వన్‌పవర్‌మెంట్‌

8 Mar, 2020 05:38 IST|Sakshi

ఆట అంటేనే పవర్‌! షాట్‌ కొట్టడానికి పవర్‌. క్యాచ్‌ పట్టడానికి పవర్‌. షూట్‌ చెయ్యడానికి పవర్‌. లాగి వదలడానికి పవర్‌. పావులు కదపడానికి పవర్‌. పంచ్‌ ఇవ్వడానికి పవర్‌. స్ట్రయికర్‌ని విసరడానికి పవర్‌. అన్నిటా ఎంపవర్‌మెంట్‌ని సాధించిన మహిళలు ఆటల్లోనూ తమ పవర్‌ చూపిస్తున్నారు. నెంబర్‌ వన్‌ స్థానంతో విజయానికే వన్‌పవర్‌మెంట్‌ తెస్తున్నారు.

తల్లి కలనునిజం చేయాలని!
సైనా (బ్యాడ్మింటన్‌)
పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్‌ ఆటగాళ్లుగా వెలుగొందిన వారు తెరమరుగై... భారత బ్యాడ్మింటన్‌ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో తన విజయాలతో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది సైనా నెహ్వాల్‌. 2008లో జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తన ముద్ర చాటుకున్నాక వరుస విజయాలు సాధిస్తూ భారత బ్యాడ్మింటన్‌ ముఖచిత్రాన్ని మార్చేసింది. హరియాణాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా... తండ్రి హర్వీర్‌ సింగ్‌ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు బదిలీ కావడంతో భాగ్యనగరంలో స్థిరపడింది.

సైనా తల్లిదండ్రులు హర్వీర్, ఉషా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు. ఎనిమిదేళ్లకు రాకెట్‌ పట్టిన సైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న తన తల్లి ఉషా కలను నిజం చేసింది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సైనా అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. 2015లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ఎంతోమంది అమ్మాయిలు ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలిచింది.

స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ కావాలనుకొని!
అపూర్వీ చండేలా (షూటింగ్‌)
మహిళల షూటింగ్‌ క్రీడలో భారత్‌ నుంచి అంజలి భగవత్, సుమా షిరూర్, తేజస్విని సావంత్, హీనా సిద్ధూ తదితరులు అంతర్జాతీయస్థాయిలో మెరిశారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది అపూర్వీ చండేలా. జైపూర్‌కు చెందిన 27 ఏళ్ల అపూర్వీ తొలుత ఆటలకంటే చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది. కెరీర్‌లో స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ కావాలనుకున్న అపూర్వీని 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ మార్చేశాయి.  షూటర్‌ అభినవ్‌ బింద్రా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణం సాధించడం... ఆ తర్వాత బింద్రాకు లభించిన పేరు ప్రతిష్టలు అపూర్వీ మనసు మార్చేశాయి.

బింద్రా స్ఫూర్తితో షూటింగ్‌ వైపు మళ్లిన అపూర్వీ 2012లో జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత జట్టుకు ఎంపికైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన ఆమె... 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక 2019లో పసిడి పతకాల పంట పండించింది. మూడు ప్రపంచకప్‌లలో స్వర్ణాలు నెగ్గిన అపూర్వీ 10  మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది.

మకుటంలేని మహరాణి! హంపి (చెస్‌)
మేధో క్రీడ చదరంగంలో అమ్మాయిలు కూడా అద్భుతాలు చేయగలరని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి నిరూపించింది. ఐదేళ్ల ప్రాయంలో తండ్రి అశోక్‌ ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న హంపి 1997లో అండర్‌–10 బాలికల ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 1998లో అండర్‌–12... 2000లో అండర్‌–14 విభాగంలో ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

2002లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందిన హంపి 2006 దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది.
ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు నెగ్గిన హంపి 2016లో తల్లి అయ్యాక రెండేళ్లపాటు ఆటకు విరామం చెప్పింది. 2018లో పునరాగమనం చేశాక... కొన్ని టోర్నీలలో నిరాశాజనక ఫలితాలు వచ్చినా 2019లో ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి రెండు టోర్నీల్లో విజేతగా నిలిచింది. డిసెంబర్‌లో మాస్కోలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి మహిళల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన కెయిన్స్‌ కప్‌ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచి కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌ను అందుకుంది.

నాన్న స్వప్నాన్ని సాకారం చేస్తూ!
షఫాలీ వర్మ (క్రికెట్‌)
భారత్‌లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రమే ఉన్నా... అవకాశం దొరికినపుడల్లా మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. హరియాణాకు చెందిన 16 ఏళ్ల టీనేజర్‌ షఫాలీ వర్మ గతేడాది చివర్లో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

15 ఏళ్లకే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన షఫాలీ... గత నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 30 ఏళ్లుగా భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తన కూతురు ఏనాటికైనా భారత జట్టుకు ఆడాలని కలలు కన్న తండ్రి సంజీవ్‌ స్వప్నాన్ని షఫాలీ తొందరగానే నిజం చేసి చూపించింది. అంతేకాకుండా తన విధ్వంసకర ఆటతో తొలిసారి భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది.

