ఆస్పత్రి వద్దు స్వర్గమే ముద్దు

2 Nov, 2015 07:09 IST|Sakshi
ఆస్పత్రి వద్దు స్వర్గమే ముద్దు

నెట్‌ఇంట్లో
 
నెట్ ... నేర్పుతుంది. మార్చుతుంది. ఏమార్చుతుంది.
నెట్ ... కథ చెబుతుంది... కబుర్ల మూట విప్పుతుంది.
నెట్ ... విశ్వాసం పంచుతుంది. నమ్మకం పెంచుతుంది. కాస్త అజాగ్రత్తగా ఉంటే నిలువునా ముంచుతుంది.
ఈ వారం కాసింత తీపి, కాసింత పులుపు, కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు కలిపి షడ్రసోపేతం మీకోసం...

 
చూడగానే ముద్దొచ్చే ముఖం. కళ్లలో అనిర్వచనీయ అద్భుత తేజస్సు. నిండా ఐదేళ్ల ప్రాయం. అప్పుడే నిండు నూరేళ్లకు దగ్గరయింది. రోజులు లెక్కపెడుతోంది... ఈ పాప పుట్టుకతోనే చార్కాట్-మ్యారీ-టూత్ డీసీజ్ (సీఎంటీ)అనే ప్రాణాంతక నరాల జబ్బుతో బాధపడుతోంది. కృతిమ శ్వాసతో దీర్ఘశ్వాసను పీలుస్తోంది. శాశ్వతంగా ఆ శ్వాస ఎప్పుడు గాలిలో కలసిపోతోందో తెలియదు. ఆ పాప పేరు జూలియనా స్నో. ఆ పాప తన తల్లితో ‘ఇంట్లోనే ఉండి చనిపోయి స్వర్గానికి వెళ్తాను కానీ ఆస్పత్రికి వెళ్లను’ అన్న సంభాషణ ఇప్పుడు ఇంటర్ నెట్‌ను, వైద్య సమాజాన్ని కుదిపేస్తోంది. కారుణ్య హత్యల మద్దతుదార్లు ఈ సంభాషణను చూపించి చిన్న పిల్లలు సైతం మెర్సీ కిల్లింగ్ విషయంలో నిర్ణయం తీసుకోగలరని వాదిస్తున్నారు. వివాదానికి తెరతీసిన ఈ పాప కథనం ఇప్పుడు ఇంటర్‌నెట్ లో దుమారం లేపుతోంది.
 http://www.sakshi.com/news/international/oregon-family-lets-dying-5-year-old-daughter-decide-heaven-or-the-hospital-286945?pfrom=home-top-story
 
 
 
తల్లి చెత్త డ్యూటీ కూతురు మంచి బ్యూటీ
 జిగేల్మనే అందాల రాణి మకుటం... ఒక చెత్త ఏరుకునే మనిషి పాదాలను ముద్దాడింది. ఆ బ్యూటీ క్వీన్ రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టింది. చుట్టూ చెత్త డబ్బాలున్నా, అవి కంపు కొడుతున్నా పట్టించుకోకుండా ఆ బ్యూటీ వచ్చి పాదాల మీద వాలిపోయింది. ఆ చెత్త ఏరుకునే ఆవిడ ఎవరో కాదు. ఈ బ్యూటీ క్వీన్ తల్లి. అంత పేదరికంలో ఉన్నా కూతురు కోరుకున్న పోటీకి పంపించింది ఆ తల్లి. అందుకే గెలిచిన మరుక్షణం కూతురు తల్లిపాదాల ముందు వాలింది. ఖనితా ఫాసెంగ్ అనే ఈ థాయ్‌లాండ్ బ్యూటీక్వీన్ అందం ఆమె వినయం వల్ల మరింత పెరిగింది.  ఆమె తల్లి ఒరైత పోర్మావున్ ఇప్పటికీ చెత్త ఏరుకుంటోంది. ఖనితా కూడా తీరిక సమయాల్లో తల్లికి చెత్త సేకరించడంలో సాయం చేస్తోంది. మనసు బ్యూటీయే నిజమైన బ్యూటీ అని తల్లీకూతుళ్లిద్దరూ చెప్పక చెప్పారు. అదే మన కాస్మెటిక్ బ్యూటీలైతే చేతిలో వైన్ గ్లాస్‌తో నోటితో మదర్ తెరిస్సా పలుకులు పలికేవారు. సేవే లక్ష్యం అని చెబుతూనే సినిమా చాన్సుల కోసం వెంపర్లాడేవారు. ఏమంటారు? http://www.sakshi.com/news/international/garbage-collector-gets-to-keep-beauty-queen-crown-287254?pfrom=home-top-story
 
