కలగళం

22 Oct, 2018 00:45 IST|Sakshi

అఖిలేశ్వరీ రామాగౌడ్‌

మీ టూ ... రెండక్షరాల పదం. రెండు పదాల వాక్యం. ప్రపంచాన్ని మండిస్తోన్న ఓ దావానలం. ఆవేదనతో, అవమానంతో రగిలిపోయిన... మహిళల మనసు నుంచి పుట్టిన అగ్నికీల. కామాగ్ని సమిధలు పేర్చిన చితిమంట. అడ్డూఅదుపూ లేని లైంగికవాంఛలకు చెలియలికట్టను నిర్మించడానికి చేస్తున్న ఓ ప్రయత్నం. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం గళమెత్తిన మహిళల కన్నీళ్ల ప్రవాహం. నవ సమాజ నిర్మాణం కోసం... రాళ్లెత్తుతున్న చేతుల సంఘటిత శక్తి మీటూ. సమాచార ప్రసార రంగంలో ఇన్నాళ్లూ అక్షరాల మాటున దాగిన ఆవేదన అగ్నిపర్వతంలా భళ్లున పేలింది. ఈ సందర్భంగా జర్నలిజంలో నలభై మూడేళ్ల అనుభవం ఉన్న అఖిలేశ్వరీ రామాగౌడ్‌ తో మాటా మంతీ. సాక్షి ఫ్యామిలీతో ఆమె పంచుకున్న అనుభవాల కథనాలు.

ఈ ఉద్యమం ఇక ఆగదు.బిగుసుకున్న పిడికిళ్ల ఆవేశం లావాలా ఉడుకుతోంది. మీటూ సాకారమే మన కల. అందుకోసం... కలమూ వాడాలి... గళమూ వాడాలి.


రిపోర్టింగ్‌ ఇవ్వలేదు
నా తొలి పోస్టింగ్‌ 1975లో డెక్కన్‌ హెరాల్డ్‌ బెంగళూరులో. అప్పటికి నాకు ఇరవై మూడేళ్లు. రిపోర్టింగ్‌ చేస్తానంటే ‘అమ్మాయివి కదా, డెస్క్‌లో పని చెయ్యి’ అన్నారు. డెస్క్‌ మొత్తానికి ఒక్కర్తినే అమ్మాయిని. మరో ఇద్దరు మహిళలుండేవారు కానీ వాళ్లు జర్నలిస్టులు కాదు, పర్సనల్‌ అసిస్టెంట్‌లు. డెస్క్‌లో సీనియర్‌లు యాభై నిండిన వాళ్లే. హెరాస్‌మెంట్‌కు అవకాశం లేని వాతావరణం ఉండేది. అయితే ఒకతడు నా కంటే రెండు మూడేళ్ల సీనియర్‌. జోక్‌గా అన్నట్లు ఏదో అర్థవంతంగా మాట్లాడేవాడు. అర్థం తెలుస్తుంటుంది కానీ రెస్పాండ్‌ కావచ్చా కాకూడదా తెలియని సందిగ్దత ఉండేది.

ఎదురు తిరిగితే ‘ఈ అమ్మాయికి దూకుడు ఎక్కువ’ అని ఒక లేబిల్‌ వేసేస్తారు. పైగా ఇంట్లో కూడా ‘ఆడపిల్ల నలుగురిలో గట్టిగా నవ్వకూడదు, మగవాడిని నేరుగా చూడకూడదు, మన సిగ్గును మనమే కాపాడుకోవాలి’... వంటి సూక్తులు నూరి పోసి పెంచి ఉంటారు. ఇవన్నీ మనలో ఏదో ఓ మూల స్థిరంగా ఉంటాయి. దాంతో అతడి ధోరణి తీవ్రమైనప్పుడు స్పందించాలని, అప్పటి వరకు వేచి చూద్దాం అనుకున్నాను. కొన్నిసార్లు విననట్లు, అర్థం కానట్లు ఉండాలి. కొన్నింటిని ఇగ్నోర్‌ చేయాలి. ఎందుకంటే అతడి మాటల్లో తేడా తెలుస్తుంటుంది, కానీ కచ్చితంగా ఇదీ అనడానికి వీలుండదు. అయితే కంప్లయింట్‌ అవసరం రాక ముందే హైదరాబాద్‌కి మారిపోయాను.