ఎన్నో...ఎన్నెన్నో!
సానియా మీర్జా (టెన్నిస్‌)
ప్రపంచ మహిళల టెన్నిస్‌ పటంలో సానియా మీర్జా పుణ్యమాని భారత్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆరేళ్ల చిరుప్రాయంలో రాకెట్‌ పట్టిన సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో ఆస్ట్రేలియన్‌  ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో మూడో రౌండ్‌కు చేరిన సానియా... 2007లో సింగిల్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ 27వ ర్యాంక్‌ సాధించింది. సానియా 2009లో మహేశ్‌ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో... 2012లో మహేశ్‌ భూపతితో కలిసి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో... 2014లో బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌) జతగా యూఎస్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ సొంతం చేసుకుంది.

గాయాల బారిన పడటంతో 2012లో సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి డబుల్స్‌పైనే దృష్టి సారించిన ఈ హైదరాబాదీ... స్విట్జర్లాండ్‌ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జతకట్టి గొప్ప విజయాలు సాధించింది. 2015 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్న ఆమె అదే ఏడాది హింగిస్‌తో జతగా వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌... 2016లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2018లో తల్లి అయిన సానియా రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. ఈ ఏడాది మళ్లీ బరిలోకి దిగిన 33 ఏళ్ల సానియా హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నీలో నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి టైటిల్‌ నెగ్గి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. అర్జున అవార్డు (2004), పద్మశ్రీ (2006), రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (2015), పద్మభూషణ్‌ (2016) పురస్కారాలు అందుకున్న సానియా ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్, ఆఫ్రో–ఆసియా క్రీడలు కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది.

 

‘పంచ్‌’ మే దమ్‌ హై
మేరీకోమ్‌ (బాక్సింగ్‌)
క్రీడాకారిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, భార్యగా, కూతురుగా, పార్లమెంటేరియన్‌గా... ఇలా ఎన్నో బాధ్యతలు మోస్తూనే దాదాపు రెండు దశాబ్దాలుగా బాక్సింVŠ  రింగ్‌లో తన పంచ్‌ పవర్‌ చాటుకుంటోంది మణిపూర్‌ మెరిక మేరీకోమ్‌. 37 ఏళ్ల మేరీకోమ్‌ భారత్‌లో మహిళల బాక్సింగ్‌కు ప్రతిరూపం. వేర్వేరు వెయిట్‌ కేటగిరీల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఒలింపిక్స్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇలా ప్రతి మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగితే పతకంతో తిరిగొస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతలా నిలుస్తోంది. ‘అర్జున అవార్డు’.. ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... ‘పద్మశ్రీ’.. ‘పద్మభూషణ్‌’.. ‘పద్మవిభూషణ్‌’.. ఇలా అన్ని అవార్డులు మేరీకోమ్‌ను వరించాయి. ఈ ఏడాది జూలై–ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి మేరీకోమ్‌ తన ఉజ్వల కెరీర్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వాలనుకుంటోంది.

సరదాగా మొదలై!
అపూర్వ (క్యారమ్‌)
వేసవి సెలవుల్లోనే కాకుండా తీరిక దొరికినపుడల్లా క్యారమ్‌ బోర్డు ఆట ఆడిన వాళ్లు ఎందరో ఉంటారు. ఇంటి ఆటలోనూ విశ్వవిజేత కావొచ్చని హైదరాబాద్‌కు చెందిన ఎస్‌.అపూర్వ నిరూపించింది. ఒకవైపు భారత జీవితబీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అపూర్వ అందరిచేతా శభాష్‌ అనిపించుకుంది. తన తండ్రి ఆయన మిత్రులతో సరదాగా క్యారమ్‌ ఆడుతున్నపుడు ఈ ఆటపట్ల ఆసక్తి పెంచుకున్న అపూర్వ ఆ తర్వాత ముందుకు దూసుకుపోయింది. 2004లో కొలంబోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అపూర్వ... 2016లో బర్మింగ్‌హమ్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకంగా సింగిల్స్, డబుల్స్, టీమ్‌ విభాగాల్లో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. ఆట ఏదైనా, వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని అపూర్వ నిరూపించింది.

ఆటో డ్రైవర్‌ అమ్మాయి!
దీపిక కుమారి (ఆర్చరీ)
మహిళా విలువిద్య (ఆర్చరీ)లో భారత్‌ పేరు దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన క్రీడాకారిణి దీపిక కుమారి. జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల దీపికకు ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించింది. దీపిక తండ్రి శివనారాయణ్‌ మహతో ఆటో డ్రైవర్‌కాగా... తల్లి గీతా మహతో రాంచీ మెడికల్‌ కాలేజీలో నర్సుగా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఆర్చరీపై ఆసక్తి పెంచుకున్న దీపికకు సరైన సామాగ్రి అందుబాటులో లేకపోయేది. అయినా ఆమె నిరాశ చెందలేదు. తమ ఊర్లోని మామిడి తోటల్లో మామిడి కాయలను గురి చూసి రాళ్లతో కొట్టేది. 

  2005లో ఖర్సావన్‌ పట్టణంలోని అర్జున్‌ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్‌షెడ్‌పూర్‌లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది.  ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌లో దీపిక రికర్వ్‌ వ్యక్తిగత, మహిళల టీమ్‌ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. దీపిక ఓవరాల్‌గా ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 41 పతకాలు సొంతం చేసుకుంది.

– కరణం నారాయణ

మరిన్ని వార్తలు