అదిగో పులి

28 Jul, 2017 23:27 IST|Sakshi
అదిగో పులి

‘అదిగో పులి’ అని నాన్నను ఆట పట్టిద్దాం అన్నా..
‘ఏదీ పులి? అని నాన్నే అడుగుతున్నాడు.
లక్షకు పైగా ఉండేవట!
96 వేల పులుల్ని మనమే చంపేసుకున్నామట!
అప్పటికి గానీ బుద్ధి రాలా.
ఇవాళ అంతర్జాతీయ పులుల దినోత్సవం.
వాటిని కాపాడుకోలేకపోతే అడవి వెలవెల పోదూ!
అవును. పులిని కాపాడుకోవాలి.
మొక్కల్ని పెంచుకున్నట్లే పులినీ కాపాడుకోవాలి.


వినాయకుడి వాహనం ఎలుక. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ విష్ణుమూర్తి వాహనం గద్ద. శివుడి వాహనం ఎద్దు. అగ్నిదేవుడి వాహనం మేక. ఇంద్రుడి వాహనం తెల్ల ఏనుగు. కాలభైరవుడి వాహనం కుక్క. శనైశ్చరుడి వాహనం కాకి. సరస్వతి వాహనం హంస కుమారస్వామి వాహనం నెమలి. ఆంజనేయుడి వాహనం ఒంటె. దుర్గాదేవి వాహనం సింహం. పార్వతి వాహనం పులి. అంత గొప్ప దేవతలు ఇలా పక్షులను, జంతువులను వాహనాలుగా ఎందుకు చేసుకున్నారంటారు? సృష్టిలో ప్రతి ప్రాణికీ సముచిత స్థానం ఉంది, దేని విలువ దానిదే, దేని గొప్ప దానిదే... దేనినీ తక్కువగా చూడకూడదని చెప్పడానికే. అందుకే... నీతినిజాయితీలతో ఉన్న వారిని పులిలా బతికాడంటారు. ధైర్యసాహసాలు గల స్త్రీని ఆడపులితో పోలుస్తారు. పులి కడుపున పులే పుడుతుందంటూ పులి గురించి గొప్పగా చెబుతారు. అంటే అనాదిగా పులికి భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానముంది. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటేనే మన సంస్కృతి సుసంపన్నం అవుతుంది.

హి ఈజ్‌ డెడ్‌!
సంసార్‌ చంద్‌ చనిపోయినట్లు జైపూర్‌లోని ఎస్‌.ఎం.ఎస్‌. ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. పులులు పండగ చేసుకోవలసిన రోజది! ఆ రోజు.. మార్చి 18, 2014. అప్పటికి వారం క్రితమే సంసార్‌ చంద్‌ని రాజస్థాన్‌లోని ఆళ్వార్‌ సెంట్రల్‌ జైలు నుంచి ఎస్‌.ఎం.ఎస్‌. ఆసుపత్రికి తరలించారు. అతడి ఊపిరి తిత్తులు, మెదడు, వెన్నెముక అప్పటికే పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. ఆసుపత్రికి తెచ్చాక చివరి దశ క్యాన్సర్‌తో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోంచి అట్నుంచటే మరణంలోకి! మరణం అతడితో పాటు, అతడి శిక్షా కాలాన్నీ తీసుకెళ్లి పోయింది. సంసార్‌ చంద్‌ నటోరియస్‌ పోచర్‌! పేరుమోసిన పులుల హంతకుడు. చంపేస్తాడు. చర్మాన్ని అమ్మేస్తాడు. పులి గోరు నుంచి, పులి కోర వరకు దేన్నీ వదలడు. 2003 అక్టోబర్‌ నుంచి 2004 సెప్టెంబర్‌ వరకు ఆ ఒక్క ఏడాదిలోనే సంసార్‌ చంద్‌ 40 పులి చర్మాలు, 400 చిరుతపులి చర్మాలు దేశం నుంచి తరలించినట్లు అతడి డైరీలో ఉన్న వివరాలను చూసి రాజస్థాన్‌ పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. తర్వాత రెండేళ్లకు జరిగిన సీబీఐ విచారణలో తను మొత్తం 470 పులిచర్మాలను, 2,130 చిరుతపులుల చర్మాలను అమ్మి సొమ్ము చేసుకున్నట్లు సంసార్‌ చంద్‌ ఒప్పుకున్నాడు. అప్పటికి భారతదేశంలో మిగిలి ఉన్న పులుల జనాభా కేవలం 1400 మాత్రమే!