అమ్మాయి వెంట అబ్బాయి...
అప్పటికీ ఇప్పటికీ మార్పేమీ లేదు నేను అరవైల నుంచి సమాజాన్ని చూస్తున్నాను. అమ్మాయిలను అబ్బాయిలు ఫాలో కావడంలో అప్పటికీ ఇప్పటికీ ఎటువంటి మార్పూ లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పరిచయమైన పది నిమిషాల్లోనే అమ్మాయిల ఫోన్‌ నంబర్‌ అడుగుతున్నారు. నేను డెక్కన్‌ హెరాల్డ్‌ కరస్పాండెంట్‌గా వాషింగ్టన్‌ డీసీలో ఉన్నప్పుడు తానా సభలకు ఆహ్వానం వచ్చింది. పాతికేళ్ల నాటి మాట ఇది. బయటి దేశంలో ఉన్నప్పుడు...  తెలుగు వాళ్లు కలిసే సందర్భం అనగానే ఉత్సాహంగా వెళ్తాం కదా! నేనూ అలాగే వెళ్లాను. ఆ సమావేశాలకు ఓ తెలుగు ప్రముఖుడు వచ్చాడు.

అతడు ఇండియా నుంచి మరే దేశానికో వెళ్తూ ఈ సభల కోసం రెండు రోజులు వాషింగ్టన్‌ డీసీలో ఆగాడన్నమాట. అతడిని చూడడం అదే మొదటిసారి, మాటలు కలిపిన వాడు కాస్తా... గంటలోపే ‘ఆ రోజు మనం నా గదిలో ఉండవచ్చు కదా’ అన్నాడు. నాకప్పుడు నలభై ఏళ్లుంటాయి. కోపం తారస్థాయికి చేరింది, కానీ అది పార్టీ, తిట్టడానికి లేదు. గయ్యాళి తనం చాలా సందర్భాల్లో రక్షణ కవచమే కానీ, అన్ని సందర్భాల్లోనూ కాదు. దాంతో అతడిని తప్పించుకుని దూరంగా మసలాను. అయితే ఆ సంఘటన నాకు చాలానే నేర్పించింది.

ఒక ఇంటర్నేషనల్‌ మీట్‌లో కర్ణాటక క్యాడర్‌ ఆఫీసర్‌కి మాటకు మాట బదులు చెప్పడానికి దోహదం చేసింది. నేను ఒంటరిగా ఉన్నానని తెలుసుకున్న అతడు... ‘ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవాలి’ అన్నాడు నర్మగర్భంగా. వెంటనే నేను... ‘మీరు ఇక్కడికి వచ్చారు, మీ ఆవిడ ఇండియాలో ఒంటరిగా ఉంది కదా! ఆమెకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాట్లు చేసి వచ్చారా’ అనడంతో అతడి ముఖంలో రంగులు మారిపోయాయి. ఇక నన్ను తప్పించుకు తిరగడం అతడి వంతైంది.

సర్వీస్‌ సర్టిఫికేట్‌లో ఉండాలి
నేను ఉస్మానియా, లయోలాల్లో జర్నలిజం పాఠాలు చెప్పాను. నా స్టూడెంట్‌ ఒకమ్మాయి ఓ చిన్న మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేసి సర్టిఫికేట్‌ తెచ్చింది. అది కరెక్ట్‌ ప్రొఫార్మాలో లేదు. నేను కోప్పడి, మోడల్‌ ప్రొఫార్మా ఇచ్చి మళ్లీ వెళ్లి కరెక్ట్‌ ఫార్మాట్‌లో రాయించుకుని రమ్మన్నాను. అంతే... ఆ అమ్మాయికి కళ్లనీళ్లొక్కటే తక్కువ. ‘మళ్లీ అక్కడికి వెళ్లమంటారా మేడమ్‌’ అన్నది. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ‘అక్కడ సరిగ్గా లేదా’ అని అడిగినప్పుడు ‘న్యూస్‌ ఎడిటర్‌ వేధిస్తున్నాడని, తాను చెప్పినట్లు ఉండకపోతే కెరీర్‌ లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడ’ని చెప్పింది.

