రౌండప్‌ 2018,2019 

8 Mar, 2019 02:30 IST|Sakshi

దేశంలో... ఆ గెలుపు వెలుగులు కొన్ని...
బహిష్టు మీదున్న అపోహలు, అంధ విశ్వాసాలు ఆడవాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి మనదేశంలో.  ప్రృకతిధర్మాల్లో అదీ ఒకటని.. ఆరోగ్యకరమైన ప్రక్రియని ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. ఇందులో భాగంగానే శానిటరీ పాడ్స్‌ వాడకం మీద విస్తృత ప్రచారమూ జరుగుతోంది. అలాంటి సమయంలోనే జీఎస్‌టీ శరాఘాతమైంది. శానిటరీ నాప్కిన్స్‌మీద ప్రభుత్వం 12 శాతం పన్ను విధించింది. దీనిమీద దేశంలోని పలు మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావి వర్గం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. 2018, జనవరి ఒకటవ తేదీన గ్వాలియర్‌లోని ఓ పాఠశాల విద్యార్థినులు ఒక క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేశారు. శానిటరీ నాప్కిన్స్‌ మీద మెస్సేజ్, నోట్‌ రాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదికి పంపించారు. వీటన్నిటి ఫలితం.. ప్రభుత్వం వెనక్కి తగ్గి శానిటరీ నాప్కిన్స్‌ మీద జీఎస్‌టీ ఎత్తేయడం.  జూలైలో జరిగిన 28వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

మీ టూ ఉద్యమం
పలు రంగాల్లోని  పెద్దలు.. పది నిమిషాలకు ఒకసారి న్యూస్‌ వెబ్‌సైట్స్‌ చూసుకునే పరిస్థితి. ఇది మీ టూ మూవ్‌మెంట్‌ ఎఫెక్ట్‌ అండ్‌ పవర్‌. హాలీవుడ్‌ వయా బాలీవుడ్‌కి.. తద్వారా ఇతర రంగాల్లో స్త్రీల వేధింపులకూ బ్యానర్‌ కట్టింది. మహిళల పట్ల తన ప్రవర్తన విషయంలో ప్రతి పురుషుడినీ అలర్ట్‌ చేసింది. దీనికి చొరవ చూపి, ధైర్యం చేసిన స్త్రీ.. తనుశ్రీ దత్తా. బాలీవుడ్‌ నటి. ఇంట్లోంచి మొదలు పని ప్రదేశాల్లో, బహిరంగ స్థలాల్లో, కమ్యూనిటీస్‌లో.. ఇలా ఎక్కడ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నా.. వాటి గురించి పెదవి విప్పేలా ప్రేరణనిచ్చింది. అలా దేశంలోని మీడియా, కళలు, క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ, కార్పోరేట్‌ సెక్టార్‌లోని మహిళలు పడుతున్న ఇబ్బందులు, వేధింపులను సమాజం దృష్టికి తెచ్చింది. ఇక ఇలాంటివన్నీ భరించేది లేదనే సందేశాన్నీ ఇచ్చింది. అయినా పురుషుల్లో మార్పు రాకపోతే ‘టైమ్స్‌ ఆప్‌’’ అనే హెచ్చరికతో మరో ఉద్యమానికీ సన్నద్ధమైంది. 

శబరిమల ప్రవేశం.. 
2018లో మహిళలు తెచ్చిన ఇంకో విప్లవం.. శబరిమల ఆలయంలోకి వాళ్ల ప్రవేశం. ఇన్నాళ్లూ పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు, మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఈ నియమాన్ని సవాలు చేస్తూ దేవుడు దర్శనానికి అందరూ అర్హులే.. ఏ వయసు ఆడవాళ్లయినా శబరిమలకు వెళ్లొచ్చు అంటూ నిరుడు సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించింది. దీని పట్ల సంప్రదాయవాదుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. దర్శనానికి వచ్చిన మహిళలను అడ్డుకోవడం వంటి చర్యలూ చేపట్టారు. అయినా మహిళలు వెనకడుగు వేయలేదు. 

నో అంటే నో అనే..
శబరిమల ఒక్కటే కాదు.. ఇలాంటి విప్లవాత్మక తీర్పులెన్నిటినో బల్ల గుద్ది చెప్పింది గడచిన సంవత్సరం. అందులో అత్యంత ప్రధానమైనది సుప్రీంకోర్ట్‌ ఆల్‌ విమెన్‌ బెంచ్‌ ఇచ్చిన ‘‘నో మీన్స్‌ నో’’ తీర్పు. మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగింక చర్యకు పాల్పడడం నేరం. కుల, వర్గ, ఆర్థిక భేదాలకు అతీతంగా .. ఆ మహిళ సెక్స్‌ వర్కర్‌ అయినా సరే.. ఆమె నో అంటే నో అనే. వద్దు అన్న ఆమె మాటను గౌరవించాల్సిందే అనేది ఆ తీర్పు సారాంశం. 1997లో న్యూఢిల్లీలోని కత్వారియా సారై అనే ప్రాంతంలో నలుగురు పురుషులు చేతిలో గ్యాంగ్‌ రేప్‌కి గురైనా మహిళకు సంబంధించిన కేసులో ఈ తీర్పును ఇచ్చింది జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన  సుప్రీంకోర్ట్‌లోని ఆల్‌ విమెన్‌ బెంచ్‌. పై కేసులో బాధితురాలిని శీలంలేని మహిళగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నిందితుల తరపు లాయర్‌. ఆ సందర్భంలో ఈ తీర్పు వచ్చింది. 

నేరాలు కావు... 
అడల్ట్రీ నేరం కాదు అని తీర్పునిచ్చింది సుప్రీంకోర్ట్‌. అంటే పెళ్లయిన స్త్రీతో ఆమె భర్త అనుమతిలేకుండా లైంగిక సంబంధం కలిగి ఉండడం నేరం కాదు అని చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. అయితే విడాకులకు ఈ వివాహేతర సంబంధాన్ని ఒక కారణంగా చూపించవచ్చు. ఇంకో విషయం.. ఒకవేళ ఆత్మహత్యకు ఈ వివాహేతర సంబంధం కారణమైతే అప్పుడు దీన్ని నేరంగా చూడొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్ట్‌. 

377.. స్వలింగ సంపర్కం నేరం కాదు అనే తీర్పునూ వెల్లడించింది సుప్రీంకోర్టులోని  అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం. ఈ తీర్పులన్నిటి వెనకా  మహిళా న్యాయవాదులు, మహిళా న్యాయమూర్తుల కృషి ఉండడం గుర్తించాల్సిన, గుర్తుంచుకోవల్సిన విషయం.  

మరిన్ని వార్తలు