పులి దొరికితే సంసార్‌ చంద్‌లాంటి వాళ్లు పండగ చేసుకుంటారు. కానీ మనిషి దొరికితే పులి అలా పండగ చేసుకోదు. కనీసం తోకతో కూడా చూడదు. కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే మార్జాలమైనా ‘మ్యావ్‌’ అంటుందేమో కానీ పులి మనుషుల్ని పట్టించుకోదు. తను డిస్టర్బ్‌ కానంత వరకూ తను ఎవర్నీ డిస్టర్బ్‌ చెయ్యదు. అది పులి స్వభావం! ఇదొక్కటే కాదు పులి స్వభావం. పులి ఇంకో పులిని చూసో, సింహాన్ని చూసో, ఏనుగును చూసో  గాండ్రించడం కూడా చాలా అరుదు. ఒక దానితో ఒకటి మాట్లాడుకోవడానికి మాత్రమే పులులు గాండ్రిస్తాయి. వాటికి విపరీతమైన సంతోషం వేసినప్పుడు కూడా అవి మనిషిలా కెవ్వున అరవ్వు. ధ్వనులు చెయ్యవు. జస్ట్‌ కళ్లు మిటకరిస్తాయి. అంతే. లేదంటే తన్మయత్వంతో కాసేపు కళ్లు మూసుకుంటాయి. ధ్యానుల్లా ఉంటాయి. వాటి ధ్యాసలో అవి ఉంటాయి. పులుల లైఫ్‌ స్టెయిల్‌లో ప్లానింగ్‌ ఉండదు. అప్పటికప్పుడే ఏదైనా. ఆకలైతేనే వేటాడతాయి తప్ప, ఆటకోసం వేటాడవు.  చెట్లు ఎక్కాలనిపిస్తే ఎక్కే ప్రయత్నం చేస్తాయి. నీటిలో ఈదాలనిపిస్తే ఈదుతాయి. స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. స్వేచ్ఛగా రాజ్యాలనూ ఏర్పరచుకుంటాయి! సరిహద్దు గుర్తులుగా మనుషులు కంచెలు ఏర్పాటు చేసుకుంటే.. పులులు తమ మూత్ర విసర్జనతో బోర్డర్స్‌ను గీసుకుంటాయి. ఆ ‘వాసన గీతల్ని’ గుర్తుపెట్టుకుంటాయి. ఈ గీతల మధ్య మగ పులి రాజ్యం 60–100 చ.కి. మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఆడ పులి రాజ్యం 20. చ.కి.మీ. వరకు వ్యాపించి ఉంటుంది.

వందేళ్ల క్రితం వరకు ఈ భూమ్మీద పులి రాజ్యాలు ఉండేవి! టర్కీ నుంచి రష్యా వరకు ఆ రాజ్యాలు వ్యాపించి ఉండేవి. ప్రపంచం మొత్తం మీద లక్ష పులులు ఉండేవి. అడవులు తగ్గిపోతూ, అక్రమ వేటగాళ్లు ఎక్కువైపోయాక ఈ వందేళ్లలో పులిరాజ్యం తగ్గి తగ్గి వంద నుంచి ఏడుశాతానికి వచ్చేసింది. పులుల సంఖ్య తగ్గి తగ్గి మూడు వేలకు వచ్చేసింది. జాతులు కూడా అంతే. తొమ్మిది జాతులు ఉండేవి. ఇప్పుడు ఆరు జాతులే మిగిలాయి. ఆ ఆరింటిలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఒకటి. అదే ఇప్పటి మన జాతీయ జంతువు.

షి ఈజ్‌ నాట్‌ డెడ్‌  
దగ్గరగా వెళ్లి చూశాడు అర్జన్‌ సింగ్‌. అందమైన చిరుత! ఇంకా చనిపోలేదు. చనిపోతూ ఉంది! ఆ రాత్రి ఆ ఘాట్‌ రోడ్‌పై అంతకు కొన్ని క్షణాల క్రితమే ఆ చిరుత అతడికి కనిపించింది. హెడ్‌లైట్స్‌ తాకిడికి అది తన కళ్లను చికిలించింది. జీపులోంచి తుపాకీ తీసి దాని గుండెల్లోకి కాల్చాడు అర్జన్‌ సింగ్‌. తూటా తాకిడికి నేలపై నెమ్మదిగా ఒరిగిపోతూ చివరి చూపు చూసింది చిరుత అతడిని. ఆ బేల చూపుకు, ఆ జాలి చూపుకు అర్జన్‌ సింగ్‌ గుండె పగిలిపోయింది. దుధ్వా అడవుల్లో అతడి హృదయ రోదన ప్రతిధ్వనించింది! పశ్చాత్తాపంతో అతడి మనసుకు అయిన గాయం ఆ రాత్రంతా కారుణ్యాన్ని స్రవిస్తూనే ఉంది. తెల్లారే సరికి ఆ ఆకతాయి వేటగాడు, పులుల సంరక్షకుడిగా పునర్జన్మించాడు! ‘భూమ్మీద ఎక్కడా క్రూరమైన జంతువులు లేవు. క్రూరమైన మనుషులు మాత్రమే ఉన్నారు’.. రాత్రంతా మేల్కొనే ఉండి, మర్నాడు ఉదయాన్నే అతడు రాసుకున్న మాటలవి! ఆ తర్వాత మనిషే మారిపోయాడు.

‘తార’ అనే పులిని తెచ్చుకుని పెంచుకున్నాడు. దానికి పుట్టిన తొమ్మిది పులి పిల్లల్నీ తనే సాకాడు. పులిని పెంచుకోడానికి చట్టం అడ్డుపడింది. ఇందిరా గాంధీ నుంచి స్పెషల్‌ పర్మిషన్‌ తెచ్చుకున్నాడు. ఇది జరిగింది 1970లలో. అప్పటికి అతడు తన 50లలో ఉన్నాడు. ఆ తర్వాత 93 మూడేళ్ల వయసులో చనిపోయాడు. అర్జన్‌ ఒక వేళ తన పాప పరిహారం వల్ల ఇప్పటికింకా జీవించే ఉంటే వచ్చే ఈ ఆగస్టు 15కి అతడు నూరేళ్ల నిండు మనిషి అయి ఉండేవాడు. ఏటా మనం జరుపుకుంటున్న పులుల పండగను  చూసి సంబర పడి ఉండేవాడు. ‘టైగర్స్‌ డే’ని ప్రపంచం 2010 నుంచి జరుపుకుంటోంది. అదే ఏడాది జన వరి 1న ఆయన చనిపోయారు. కనుక ఆయనకు ఈ పండగ గురించి తెలీదు. ఇంకో సంగతి కూడా ఆయనకు తెలిసే అవకాశం లేదు. పులుల సంతతి పెరుగుతోంది. బహుశా ఆయన ఆత్మ దుధ్వా అడవుల్లో సంచరిస్తూ ఉంటే మాత్రం తప్పకుండా ఈ మాట విని ఉప్పొంగిపోయే ఉంటుంది. అర్జన్‌ సింగ్‌ చనిపోయేనాటికి మన దేశంలో ఉన్న పులుల జనాభా కేవలం 1700 మాత్రమే.  
 
పులి పక్కన ఉంటే ధైర్యంగా ఉండదు. భయం వేస్తుంది. కానీ పులి పక్కన ఉన్నామంటే లోకం మనల్ని ధైర్యవంతులుగా చూస్తుంది. అది పులి గొప్పతనం. బలం ఉండీ క్రౌర్యాన్ని ప్రదర్శించకపోవడం గొప్పే కదా! ఈ రోజు పులుల్ని ప్రేమించే మనుషుల పండుగ. ‘ఇంటర్నేషనల్‌ టైగర్స్‌ డే’. అయినా పులుల్ని ప్రేమించని మనుషులు ఎక్కడైనా ఉంటారా? ఆ లుక్కుకే పడిపోతారు. వన్యమృగం అయిపోయింది కానీ.. మనతో పాటు షికారుకీ, షాపింగుకీ వచ్చే మచ్చికే ఉంటే.. ముద్దొచ్చినప్పుడల్లా పులి చంక ఎక్కేయమూ! అప్పటికీ వెచ్చగా ఒక ‘హగ్‌’ ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నాం. పులికి షేక్‌ హ్యాండ్‌ ఇస్తూనే ఉన్నాం.

పులితో సెల్ఫీకూడా దిగేస్తున్నాం. పులిని టచ్‌ చేయడం అంటే.. చిన్నప్పుడు పోలీసును చూసి స్నేహపూర్వకంగా నవ్వే ధైర్యం చేయడం లాంటిది. ఇలాంటి ధైర్యవంతులు ఎక్కువవడంతో అమెరికాలో మూడేళ్ల క్రితమే పులిని టచ్‌ చెయ్యడం బ్యాన్‌ చేశారు. ఎవరైనా టచ్‌ చేశారా.. పులేం చేయదు. పులుల చట్టం 500 డాలర్లు (32 వేల రూపాయలు) ఫైన్‌ వేస్తుంది. మిగతా దేశాలు కూడా పులుల క్షేమ, సంక్షేమం కోసం ఇలాంటి చట్టాలు తేవాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఇవాళ టచ్‌ చేయనిస్తే, రేపు వేటాడ్డానికి చూస్తాడు మనిషి. అలాంటిది వాడి క్యారెక్టర్‌. అందుకే ఈ జాగ్రత్తలు. ఈ  పండగలు.  

సంసార్‌ చంద్‌.. అర్జన్‌ సింగ్‌
వీళ్లిద్దరూ లేకుండా పులుల చరిత్రే లేదు. సంసార్‌ చంద్‌ భారతదేశ చరిత్రలోనే పేరుమోసిన పులుల స్మగ్లర్‌. అర్జన్‌ సింగ్‌ పరివర్తన చెందిన పులుల వేటగాడు. 1940లలో సంసార్‌ చంద్‌ కుటుంబీకులు ఢిల్లీలో ఉన్ని వస్త్రాలను విక్రయిస్తుండేవారు. ఆ విధంగా ఇండియా, నేపాల్, టిబెట్‌లలో ఏర్పడిన సంబంధాలను సంసార్‌ చంద్‌ పులుల అక్రమ వేటకు, స్మగ్లింగ్‌కు ఉపయోగించుకున్నాడు. తొలిసారి 1974లో అతడిని పోలీసులు పట్టుకున్నారు. 1982లో శిక్ష పడింది. కానీ ఆ తీర్పును సవాలు చేసి, చివరికి పదేళ్ల తర్వాత 18 నెలల స్వల్పకాల జైలు శిక్షతో బయటపడ్డాడు. పులుల అక్రమ వేటపై అతడి మీద మూడు రాష్ట్రాలలో 21 కేసులు నమోదై ఉన్న సమయంలో పరారై పోయి నేపాల్‌లో తలదాచుకున్నాడు. చివరికి అతడిని జైపూర్‌లో పట్టుకున్నారు. జైలు శి„ý  అనుభవిస్తుండగా ఆనారోగ్యంతో 2014లో మరణించాడు.

ఇక అర్జన్‌ సింగ్‌ కనికరం లేని వేటగాడు. వన్యప్రాణలును పొట్టన పెట్టుకుని, అడవి తల్లికి కడుపుకోత మిగిల్చినవాడు. కానీ ఒకరోజు మారిపోయాడు. (ప్రధాన వ్యాసం చూడండి) ఉత్తర ప్రదేశ్‌ అడవుల్లో ఇల్లు కట్టుకుని, పులుల సంరక్షణ కోసం జీవితాంతం అక్కడే ఉండిపోయాడు. భారత్‌–నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలోని లఖింపూర్‌–ఖెరీ అటవీ ప్రాంతం ‘దుధ్వా నేషనల్‌ పార్క్‌’గా అవతరించడం వెనుక అర్జన్‌ సింగ్‌ కృషి మాత్రమే ఉంది. ఉత్తర భారతదేశంలో ప్రఖ్యాతి చెందిన ‘జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ (ఉత్తరాఖండ్‌) తర్వాత, అంత పెద్ద పులుల సంరక్షణ కేంద్రం దుధ్వానే! ‘మనిషిలోని మానవత్వానికి మూగ జీవుల స్థితిగతులే కొలమానం’ అని అర్జన్‌ ఎప్పుడూ అంటుండేవారు.

మే నెలలో నో ఎంట్రీ
అభయారణ్యాన్ని సందర్శించడానికి మే నెలలో ప్రజలను అనుమతించరు. అరణ్యంలోని పులులను లెక్కించడానికి ఆ నెలను అనువైన సమయంగా పరిగణించి అందుకు ఉపయోగిస్తారు. ఆ నెలలో పులులు మండే వేసవి తాపం కారణంగా లోతట్టు ప్రాంతాల నుంచి కదిలి, నీళ్ల కోసం అడవి అంచులకు వస్తాయి. మే నెలాఖరు నాటికి క్షేత్ర సిబ్బంది వాటి సంఖ్యా వివరాలను తమ అధికారులకు సమర్పిస్తారు.
(భారతదేశంలో పులులను చూడ్డానికి బంధవ్‌ఘర్‌ నేషనల్‌ పార్క్‌ (మధ్యప్రదేశ్‌), రణథంబోర్‌ నేషనల్‌ పార్క్‌ (రాజస్థాన్‌), కన్హా నేషనల్‌ పార్క్‌ (మధ్య ప్రదేశ్‌), జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ (ఉత్తరాఖండ్‌), సాత్పురా నేషనల్‌ పార్క్‌ (మధ్య ప్రదేశ్‌) బెస్ట్‌ స్పాట్‌లు అని ఈ నెల ప్రారంభంలో ప్రసారం చేసిన ఒక కార్యక్రమంలో సి.ఎన్‌.ఎన్‌. టూర్‌ చానల్‌ పేర్కొంది) వీటితో కలుపుకుని ఇండియాలో సుమారు 50 వరకు పులుల అభయారణ్యాలు ఉన్నాయి.

పాదముద్రల సేకరణ
పులుల గణాంకాలను సేకరించడానికి అటవీ సిబ్బంది అనుసరించే పద్ధతి విలక్షణంగా ఉంటుంది. అసలు ఈ గణాంకాల సేకరణ కోసమే అటవీశాఖ 1973లో ప్రాజెక్టు టైగర్‌ ప్రారంభించింది. అప్పట్నుంచీ పులుల పాద ముద్రలను శాస్త్రీయంగా సేకరిస్తున్నారు. మనిషికీ మనిషికీ మధ్య వేలి ముద్రలు ఎలాగైతే భిన్నంగా ఉంటాయో, పులికీ, పులికీ మధ్య పాదముద్రలు అలాగే భిన్నంగా ఉంటాయి. కాబట్టి వీరు అడవులలో తిరుగుతూ పులి అడుగుజాడ ఏదైనా కనిపిస్తే, దాని అంచుల ఆకృతిని కాగితం మీద ట్రేస్‌లా గీసుకుని ప్లాస్టర్‌ ద్రవాన్ని ఆ ట్రేస్‌ నుంచి తీసిన మూసలో పోసి, అది గట్టి పడిన తర్వాత తీసి భద్రపరుస్తారు. మొత్తం మీద ఎన్ని రకాల పాద ముద్రలు లభించిందీ లెక్క చూసుకుని అడవిలోని పులుల కనీస సంఖ్యను వారు గణాంకాలలో చేరుస్తారు.

అయితే అన్ని అభయారణ్యాలలోనూ పులుల లెక్కల్ని ఇలాగే తీస్తారనేం లేదు. రణథంబోర్‌ అభయారణ్యంలో పులుల పాద ముద్రలను కంప్యూటర్‌ సాయంతో శోధిస్తారు. కర్నాటక లోని అభయారణ్యంలో రేడియో కాలర్‌ విధానాన్నీ, రహస్య కెమెరాల సాయంతో పరారుణ కిరణాల ఆధారంగా పులులను ఫొటో తీసే విధానాన్ని కూడా అనుసరిస్తారు.

టైగర్‌ జోలికి వెళితే.. చట్టం తాట తీస్తుంది
వైల్డ్‌లైఫ్‌ (ప్రొటెక్షన్‌) అమెండ్‌మెంట్‌ యాక్ట్, 2006 ప్రకారం దేశంలో ఎక్కడైనా సరే పులులను వేటాడితే తొలిసారి నేరానికి 3 ఏళ్లకు తక్కువ కాకుండా 7 ఏళ్ల వరకు జైలుశిక్ష. దాంతో పాటు 50 వేల రూపాయలకు తక్కువ కాకుండా 2 లక్షల వరకు జరిమానా. రెండోసారి, ఆ తర్వాతి వరుస నేరాలకు 7 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, దాంతో పాటు 5 లక్షలకు తక్కువ కాకుండా 50 లక్షల రూపాయల వరకు జరిమానా.

టైగర్‌ ఇండియా
ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పులుల సంఖ్య 4000 వేల లోపే. అందులో సగానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. భారత్‌ తర్వాతి స్థానాలలో రష్యా, ఇండోనేషియా, మలేషియా ఉన్నాయి. (గ్లోబల్‌ వైల్డ్‌ టైగర్‌ స్టేటస్‌ లెక్కల ప్రకారం)

పులి వేట
అడవికి రాజుగా వర్ణిస్తారే కానీ, పులిని వేటాడడం మాత్రం చాలా తేలికగా జరిగిపోతోంది. అక్రమ వేటగాళ్లు అనుసరించే విధానం ఇలా ఉంటుంది.

జాడ కనిపెట్టడం: పులుల రాకపోకలను తెలుసుకోడానికి అక్రమ వేటగాళ్లు పులల పార్కుల పరిసర గ్రామాల్లో ప్రజలకు డబ్బు ఎరగా వేస్తారు.

తుపాకీతో కాల్చడం: పులిని చంపడానికి సాధారణమైన బారు తుపాకులనే సర్వ సాధారణంగా ఉపయోగిస్తారు. వీలైనంత దగ్గర్లోకి వచ్చి, పులి గుండెకు గురి పెట్టి తుపాకీ పేలుస్తారు.

వల పన్నడం: ఇనుప సంకెళ్లను నేల మీద అమర్చి, పైకి కనిపించకుండా ఆకులు, అలములు కప్పుతారు. పులి కాలు దాని మీద పడడంతోటే అందులో చిక్కుకు పోతుంది.

చర్మం వలవడం: చనిపోయిన పులి దేహం నుంచి మొదటగా చర్మాన్ని వొలుస్తారు. తర్వాత దాని ఎముకలను బయటకు లాగి, గోనె సంచులలో నిల్వ చేస్తారు.

►భారతదేశంలోని దుధ్వా, వాల్మీకి సరిస్కా, రణథంబోర్, మేల్ఘాట్, ఇంద్రావతి, నాగార్జున సాగర్, పెరియార్, సిమిలి పాల్, పన్నా, పలమావూ, మానస్‌ అభయారణ్యాల నుంచి పులల అక్రమ వేటగాళ్లు పులులలను హతమార్చి నేపాల్, టిబెట్‌ల మీదుగా చైనాకు అక్రమ రవాణా చేస్తుంటారు.

►చైనా చేరిన భారతదేశపు పులుల శరీర భాగాలు, ఆ దేశపు అవసరాలకు సరిపడిన తర్వాత, మిగిలినవి జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాంలకు సరఫరా అవుతుంటాయి.

►పులి దేహ భాగాలకు అతి పెద్ద టోకు సరఫరాదారు భారతదేశం కాగా, వాటికి అతి పెద్ద రిటైల్‌ వ్యాపారి మాత్రం చైనానే.

నివేదన
పులి చర్మాల అక్రమ రవాణా ప్రపంచంలో ఏ విధంగా జరుగుతోందో చాటుతూ లండన్‌కు చెందిన ఎన్విరాన్‌మెంటల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఇ.ఐ.ఏ) 2004 అక్టోబర్‌లో ‘ది టైగర్‌ స్కిన్‌ ట్రెయిల్‌’ అనే సచిత్ర నివేదికను రూపొందించింది. అది ఎప్పటికీ ఒక ప్రామాణిక పత్రం.

ఇన్‌పుట్స్‌
wwf., ఇతర సంస్థల నివేదికలు

మరిన్ని వార్తలు