వెంటనే ఆ యాజమాన్యానికి ఫోన్‌ చేశాను. భార్యాభర్తలిద్దరూ కలిసి నడుపుతున్న సంస్థ అది. వాళ్లు వెంటనే ఆ న్యూస్‌ ఎడిటర్‌కి నోటీస్‌ ఇచ్చారు. అయితే ఆ తర్వాత అతడు మరొక పెద్ద సంస్థలో ఉద్యోగంలో చేరాడు. కొత్త యాజమాన్యానికి ఇవేవీ చెప్పకుండా చేరి ఉంటాడు. కొత్త చోట కూడా ఇదే బుద్ధిని ప్రదర్శిస్తాడు కదా. నోటీస్‌లో అతడిని ఎందుకు సంస్థను వదిలి వెళ్లమని చెప్పాల్సి వచ్చిందనే (లైంగిక వేధింపుకు పాల్పడ్డాడనే) విషయాన్ని కూడా మెన్షన్‌ చేస్తే కొత్తగా ఉద్యోగం ఇచ్చే వాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.

ఇలాంటిదే మరో సంఘటన... నేను ఎన్‌డబ్లు్యఎమ్‌ఐ కో ఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు జరిగింది. ఇంటర్న్‌షిప్‌ పూర్తయిన ఓ అమ్మాయికి ది హిందూలో ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని నలభై ఐదేళ్ల వ్యక్తి వేధించడం మొదలుపెట్టాడు. ఆమె రిపోర్టుతో ఎన్‌డబ్లు్యఎమ్‌ఐలో చర్చించి రిజల్యూషన్‌ పాస్‌ చేసి, ఆ ఎడిటర్‌కి లెటర్‌ పెట్టాం. అతడిని వెంటనే ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దానిని అవమానంగా భావించిన అతడు ఆ ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు. అతడికి మరో పెద్ద సంస్థ ఉద్యోగం ఇచ్చింది. సర్వీస్‌ సర్టిఫికేట్‌లో లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని రాయడం తప్పనిసరి చేయాలనేది ఇలాంటి పరిణామాలను అరికట్టడానికే.

తొంభైలలో...
ఈ తరం అమ్మాయిల్లో ఉన్నంత ధైర్యం తొంభైల నాటి అమ్మాయిలకు ఉండేది కాదు. నా సర్వేలో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేవారు కానీ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ విషయానికి వచ్చే సరికి నీళ్లు నమిలేవాళ్లు. ‘లేదు’ అని చెప్పే పరిస్థితుల్లేవు. ‘ఉంది’ అని చెప్పడానికి సందేహించేవాళ్లు. ‘హెరాస్‌మెంట్‌ ఉన్న మాట నిజమే, కానీ...’ అంటూ దాట వేయడానికి ప్రయత్నించేవాళ్లు. కొంతమంది... తమకు తెలిసిన ఇతర సంఘటనలను ఉదహరించేవారు తప్ప తమకు ఎదురైన వాటిని బయటపెట్టుకునేవాళ్లు కాదు.

త్రివేండ్రంలో ఒకమ్మాయి కూడా స్థానిక రాజకీయనాయకుడి నుంచి ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితిని సర్వేలో చెప్పింది తప్ప ఇన్‌హౌస్‌ వేధింపు గురించి చెప్పలేదు. ఉన్నదున్నట్లు బయటపెడితే తిరిగి అదే మనుషుల మధ్య ఉద్యోగం చేయడం కష్టమనే భయమే వాళ్ల నోటిని కట్టేసేది. కొంతమందికి భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏమంటారోననే బెరుకు కూడా ఉండేది. ఇదంతా అరిటాకు మీద ముల్లు సామెతను ఒంటపట్టించుకున్న మనస్తత్వమే.

అది ఇప్పటికీ పెద్దగా మారలేదు. వేధింపులు నేషనల్‌ మీడియాలోనే కాదు, రీజినల్‌ మీడియాలో కూడా కొల్లలుగా ఉన్నాయి. కానీ నోరు విప్పే సాహసం చేయడం లేదు. ఎం.జె అక్బర్‌ మీద నోరు విప్పిన ప్రియారమణికి ఆమె భర్త మద్దతుగా నిలిచాడు. అలా నిలిస్తే సంతోషమే. భర్తలు మద్దతుగా నిలవకపోయినా, కనీసం ఆడవాళ్లను వెనక్కి లాగకపోతే చాలు.

