పర్సంటేజీల కంటే ఆసక్తి ప్రధానం

5 Jan, 2015 00:55 IST|Sakshi
పర్సంటేజీల కంటే ఆసక్తి ప్రధానం

గెస్ట్ కాలమ్
దేశంలో ఇటీవల కాలంలో పరిశోధనలు, ఆవిష్కరణలపై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే సమయంలో ఔత్సాహిక అభ్యర్థులెందరో ఆర్థిక కారణాలతో పరిశోధనలపై దృష్టి సారించలేకపోతున్నారు. వీరికి సరైన ప్రోత్సాహకాలు అందిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో తమ లక్ష్యాన్ని దూరం చేసుకోకూడదు. పరిశోధనల రంగంలో రాణించేందుకు అకడమిక్ పర్సంటేజీల కంటే ఆసక్తే ప్రధానం. ఆవిష్కరణలకు అదే ప్రధాన ఆయుధం. గణిత శాస్త్రవేత్త రామానుజన్, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ వంటి వారే ఇందుకు నిదర్శనం అని అంటున్నారు భారతరత్న అవార్డ్ గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు. సైన్స్ రంగంలో ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు చేసి దశాబ్దాల అనుభవం గడించిన సి.ఎన్.ఆర్.రావుతో ఇంటర్వ్యూ..
 
సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్చ
కోర్సుల కరిక్యులంను మార్చాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని విద్యావేత్తలు, నిపుణులు కోరుతున్న మాట వాస్తవమే. కేవలం కరిక్యులం మార్పుతోనే విద్యార్థుల్లో పరిపూర్ణత వస్తుందనుకోవడం సరికాదు. కోర్సులో నిర్దేశించిన సబ్జెక్ట్‌లనే కచ్చితంగా చదవాలనే విధానానికి బదులుగా.. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్‌లను ఎంచుకునే స్వేచ్ఛ కరిక్యులంలో ఉండాలి. అప్పుడే విద్యార్థుల్లోని నిజమైన ఆసక్తి బయటకు వస్తుంది. తద్వారా వ్యక్తిగతంగా, సామాజికంగా ఉపయోగపడతారు. కరిక్యులం అంటే.. సిలబస్ మాత్రమే కాదు. బోధన, అభ్యసనం, మూల్యాంకనం.. ఇలా ఎన్నో అంశాల సమ్మిళితం అని గుర్తించాలి.
 
ఇంటర్ డిసిప్లినరీగా మార్చాలి
గ్లోబలైజేషన్, పోటీ ప్రపంచ ం వంటి కారణాలతో ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. సైన్స్, ఇంజనీరింగ్‌ల్లోనూ ఇవి కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎదురవుతున్న సమస్య ఆయా సబ్జెక్ట్‌లను వేర్వేరుగా పరిగణించడం. సైన్స్‌ను ఇంజనీరింగ్ నుంచి వేరు చేసి చూడటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ . వాస్తవానికి ఇంజనీరింగ్‌లోని అన్ని అంశాలు సైన్స్ భావనల మేరకు రూపొందేవే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో అధికశాతం ఫిజిక్స్ ఆధారిత అంశాలు ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్‌ల మధ్య అంతరాలు తొలగించి ఇంటర్ డిసిప్లినరీగా మార్చాలి.
 
ప్రోత్సాహకాలు పెంచడం అవసరం
మన దేశంలో ఇటీవల కాలంలో పరిశోధనలకు ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నారు. వీటిని మరింతగా పెంచాల్సిన అవసరముంది. కేవలం స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లతో సరిపెట్టకుండా ఔత్సాహికులకు అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు, కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యేవిధంగా ఆర్థిక తోడ్పాటు అందించాలి. ఫలితంగా వారికి విస్తృత స్థాయిలో నైపుణ్యాలు లభిస్తాయి.
 
