విదేశీ విద్యకు దారులెన్నో..

17 Aug, 2014 23:24 IST|Sakshi

విదేశీ విద్య.. భారత్‌లోని లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ప్రధానంగా ఇంజనీరింగ్, సెన్సైస్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు ఔత్సాహికుల్లో ఈ ఆలోచన ఎక్కువే. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆయా దేశాల్లోని విద్యా సంస్థలు.. మన దేశంలోని కన్సల్టెన్సీలతో ఒప్పందం ద్వారా ప్రవేశ ప్రక్రియను సులభం చేస్తూ విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలు దేశాల్లో సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఫాల్ సెమిస్టర్‌కు దరఖాస్తు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ దిశగా మన దేశ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలపై ఫోకస్..
 
 అమెరికా... హాట్ స్పాట్
 
విదేశీ విద్య విషయంలో మన దేశ విద్యార్థులకు హాట్ స్పాట్‌గా నిలుస్తున్న దేశం అమెరికా. గత మూడేళ్లుగా అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కాస్త తగ్గింది. అయినా ఇతర దేశాలతో పోల్చితే అత్యధికుల గమ్యస్థానం నేటికీ అమెరికానే. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే అధికం. 2012-13 విద్యా సంవత్సరంలో అమెరికాలో మొత్తం 8 లక్షల మంది విదేశీ విద్యార్థులుంటే.. వారిలో లక్ష మంది వరకు మన దేశ విద్యార్థులే ఉండటం విశేషం. ప్రధానంగా బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి భారతీయ విద్యార్థులను ఆకట్టుకోవడంలో అమెరికా ముందంజలో ఉంది. ఆ దేశ బోధన విధానం.. ఆర్థిక ప్రోత్సాహకాలు.. అమెరికా పట్ల మన విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణం.  దాంతోపాటు అమెరికాలో విద్యతో భవిష్యత్ బంగారం అవుతుందనే అనే ఆలోచన కూడా ఇందుకు దోహదం చేస్తోంది.
 
 అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీలు
 హార్వర్డ్ యూనివర్సిటీ
 మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
 స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ
 ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ
 పెన్సిల్వేనియా యూనివర్సిటీ
 యేల్ యూనివర్సిటీ
 మిచిగాన్ యూనివర్సిటీ
 కొలంబియా యూనివర్సిటీ
 యూనివర్సిటీ ఆఫ్ చికాగో
 కార్నెగీ మిలన్ యూనివర్సిటీ
 
ప్రవేశం: ఔత్సాహిక విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు నిర్దేశిత పత్రాలు(విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫీజు, నివాస వ్యయానికి సరిపడే విధంగా ఆర్థిక వనరుల రుజువు పత్రాలు, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, రికమండేషన్ లెటర్స్, ప్రవేశపరీక్షల స్కోర్లు తదితర) అందించాలి. వీటి ఆధారంగా.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ లెటర్ అందిస్తాయి. దీన్నే ఐ-20 ఫామ్‌గా పిలుస్తారు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలి. అమెరికా వీసా ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము చేరదలచుకున్న కోర్సు, ఇన్‌స్టిట్యూట్ విషయంలో అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం ఏడాది లేదా ఏడాదిన్నర ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టాలి.
 
అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా రెండుసార్లు (జనవరి, సెప్టెంబర్)

పూర్తి వివరాలకు: www.educationusa.state.gov
 
ఆస్ట్రేలియా... మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్‌‌సకు పెట్టింది పేరు
 
మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల బోధనలో పేరుగాంచిన దేశంగా ఆస్ట్రేలియా నిలుస్తోంది. స్టూడెంట్ వీసా నిబంధనలను సరళీకృతం చేయడం.. కొత్తగా పోస్ట్ స్టడీ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ పేరిట కోర్సు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలోనే రెండేళ్లు ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తోంది. అదేవిధంగా అభ్యర్థులు చూపించాల్సిన ఆర్థిక వనరుల మొత్తాన్ని కూడా కొంత తగ్గిస్తూ తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించడం.. భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియావైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో టాప్-100లో నిలిచిన పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి.
 
అకడమిక్ సెషన్ ప్రారంభం: ఫిబ్రవరి, జూలై
 
 పేరున్న యూనివర్సిటీలు
 ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ
 యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్
 యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ
 అడిలైడ్ యూనివర్సిటీ
 మొనాష్ యూనివర్సిటీ
 యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్
 యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్
 యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా
 
 పూర్తి వివరాలకు: www.immi.gov.au
 
 సింగపూర్... అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు
 
 కేవలం మూడు ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లే ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశం సింగపూర్. ముఖ్యంగా ఈ దేశం మేనేజ్‌మెంట్ కోర్సుల విషయంలో ఖ్యాతి పొందింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ చేరిన విద్యార్థులకు యు.ఎస్., చైనా సర్టిఫికెట్లు పొందే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. కోర్సు పూర్తయ్యాక ఒక ఏడాది పని చేసే అవకాశం కల్పించడం, కోర్సు సమయంలో వారానికి 16 గంటలు పార్ట్‌టైం జాబ్ చేసుకునే సదుపాయం వంటివి మన విద్యార్థులను సింగపూర్‌వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి.
 
 అకడమిక్ సెషన్ ప్రారంభం: మార్చి, జూలై
 
బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్:
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్;  నాన్‌యాంగ్ టెక్నలా
 
 జికల్ యూనివర్సిటీ. పూర్తి వివరాలకు: ww.singaporeedu.gov.sg
 
జర్మనీ... నామమాత్రపు ఫీజులే!
 
సైన్స్, ఇంజనీరింగ్, రీసెర్చ్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న దేశం జర్మనీ. అయితే ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించని ఇన్‌స్టిట్యూట్‌లలో చేరాలంటే..  దరఖాస్తు సమయంలోనే జర్మన్ భాషలో నైపుణ్యం ఉన్నట్లు తెలియజేయాలి. ఇందుకోసం అన్ని దేశాల్లోని జర్మనీ ఎంబసీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. జర్మనీలో విద్యాభ్యాసం దిశగా మరో ఆకర్షణీయ అంశం.. స్వల్ప ఫీజులు. జర్మనీ ప్రభుత్వ విధానాల ప్రకారం- చాలా యూనివర్సిటీలు ఫీజులు లేకుండానే లేదా సెమిస్టర్‌కు 500 యూరోల నామమాత్రపు ఫీజుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎలాంటి ఫీజు వసూలు చేయని ఇన్‌స్టిట్యూట్‌లలో చేరిన విద్యార్థులు సెమిస్టర్ కంట్రిబ్యూషన్ పేరుతో ప్రతి సెమిస్టర్‌కు 50 యూరోల నుంచి 250 యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవేకాకుండా ఎలాంటి కాలపరిమితి లేకుండా వర్క్ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం.. కోర్సు పూర్తయ్యాక కూడా 18 నెలలపాటు జర్మనీలో ఉండి ఉద్యోగాన్వేషణ సాగించేందుకు అవకాశం కల్పించడం జర్మనీలో విదేశీ విద్య ప్రత్యేకతలు.
 
అకడమిక్ సెషన్ ప్రారంభం: ఏప్రిల్, అక్టోబర్
 
పేరున్న ఇన్‌స్టిట్యూట్స్
 హంబోల్ట్ యూనివర్సిటీ
 ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్
 టెక్నికల్ యూనివర్సిటీ మ్యూనిచ్
 జార్జ్ అగస్ట్ యూనివర్సిటీ
 ఎబర్‌హార్డ్ కార్ల్స్ యూనివర్సిటీ
 టెక్నికల్ యూనివర్సిటీ బెర్లిన్
 లీప్‌జిగ్ యూనివర్సిటీ
 జెనా యూనివర్సిటీ
 బ్రెమెన్ యూనివర్సిటీ
 రెగెన్స్‌బర్గ్ యూనివర్సిటీ
 
 పూర్తి వివరాలకు: www.studyin.de/en
 
యూకే ప్రతిష్టాత్మక వర్సిటీలకు నెలవు
 
ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు నెలవు యునెటైడ్ కింగ్‌డమ్. అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులను విదేశీ విద్య కోసం విశేషంగా ఆకర్షిస్తున్న దేశం ఇది. విద్యార్థుల నమోదు సంఖ్య, క్రేజీ కోర్సుల పరంగానూ అమెరికా తర్వాత స్థానం యూకే యూనివర్సిటీలదే. బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తోంది యూకే. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ వ్యవధి రెండేళ్లు ఉండగా.. అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఫాస్ట్‌ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాదిలోనే పీజీ కోర్సులను అందిస్తుండటం కూడా ఈ దేశానికి మన విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం. రెండేళ్ల క్రితం వీసా నిబంధనలను కఠినం చేస్తూ.. పోస్ట్ స్టడీ వర్క్ వీసా సదుపాయాన్ని తొలగించడంతో యూకేకు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కొంతమేర తగ్గింది. అయితే చదువుకుంటున్న సమయంలోనే.. 20 వేల పౌండ్ల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందేట్లు స్పాన్సర్ లెటర్ అందించి.. చదువు పూర్తయ్యాక కూడా అక్కడే ఉండేలా నిబంధనను కొంత సడలించింది.
 
అకడమిక్ సెషన్ ప్రారంభం: జనవరి, సెప్టెంబర్
 
యూకేలో బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్
 ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
 కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
 ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్
 యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్
 వార్విక్ యూనివర్సిటీ
 కింగ్స్ కాలేజ్
 ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ
 లాంకెస్టర్ యూనివర్సిటీ
 గ్లాస్గో యూనివర్సిటీ
 
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ukvisas.gov.uk
 
జపాన్.. సైన్‌‌స అండ్ టెక్నాలజీ కోర్సులు
 
ప్రతి ఏటా దాదాపు 50 వేల మందికిపైగా విదేశీ విద్యార్థులు అడుగుపెడుతున్న దేశం జపాన్. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లు జపాన్‌లోనే ఉన్నాయి. ఈ దే శంలో ఇన్‌స్టిట్యూట్‌లోనే అనుబంధంగా ఆర్ అండ్ డీ సంస్థలు ఉంటాయి. దాంతో విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వీలవుతుంది. రీసెర్చ్ విభాగాల్లో పాల్పంచుకునే విద్యార్థులకు రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్ లభిస్తుంది.
 
అకడమిక్ సెషన్ ప్రారంభం: ఏప్రిల్, అక్టోబర్
 
బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్
 యూనివర్సిటీ ఆఫ్ టోక్యో
 క్యోటో యూనివర్సిటీ
 ఒసాకా యూనివర్సిటీ
 టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
 నగోయా యూనివర్సిటీ
 క్యుషు యూనివర్సిటీ
 వసెడా యూనివర్సిటీ
 కోబ్ యూనివర్సిటీ
 టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ
 టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్
 
పూర్తి వివరాలకు: www.jasso.go.jp
 
కెనడా... సైన్‌‌స, పీహెచ్‌డీలకు చిరునామా
 
సైన్స్ కోర్సులకు, పీహెచ్‌డీలకు  చిరునామా కెనడా. ఇంజనీరింగ్, ఏవియేషన్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల ఔత్సాహికులకు బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లలో చదివే అవకాశం ఇక్కడ లభిస్తుంది. పీహెచ్‌డీ స్థాయిలో కెనడాలోని అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ఇండస్ట్రీ కొలాబరేషన్‌తో రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతో పీహెచ్‌డీకి సరైన వేదికగా ఈ దేశాన్ని పేర్కొనొచ్చు. అదే విధంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించి.. పని అనుభవం కలిగిన ఉన్నత విద్యావంతులు కెనడాలోనే శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు సైతం కల్పించారు. ఈ కారణంగా గత ఐదేళ్లుగా కెనడాకు వెళుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది.
 
అకడమిక్ సెషన్ ప్రారంభం: జనవరి, సెప్టెంబర్
 
బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్
 మెక్‌గిల్ యూనివర్సిటీ
 క్వీన్స్ యూనివర్సిటీ
 యూనివర్సిటీ ఆఫ్ టోరంటో
 వాటర్‌లూ యూనివర్సిటీ
 యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా
 యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా
 యూనివర్సిటీ డి మాంట్రియల్
 మెక్‌మాస్టర్ యూనివర్సిటీ
 వెస్ట్రన్ యూనివర్సిటీ
 యూనివర్సిటీ ఆఫ్ కల్గెరీ
 
పూర్తి వివరాలకు: www.educationau-incanada.ca/
 
రష్యా... మెడికల్, ఫార్మసీ కోర్సులకు కేరాఫ్
 
మెడికల్, హెల్త్, ఫార్మసీ, నర్సింగ్, ఏవియేషన్ కోర్సులకు కేరాఫ్‌గా రష్యా పేరు గడిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో వైద్య విద్య ఔత్సాహికులకు రష్యానే ప్రధాన గమ్యం. ఎంబీబీఎస్ కోర్సు కోసమే ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల మంది రష్యాకు వెళుతున్నారు. అయితే ఈ దేశానికి వెళ్లే విద్యార్థులు ప్రధానంగా గమనించాల్సిన అంశం.. అక్కడ తాము చేరాలనుకుంటున్న కళాశాలలో బోధన మాధ్యమం. అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు స్థానిక భాషలోనే బోధిస్తున్నాయి. ఈ మేరకు సదరు ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆ భాషపై పరిజ్ఞానం పొందాల్సి ఉంటుంది. నెలకు 80 డాలర్ల నుంచి వంద డాలర్ల లోపు నివాస వ్యయం ఇక్కడ ప్రధానంగా కలిసొచ్చే అంశం.
 
 ప్రముఖ యూనివర్సిటీలు
 సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీ
 మాస్కో మెడికల్ అకాడమీ
 మాస్కో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ
 సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ ఎల్.పి.పావ్‌లోవ్ మెడికల్ యూనివర్సిటీ
 రష్యన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ
 మాస్కో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ
 కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ
 సదరన్ ఫెడరల్ యూనివర్సిటీ
 వొరోనెజ్ స్టేట్ యూనివర్సిటీ
 బౌమన్ మాస్కో స్టేట్ టెక్నికల్ యూనివర్సిటీ
 
అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా సెప్టెంబర్
 
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  en.russia.edu.ru
 
న్యూజిలాండ్... మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్
 
తక్కువ వ్యయంతో కోర్సులు పూర్తి చేసుకునే అవకాశమున్న దేశం న్యూజిలాండ్. ముఖ్యంగా మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ కోర్సుల విషయంలో ఈ దేశ యూనివర్సిటీలకు మంచి పేరుంది. ఎంబీఏ, ఇతర పీజీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు బ్యాచిలర్‌‌స డిగ్రీ తర్వాత రెండేళ్ల పని అనుభవం పొందడం తప్పనిసరి! ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఏడాది కాలపరిమితి గల జాబ్ సెర్చ్ వీసా పొంది.. అక్కడే ఉద్యోగాన్వేషణ సాగించే సదుపాయం ఉంది. కొన్ని కోర్సులకు మన దేశంలో బోధించే మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రవేశం లభిస్తోంది. ఎంఎస్, ఎంటెక్ వంటి స్పెషలైజ్డ్ కోర్సుల్లో చేరాలంటే.. 16 ఏళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి.
 
 బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్
 యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్
 యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో
 యూనివర్సిటీ ఆఫ్ కాంటెర్‌బరీ
 విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్
 మాసే యూనివర్సిటీ
 వ్యకాటో యూనివర్సిటీ
 లింకన్ యూనివర్సిటీ
 ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ
 
అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా మార్చి నెలలో
 
 పూర్తి వివరాలకు: www.immigration.govt.nz
 
 అమెరికా ఔత్సాహికులు అప్రమత్తంగా
 
అమెరికాకు వెళ్లాలనుకునే  విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏటా రెండుసార్లు మొదలయ్యే అకడమిక్ సెషన్ కోసం 12 నుంచి 14 నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభించడం మేలు. ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో అమెరికాలో కొన్ని ఫేక్ యూనివర్సిటీల్లో చేరడం వల్ల ఎందరో విదేశీ విద్యార్థులు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఔత్సాహిక విద్యార్థుల కోసం యునెటైడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యుఎస్‌ఐఈఎఫ్) తరఫున హెల్ప్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అభ్యర్థులు దీన్ని వినియోగించుకుంటే కచ్చితమైన సమాచారం లభిస్తుంది.
రేణుక రాజారావు, కంట్రీ కో-ఆర్డినేటర్, యుఎస్‌ఐఈఎఫ్
 
కూలంకషంగా పరిశీలించి..
 
స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక విద్యార్థులు.. తాము ఎంచుకున్న కోర్సు, గమ్యాలకు సంబంధించి కూలంకషంగా పరిశీలన చేయాలి. అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. సాధారణంగా విదేశాల్లోని యూనివర్సిటీలు.. ప్రవేశాల విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేయవు. కాబట్టి విద్యార్థులు సదరు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్లను చూస్తూ నిర్ణీత గడువు తేదీలను, ఇతర ప్రవేశ నిబంధనలను తెలుసుకోవాలి. వాటికి సరితూగుతామనే ఆత్మవిశ్వాసం లభించాకే దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి.
 
దరఖాస్తు సమయంలో జత చేయాల్సిన స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్‌ను పకడ్బందీగా రూపొందించుకోవాలి. నిర్దేశిత టెస్ట్ (జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, శాట్ తదితర)ల్లో స్కోర్ బాగా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ సరిగా లేక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అందుకే ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అకడమిక్ సెషన్ ప్రారంభానికి సంవత్సరం ముందు నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. అలా చేస్తేనే సదరు ఇన్‌స్టిట్యూట్ నిబంధనల మేరకు అడ్మిషన్ ప్రక్రియ సరైన సమయంలో పూర్తి చేసుకోవడం సులువవుతుంది.
సోను హిమాని, సీనియర్ మేనేజర్, ఎడ్యుకేషన్ యూకే, (సౌత్ ఇండియా బ్రిటిష్ కౌన్సిల్)
 
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే  విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించి.. సిద్ధం చేసుకోవాల్సినవి...
 
జీఆర్‌ఈ/టోఫెల్, జీమ్యాట్/ఐఈఎల్‌టీఎస్/ ఎస్‌ఏటీ పరీక్షల్లో స్కోరు.
దరఖాస్తుతోపాటు కవరింగ్ లెటర్

 
అప్లికేషన్ ఫీజు
స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్
లెటర్ ఆఫ్ రికమండేషన్
విద్యార్హతల సర్టిఫికెట్లు

 
ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్
పాస్‌పోర్ట్
స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయ పన్ను స్టేట్‌మెంట్

మరిన్ని వార్తలు