కత్తిమీద సాము
మీడియా రంగంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలు అందులో పనిచేసే వాళ్లకు తప్ప, ఇతరులకు ఎంత చెప్పినా అర్థం కావు. బాస్‌ నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ లైంగిక వేధింపులు ఉంటే అవి ఆ మహిళ కెరీర్‌ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ విమెన్‌’ మహిళా జర్నలిస్టుల పని పరిస్థితుల మీద సర్వే చేసింది. దక్షిణాది రాష్ట్రాల సర్వే కోసం నేను స్వయంగా నాలుగు వందల మంది అమ్మాయిలతో మాట్లాడాను. ఒక కన్నడ అమ్మాయి తన గోడు ఇలా వెళ్లబోసుకుంది. ఆ అమ్మాయి రాసినవి పబ్లిష్‌ అయ్యేవి కాదు, పబ్లిష్‌ చేసినా ఆమె బైలైన్‌ ఇచ్చేవారు కాదు, మరుసటి రోజు అదే విషయం అడిగితే ‘పొరపాటైంది సారీ’ అంటారు. ఆ తర్వాత కూడా వ్యూహాత్మకంగా బైలైన్‌ తీసేస్తారు.

ఒకవేళ బైలైన్‌ ఇచ్చారంటే ఆ ఆర్టికల్‌లో మొదట ఉండాల్సిన విషయాన్ని చివరికి, ముగింపులో చెప్పాల్సిన విషయం మధ్యలో ఎక్కడో ఉండేటట్లు కాపీని అర్థరహితంగా చేసేవాళ్లు. ఇది ఆ కన్నడమ్మాయికి మాత్రమే కాదు. నూటికి తొంభై మందికి ఎదురవుతున్న అనుభవమే. పైకి కనిపించదు కానీ మీడియారంగంలో కులాల విభజన కూడా ఉంటుంది. డెక్కన్‌ హెరాల్డ్‌లో ఒకమ్మాయి రిపోర్టర్‌గా చేరింది. చురుకైన పిల్ల. ఎడిటర్‌ చెప్పిన అసైన్‌మెంట్‌లు ఉత్సాహంగా చేసుకొచ్చేది. దాంతో కీలకమైన అసైన్‌మెంట్‌లు ఇచ్చేవారు. ఎడిటర్‌ వయసు, ఆ అమ్మాయి వయసులను కూడా చూడకుండా సంబంధం అంటగట్టేశారు సిబ్బంది. ‘ముసలాడికి పడుచుపిల్ల బాగా దొరికింది’ అంటూ కారుకూతలు కూడా.

ఆ మాటలు క్యాబిన్‌లో ఉండే ఎడిటర్‌ చెవిన పడవు, కానీ సెక్షన్‌లో వాళ్ల మధ్య పని చేసే అమ్మాయి చెవిని దాటిపోవు. పైగా ఆమె వినాలనే అంటారు కూడా. ఆమె మీద బురద జల్లడంతోపాటు ఆ అమ్మాయి రాసిన కాపీలో లీడ్‌ పాయింట్స్‌ తీసేసి అసంబద్ధంగా ఎడిట్‌ చేసేవారు. ఆ పరిస్థితి తట్టుకోలేక ఆమె ఉద్యోగం మానేసి వెళ్లి పోయింది. ఇంకా దారుణమైన విషయమేమిటంటే... తమ ప్రపోజల్‌కి అనుమతించని మహిళ మీద దుష్ప్రచారానికి కూడా వెనుకాడకపోవడం. మీడియాలో ఉద్యోగం మానేసి వెళ్లిన అమ్మాయిల్లో ఏ అమ్మాయి కూడా పని చేతకాక వెళ్లలేదు, ఇలాంటి వేధింపులు తట్టుకోలేకనే. మృదుత్వాన్ని వదిలించుకుని కరకుదనం పెంచుకున్న వాళ్లు మనగలుగుతున్నారు.

గొంతు కలపాలి
ఒకప్పుడు మహిళలు ‘ఐ వజ్‌ హెరాస్‌డ్‌’ అని చెప్పలేకపోయేవాళ్లు, నిజానికి సిగ్గుపడాల్సింది వేధించిన వాడే కానీ వేధింపుకు గురయిన వాళ్లు కాదు. మగవాళ్లలో పరస్పరం భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా, ఒక మహిళ తమలో ఒకడి మీద లైంగికవేధింపుల ఆరోపణ చేస్తే వెంటనే అంతా ఒక్కటైపోతారు. అలాంటి ఐకమత్యం ఆడవాళ్లలో కనిపించేది కాదు ఒకప్పుడు. అప్పటి సమాజంలో ఒక మహిళ గొంతు విప్పితే సాటి మహిళల నుంచి మద్దతు కరువయ్యేది. ఇప్పుడు తోటి మహిళలు ఆమెకి అండగా నిలుస్తున్నారు. ఇది స్వాగతించాల్సిన పరిణామం. ‘మీటూ’ అంటూ ఎలుగెత్తిన గొంతుకకు తోడుగా మరికొన్ని గొంతుకలు కలుస్తున్నాయి.

ఆ స్వరాన్ని పెంచుతున్నాయి. గళాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఎన్ని యుగాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఒక్కసారి మొదలైన తర్వాత ఇక పెను ఉప్పెన కాక ఆగదు. న్యాయం జరిగే వరకు కొనసాగి తీరుతుంది. ‘నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను’ అని చెప్పడానికి విప్పిన ఈ ‘మీ టూ’ గళం, ‘నాక్కూడా న్యాయం జరిగింది’ అనే విజయదరహాసంతో సమాజంలో సమున్నత శిఖరాన్ని చేరాలి. ‘మీటూ’ అనగానే ఈ ఉద్యమం మగవాళ్ల మీద పోరాడడానికే అనే అపోహ నెలకొంటోంది. నిజానికి ఇది ఆడవాళ్ల ఆత్మగౌరవ నినాదం. మా హక్కుల పోరాటం. రాబోయే తరాలకు ఈ వేధింపులు ఉండకూడదనే ఆరాటం. మగవాళ్లలో సున్నితత్వపు పొరలను తట్టి లేపడానికి చేస్తున్న ప్రయత్నం.

పెళ్లయినట్లు మంగళసూత్రాలు
ఇది ముప్పయ్‌ ఐదేళ్ల కిందటి మాట. మహిళల్లో ఎంతటి అభద్రత ఉండేదంటే... నేను హైదరాబాద్‌లోని ఓ గవర్నమెంట్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా ఉన్నప్పుడు మరో విభాగంలో ఇద్దరు పెళ్లి కావల్సిన అమ్మాయిలు ఆఫీసుకు మంగళసూత్రాలు వేసుకుని వచ్చేవాళ్లు. పెళ్లయిన అమ్మాయిలకు లైంగిక వేధింపులు తగ్గుతాయని వాళ్లలా వేసుకునే వాళ్లు. కానీ నిజానికి పెళ్లయినా, బిడ్డకు తల్లయినా, గర్భవతి అయినా సరే... కారుకూతలు కూసేవాళ్లకు అవేమీ పట్టవు.

బస్టాపుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో అనుచితంగా ప్రవర్తించిన వాళ్లను డీల్‌ చేయడం చాలా తేలిక. ‘ఏమిటి దగ్గరకొస్తున్నావు, తగలకు, దూరం జరుగు’ అని గట్టిగా అంటే చాలు. ఎవరైనా చూస్తారేమోనని తల వంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. నారాయణగూడ నుంచి ఆర్ట్స్‌ కాలేజ్‌కి వెళ్తున్నాను, బస్‌లో రాడ్‌ పట్టుకుని నిలబడితే నా చేతి మీద మరో చేయి పడింది. చూసి నా చేతిని లాక్కుని కొంచెం ముందుకు జరిగి రాడ్‌ పట్టుకున్నాను. మళ్లీ అదే చెయ్యి.

మూడు నాలుగు సార్లు ముందుకు జరిగిన తర్వాత ఇక ఊరుకోలేదు. ‘లం... కొడకా ఏంటి సంగతి, చెప్పు తీసి కొడతాను’ అని గట్టిగా అనగానే ఏమీ తెలియనట్లు జారుకున్నాడు. ఆడవాళ్లు బూతులు మాట్లాడితే ఎంతటి మగవాడైనా భయపడిపోతాడు. ఆడవాళ్లం అలాంటి మాటలు ఎలా మాట్లాడతాం అనుకుంటే మన కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రారు. ఎవరో వచ్చి కన్నీళ్లు తుడవాలని ఎదురుచూసే పరిస్థితిలో ఉండరాదు కూడా. సభ్య సమాజంలో సభ్యతగా మాట్లాడడం ఎంత అవసరమో, నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి గొంతులో కాఠిన్యాన్ని పలికించడమూ అంతే అవసరం.

మరిన్ని వార్తలు