టగొడుగుల దిగుబడి మొదలెట్టారు. బెడ్‌ తయారు చేసి విత్తనం (స్పాన్‌) వేసిన 40 రోజులకు పుట్టగొడుగు చేతికి వస్తుంది. నెలన్నర కాలం పాటు ఆ బెడ్స్‌ నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుందని ఆమె అన్నారు. రోజుకు 5–10 కిలోల మిల్కీ పుట్టగొడుగులను విక్రయిస్తున్నానన్నారు. టోకుగా కిలో రూ. 200కు, రిటైల్‌గా రూ. 300 వరకు ధర పలుకుతున్నదని, లాభసాటిగా ఉందన్నారు. పుట్టగొడుగులలో చాలా రకాలు ఉన్నాయని అంటూ.. మిల్కీ పుట్టగొడుగులు హైదరాబాద్‌ వాతావరణంలో బాగా పెరుగుతున్నాయన్నారు. తొలి సీజన్‌లో గడించిన అనుభవంతో పుట్టగొడుగుల సాగును త్వరలో మరో రెండు గదులకు విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ‘చాలా చేయాలని ఉంది. బ్యాంకులు లోన్‌ ఇస్తే బాగుండు’ అన్నారామె. 

అతి జాగ్రత్త పాటించాలి
వరిగడ్డిని ఉడకబెట్టి బెడ్‌ తయారు చేయడం దగ్గర నుంచి, కొద్దిరోజుల పాటు చీకటి గదిలో నిల్వచేయడం, కలుషితం కాకుండా చూసుకోవడం, గాలిలో తేమ, గది ఉష్ణోగ్రత వంటివన్నీ జాగ్రత్తగా చేయడం ద్వారా పుట్టగొడుగుల పెంపకాన్ని నేర్చుకోగలిగానని ఆమె తెలిపారు. ఐసీయూలో ఉన్న రోగి మాదిరిగా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని అంటూ.. అప్పుడే చక్కని దిగుబడి పొందగలుగుతామని పద్మావతి అన్నారు. సాధారణంగా మార్చి–నవంబర్‌ మధ్య కాలం పుట్టగొడుగుల సాగుకు అనువైన కాలమని.. అయితే, తాను చలికాలంలో ప్రారంభించడం వల్ల గది ఉష్ణోగ్రత, గాలిలో తేమ సరిచూసుకోవడానికి యంత్రాలను సమకూర్చుకోవలసి వచ్చిందని ఆమె అన్నారు. తొలి దశలో మౌలిక సదుపాయాలకు కొంత పెట్టుబడి అవసరమవుతుందని, తదనంతరం అంత పెద్దగా ఖర్చు ఉండదని ఆమె తెలిపారు. 
– చిత్రం సైదులు, సాక్షి, నాగోలు, హైదరాబాద్‌

రసాయనాలు వాడటం లేదు
ఎటువంటి రసాయన ఎరువులు కలపకుండా ఆరోగ్యకరమైన మిల్కీ పుట్టగొడుగులను పెంచుతున్నాను. పుట్టగొడుగులు వారానికి రెండు సార్లు తినొచ్చు. శరీరంలోని చెడు కొవ్వు కరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. విటమిన్‌ బీ, సీ తోపాటు కాల్షియం, మినరల్స్‌ అందుతాయి. గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా పోతాయి. ప్రస్తుతం నగరంలో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. అడిగిన వారికి ఊరగాయ కూడా పెట్టి ఇస్తున్నా. 
– ద్రోణంరాజు పద్మావతి (94907 55366),  లక్ష్మీనరసింహస్వామి కాలనీ, నాగోలు, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు