అష్టావధానాలతో మొదలు

29 Jun, 2020 01:46 IST|Sakshi

తెలుగు సాహిత్యానికి ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న డాక్టర్‌ శాంతినారాయణ ఇప్పటిదాకా కథ, కవిత, నవల మొదలైన ప్రక్రియల్లో 17 పుస్తకాలు ప్రచురించారు. జూలై 1న ఆయన 75వ జన్మదినం సందర్భంగా ఒక సంభాషణ. 

సాహిత్యంలో మీ తొలి అడుగులు?
అష్టావధానాలతో నా సాహిత్య జీవితం మొదలైంది. తిరుపతి ఓరియంటల్‌ కళాశాల విద్యార్థిగా 1968లో మొదలుపెట్టి 1975 వరకు 26 అష్టావధానాలు చేశాను. ఆ కళాశాల వాతావరణమే నా అవధాన రచనకు ప్రేరణ. అయితే నా చుట్టూవున్న సమాజ స్థితిగతులూ, వాటిని కేంద్రంగా చేసుకొని బలంగా వస్తున్న ఆధునిక సాహిత్య ప్రక్రియలూ నా గమనాన్ని మార్చివేశాయి.

మీ తొలి రచన?
నేరుగా పుస్తకరూపం(1972)లో వచ్చింది ‘రక్తపుముద్ద పిలిచింది’ అనే కథ. నేను అష్టావధానాలకు సమాంతరంగా 1970 నుంచీ కథలు రాస్తున్నానన్నది వొక వాస్తవం. 

మీ రచనలకు ప్రేరణ?
ఆరోగ్యకరమైన సమాజం కోసం సామాజిక బాధ్యత కలిగిన ప్రతిపౌరుడూ ఆరాటపడతాడు. అతడు సృజనకారుడయితే, తన చుట్టూ వున్న అప్రజాస్వామిక విధానాల పట్ల క్షుభితుడై, వొక పౌరునిగా వాటిని చక్కదిద్దడానికి అశక్తుడై, తన రచనలలో వాటిని ఎండగట్టడానికీ, కళాత్మకంగా రికార్డు చేయడానికీ పూనుకుంటాడు. ఆ బాధ్యతతోనే నేను రచనలు చేస్తున్నాను. ఇందుకు నా చుట్టూవున్న ఈ సమాజమూ ముఖ్యంగా నా రాయలసీమ తల్లి దైన్యస్థితే ప్రేరణ.

ఇన్నేళ్ల సాహిత్య జీవితంలో మీరేం సాధించారు?
ఏ రచయిత అయినా జీవితంలో తన సాహిత్యం ద్వారా సాధించినదేమిటని చూసినప్పుడు ప్రత్యక్షంగా కనిపించేవి, సాహిత్య గ్రంథాల జాబితాలో తాను చేర్చిన తన పుస్తకాలు కొన్ని, తన అలమారల్లో చేర్చుకున్న పేరు ప్రతిష్ఠలు కాసిన్ని! కానీ పరోక్షంగా వొక మంచి రచయిత సమాజానికి కొన్ని కొత్త ఆలోచనల్నీ నూతన చైతన్యాన్నీ అందిస్తాడు. నేను భౌతికంగా అయితే ఇంతవరకూ కొన్ని కవితా కథా సంపుటాలనూ నవలలనూ సాహిత్యగ్రంథాల జాబితాలోకి చేర్చాను కానీ అవి ఏ ఆలోచనల్ని అందించాయో పాఠకులే చెప్పాలి.

రాయలసీమ ఉద్యమసాహిత్యం గురించి చెప్పండి.
1980లలో ‘రాయలసీమ విమోచన సమితి’ ఆధ్వర్యంలో ప్రారంభమయిన రాయలసీమ ఉద్యమం, ఆ తర్వాత ఎన్నో కారణాల వల్ల మరుగున పడిపోయింది. రాయలసీమ కథా నవలా సాహిత్యంలో మూడోతరం రచయితలు ‘సీమ అస్తిత్వ’ స్పృహతో రచనలు చేయడం మొదలయ్యాక రాయలసీమను గురించిన చర్చలు ఎక్కువయ్యాయి. అనాలోచితమయిన ‘ఆంధ్రరాష్ట్ర సమైక్య ఉద్యమం’ ముసుగు కింద నలిగిపోయిన ‘రాయలసీమ’ భావన, తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సాహిత్యంలో మళ్లీ కొత్త ఆలోచనలతో ముందుకొస్తూవుంది. నిన్నటి వరకు సీమ దుర్గతికి గల కారణాలనూ చిత్రిస్తూ వచ్చిన రచయితలు, ఇప్పుడు పూర్తి అస్తిత్వ స్పృహతో సీమ పురోగతికి అవసరమయిన పరిష్కార మార్గాలు చూపుతూ రచనలు చేస్తున్నారు.

మీ విమలాశాంతి సాహిత్య సేవాసమితిని గురించి చెప్పండి.
వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన నాకు సాహిత్య గంధం అబ్బడమే వొక అదృష్టం. అటువంటి నాకు కొద్దోగొప్పో వొక రచయితగా గుర్తింపురావడం విశేషం. నాకు గుర్తింపునిచ్చిన ఈ సాహిత్యానికీ, సౌకర్యవంతమయిన బతుకునిచ్చిన ఈ సమాజానికీ మరింత సేవ చేయాలన్న సంకల్పంతో నా శ్రీమతి విమల మరియు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవాసమితిని ఏర్పాటు చేశాను. 2006 నుంచి ప్రతి యేటా మా సంస్థ పురస్కారాలను అందిస్తున్నది. 

రాబోయే కాలంలో మీ ప్రయాణం?
కాలమూ ప్రకృతీ అనుకూలిస్తే, రాయలసీమ అస్తిత్వ స్పృహతో వొకటి, కటిక చీకట్లో నుంచీ ఇక్కడి వరకూ వచ్చిన నా బతుకుబండిని గురించి వొకటి, ఇంకా నా హృదయంలో చెరిగిపోని ముద్రలు వేసిన అంశాలపైన రెండు మూడు నవలలూ, కథలూ రాయాలనుకున్నాను. నేను నికార్సయిన స్త్రీవాదిని. స్త్రీ అస్తిత్వ నేపథ్యంగా ఇటీవలే రాసిన వొక నవల ముద్రణకు సిద్ధంగా వుంది.

మరిన్ని వార్తలు