లక్ష్యాలు ఉన్నతంగా..
యువతలో అధిక శాతం ఉద్యోగ సాధననే మొదటి ప్రాధాన్యంగా పరిగణిస్తున్నారు. దానికి తగినట్లుగానే సర్టిఫికెట్లలో పర్సంటేజ్‌లు ప్రతిబింబించేలా అభ్యసనం పరీక్షలకే పరిమితమవుతోంది. ఇదే మనకు సమస్యగా మారుతోంది. విద్యార్థులు ఈ దృక్పథం మార్చుకోవాలి. చదువును ఉద్యోగ సాధనకే పరిమితం చేయకుండా.. ఉన్నత లక్ష్యాలకు ఉపకరణంగా మలచుకోవాలి. విస్తృత కోణంలో చెప్పాలంటే.. ఉద్యోగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొంత తగ్గించాలి.
 
ఆసక్తిని గుర్తించేలా ప్రవేశ ప్రక్రియ
విద్యార్థులకు ఇప్పుడు పరిశోధనలు, ఉన్నత విద్య దిశగా అవకాశాలు పుష్కలం. వాటిలో ప్రవేశానికి అకడమిక్‌గా అర్హత నిబంధనలు విధించడం సరికాదు. ఉదాహరణకు.. సీఎస్‌ఐఆర్-నెట్‌కు హాజరవ్వాలంటే పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొనడం వంటివి సమంజసం కాదు. అకడమిక్ పర్సంటేజి కంటే, అభ్యర్థుల్లోని ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ ఆసక్తిని గుర్తించే విధంగా ప్రవేశ ప్రక్రియలు ఉండాలి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల కారణంగా అకడమిక్‌గా పర్సంటేజ్‌లు, ఆయా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఏమంత కష్టం కాదు. కానీ వాటి ఆధారంగా ఒక విభాగంలో పరిశోధన లేదా ఉన్నత విద్య కోర్సులో చేరే అభ్యర్థికి నిజమైన ఆసక్తి లేకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
 
ఇన్‌స్టిట్యూట్‌ల విస్తరణ మంచిదే
ఐఐటీలకు సంబంధించి ఫ్యాకల్టీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ముందుగానే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఐఐటీల నుంచి గత ఆరేళ్లలో ఏర్పాటైన కొత్త ఐఐటీల వరకూ.. దాదాపు ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లోనూ ఫ్యాకల్టీ కొరత ప్రధాన సమస్యగా మారింది. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ఈ సమస్యకు కూడా మూలాలు మన అకడమిక్ విధానంలోనే ఉన్నాయి. బోధన రంగంపై ఆసక్తిని పెంచేలా అకడమిక్ స్థాయిలోనే అవగాహన కల్పించాలి. కార్పొరేట్ కొలువుల కోసమే కోర్సులు కాదని తెలియజేయాలి. ఫలితంగా వారు ఉన్నత విద్యవైపు దృష్టి సారించి.. పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయికి చేరుకోవడం, బోధనవైపు అడుగులు వేయడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి.
 
సొంత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి
విద్యా సంస్థలు.. సంస్థలతో ఒప్పందాల ద్వారా ఆర్ అండ్ డీ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవి కేవలం జాయింట్ కొలాబరేషన్స్‌కే పరిమితం కాకుండా.. సొంత ఆవిష్కరణలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. కొత్త సంస్థలు మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటై, సుస్థిరత సాధించిన ఇన్‌స్టిట్యూట్‌లు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
 
సహనం.. సానుకూల దృక్పథం..
నేటి యువతకు కష్టించేతత్వంతోపాటు సహనం, సానుకూల దృక్పథం చాలా అవసరం. లభించని ప్రోత్సాహకాల గురించి ఆలోచిస్తూ నిరాశ చెందకుండా అందుబాటులోని వనరులనే అవకాశాలుగా మలచుకోవాలి. మేం పరిశోధనలు ప్రారంభించిన రోజులతో పోలిస్తే ఇప్పుడు ప్రోత్సాహకాల పరంగా మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వీటిని అందిపుచ్చుకోవాలి. విద్యార్థులు కూడా ఎంక్వైరీ దృక్పథాన్ని, ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి. దీనివల్ల విస్తృత స్థాయిలో నైపుణ్యాలు లభిస్తాయి. వాస్తవ పరిస్థితులపై వాస్తవ అవగాహన పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. ఈ విషయంలో అధ్యాపకులు చొరవ చూపాలి!!

మరిన్ని వార్తలు