 
కట్టెపుల్లలేరుకునేది ఇల్లు కట్టేందుకే కట్టప్పా..
కాసిని ఎండుపుల్లలు, కొన్ని కట్టెలు, కొయ్య దుంగలు, బోలెడంత మట్టి ... ఈ మూడు ఉంటే చాలంటున్నాడు ఈ కుర్రాడు. పెళ్లి చేసి చూపించలేనేమో కానీ కచ్చితంగా ఇల్లు కట్టి చూపిస్తానంటున్నాడు ఇతగాడు. కొయ్య దుంగలతో స్తంభాలు, మట్టి, రాళ్లతో ఇల్లు, కర్ర పుల్లలతో నిప్పు రాజేసి, దానిపై పెంకులు కాల్చి తయారు చేసి కప్పు వేసేస్తాడు. ఈ కుర్రాడు ప్రిమిటివ్ టెక్నాలజీ (ఆదిమ సాంకేతికత) అన్న యూట్యూబ్ అకౌంట్ లో మట్టి ఇల్లు కట్టి చూపించాడు. నేను ఎండు పుల్లలు ఏరుతున్నది పిచ్చిపట్టి కాదు కట్టప్పా, ఇల్లు కట్టేందుకు అంటున్నాడీ దేవసేనుడు. ఈ మట్టింటి వాడికి నెట్టింట్లో మూడున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్లున్నారు. పద్నాలుగు నిమిషాల వీడియో కచ్చితంగా కట్టిపడేస్తుంది. ఆఫ్రికా, ఏషియాల్లోనే కాదు... ఆకాశ హర్మ్యాల అమెరికాలోనూ ఈ వీడియో ఇప్పుడొక క్రేజ్.... తెగ చూసేస్తున్నారట. దీన్ని చూస్తే... ఓసోస్... ఇల్లు కట్టుకోవడం ఇంత తేలికా అనిపిస్తుంది. ప్రస్తుతానికి కాంక్రీటు కొంపలు, డ్యూప్లెక్స్ దిబ్బల్లో ఎలాగోలా నెట్టుకొచ్చేస్తాం కానీ, మూడో ప్రపంచ యుద్ధం తరువాత నీ లాంటి ఇళ్లే కట్టుకుంటాం బాసూ అని ఆ కుర్రాడికి హామీ ఇచ్చేద్దాం. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం తరువాత మనం వెళ్లేది ఖాయంగా పాతరాతి యుగంలోకే. మనకు మిగిలేది ఖచ్చితంగా మట్టి, బూడిద, ఎండుపుల్లలే! http://whatstrending.com/hoton-youtube/20589-31e-man-builds-hut-completely-out-of-raw-materia
 
 
పోలీసమ్మ డాన్స్ బేబీ డాన్స్

రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటుంటే పోలీసులు ఏం చేస్తారు? ఎ) లాఠీలకు పనిచెప్తారు. బి)ఇద్దర్నీ నాలుగు పీకుతారు. సి) ఇద్దర్నీ ఠాణాకు తీసుకెళ్లి అత్తవారింటి అతిథి మర్యాదలు చేస్తారు. డి) డాన్స్ చేస్తారు. ఈ నాలుగు జవాబుల్లో ఏదో ఒకదానిపై క్లిక్ చేయమంటే నూటికి నూటొక్క మంది కచ్చితంగా క్లిక్ చేయనిది డి మాత్రమే. కానీ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ లేడీ పోలీసు ఇద్దరు అమ్మాయిలు తన్నులాడుకుంటుంటే వాళ్లను విడదీసేందుకు సరిగ్గా ఇదిగో ఈ ఆప్షన్ ‘డి’ నే ఎంచుకుంది. వాళ్లని తనతో డాన్స్ పోటీకి రమ్మని సవాలు చేసింది. మీరు గెలిస్తే కొట్టుకోండి. నేను గెలిస్తే ఇంటికి పొండి అని పందెం వేసింది. డిష్యుం డిష్యుం మని ఒకమ్మాయి డాన్స్ పోటీకి వచ్చింది. కాస్సేపు చేసిందో లేదో కానిస్టేబుల్ డాన్సు ముందు అల్లల్లాడిపోయింది. పందెం ప్రకారం కొట్లాట మాని ఇంటికి పోయింది. ఇప్పుడీ డాన్సింగ్ కాప్ వీడియోను అమెరికాలో లక్షలాది మంది చూస్తున్నారు. పోలీసమ్మ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఆఖరికి ఒబామా కూడా ఆ పోలీసును భేష్ అన్నాడు.  http://wixy.com/wixy-mornings/a-cop-broke-up-a-fight-between-teens-by-starting-a-dance-off
 
 
ఆ వేలును దేవుడు పట్టుకున్నాడు...
పుట్టుకతో సెరిబ్రల్ పాల్సీ. నరాలపై స్వాధీనం ఉండదు. వేలు మాట వినదు. నోరు మాట చెప్పలేదు. 1960 నుంచి ఆస్పత్రే ఇల్లు. అందులోని వాళ్లే అయిన వాళ్లు. అయినా పాల్ స్మిత్ అనే ఆయన గొప్ప ఆర్టిస్టు అయ్యాడు. చేతితో కుంచె పట్టుకోలేని స్మిత్ ఆర్టిస్ట్ ఎలా అయ్యాడు? ఆయన బ్రష్... ఆయన వేలు! ఆయన కేన్వాస్ ఆయన ముందున్న పాత టైప్ రైటర్. తన జీవితంలోని సంఘటనల్నే ఆయన ఒక్క వేలు, పది టైప్ రైటర్ కీలతో చిత్రాలుగా గీస్తాడు. ఆ బొమ్మల్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిన్నప్పటి ఇల్లు, ప్రయాణించిన పడవ, ఒబామా, ది లాస్ట్ సప్పర్ చిత్రం ఇలా చూసినవన్నీ చిత్రాలుగా అచ్చు గుద్దినట్టు దించేస్తాడు. నన్ను నడిపిస్తున్నది, బతికిస్తున్నది రెండే రెండు. ఒకటి - దేవుడు. రెండు - నా వేలు... అంటాడు. అన్నీ ఉండీ నిత్యం నిరాశలో కూరుకుపోయేవాళ్లు, ఆత్మహత్యంటే ప్రతి చిన్న సమస్యకీ అదేదో జిందా తిలిస్మాత్ అనుకునే వాళ్లు ఒక్క సారి పాల్ స్మిత్ కి సంబంధించిన ఈ నాలుగున్నర నిమిషాల వీడియోను చూసి తీరాలి. http://www.metaspoon.com/typewriter-artwork-paul-smith/?fb=719M1i1d4099tA &utm_source=719M1i1d4099tA
 
 

మరిన్ని వార్తలు