సంతృప్తి.. సంతోషం..!

16 Jul, 2019 11:30 IST|Sakshi
మేడపై ఇంటిపంటలకు నీరు పోస్తున్న సుధాకర్‌రెడ్డి

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో కొత్తిమీర, పుదీన, ఆకుకూరలు, కూరగాయల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. అంతేకాదు.. నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో గతంలో కూరగాయలు సాగయ్యే భూములు చాలావరకు రియల్‌ ఎస్టేట్లుగా మారడంతో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో దూరప్రాంతాల నుంచి కూరగాయలు రవాణా అవుతున్నందున ఈ సీజన్‌లో ఎన్నడూ ఎరుగనంత ధరలు పలుకుతున్నాయి. ఈ సమస్య కొంత వరకైనా తీరాలంటే నగరాలు, పట్టణాల్లో సొంత ఇళ్లలో నివాసం ఉంటున్న వారు తమ ఇళ్ల పైన కూరగాయలు, ఆకుకూరల సాగుకు ఉపక్రమించడం అవసరం.

కేవలం కూరగాయలు, ఆకుకూరల లభ్యత దృష్ట్యానే కాకుండా.. రసాయనిక అవశేషాల్లేని సూక్ష్మపోషకాలతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తులను ఎవరికి వారు ఇంటిపంటల్లో పండించుకోవడం ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా అవసరమే అంటున్నారు హన్మకొండ పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి గుండ్రెడ్డి సుధాకర్‌రెడ్డి. గత ఏడాది కాలంగా ఆయన తన ఇంటిపైన సేంద్రియ పద్ధతుల్లో తమకు ఇష్టమైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటూ సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తున్నారు. హన్మకొండ పట్టణంలోని రెడ్డి కాలనీ రోడ్‌ నెంబర్‌–2లో నివాసం ఉంటున్న సుధాకర్‌రెడ్డి సింగరేణి కాలరీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసి ఆరేళ్ల క్రితం గోదావరిఖనిలో పదవీ విరమణ పొందారు. అనంతరం హన్మకొండలోని సొంత ఇంటికి సుధాకర్‌రెడ్డి మాకం మార్చారు. ప్రతి రోజు ఉదయమే గ్రౌండ్‌కు వెల్లి నడిచిన తర్వాత.. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని తీసుకొచ్చేవాడు. గత ఏడాది ఇంటిపంటల సాగుపై హనుమకొండలో జరిగిన అవగాహన సదస్సు ప్రేరణ కలిగించి కార్యాచరణకు దారి చూపింది.

అనుకున్నదే తడువుగా (20 కిలోల) ఖాళీ పెరుగు డబ్బాలు 50, పాడయిన ఎయిర్‌ కూలర్ల కింది బాగాలు 20 వరకు సేకరించారు. చివికిన పశువులు ఎరువు, కొబ్బరి పొట్టు, ఎర్ర మట్టి కలిపిన మట్టిమిశ్రమంలో సుధాకర్‌రెడ్డి కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. వంగ, బెండ, టమాట, బీర, గోరుచిక్కుడు, మిర్చి, కొత్తిమీర, మెంతి ఆకు, పాలకూర, తోటకూర, చిక్కుడు విత్తనాలను తొలుత చల్లారు. కొద్ది వారాల్లోనే ఆకుకూరలు, కూరగాయలు చేతికి రావడం ప్రారంభమైంది. ఏడాది తిరిగేటప్పటికి ఇంటిపంటల సాగులో ఆయన అనుభవం గడించారు. ఈ ఏడాది ఎండాకాలంలో కూడా షేడ్‌నెట్‌ ఏర్పాటు చేసుకొని వంగ, బెండ, దొండ, పాలకూర, ఎర్ర తోటకూర, పొన్నగంటి ఆకుకూరలను సాగు చేశారు. అవి ఇప్పుడు మంచి దిగుబడిని ఇస్తున్నాయని సుధాకర్‌రెడ్డి ఆనందంగా చెబుతున్నారు. ఆకుకూరలు ఒక్కో రకాన్ని 3,4 డబ్బాల్లో విత్తానని, ఆకులు కత్తిరిస్తూ ఉంటే.. పది రోజుల్లో మళ్లీ పెరిగి కోతకు వస్తున్నాయన్నారు. ఏ రోజూ ఆకుకూరల కొరత లేకుండా ఉంటున్నదన్నారు. ఈ సంవత్సరం గోరుచిక్కుడు, చిక్కుడు, పొట్లవిత్తనాలు అదనంగా నాటుకున్నానని ఆయన తెలిపారు. వేసవిలో తన కుమారులు ఇద్దరు కుటుంబాలతో తమ ఇంటికి వచ్చినప్పుడు ఇంటిపంటల రుచి చూసి చాలా సంతోషించారన్నారు. వేసవిలో రెండు పూటలా నీరు పోయాల్సిన అవసరం రావడంతో తన కుమారుడే డ్రిప్‌ ఏర్పాటు చేసి వెళ్లాడని ఆయన తెలిపారు. చిక్కుడు, సొర, బీర తీగలు పాకేందుకు ఇనుప మెష్‌తో ఫెన్సింగ్, జాలీ ఏర్పాటు చేస్తున్నానని సుధాకర్‌రెడ్డి (9491473368) తెలిపారు.– గజ్జి రమేష్, సాక్షి, హన్మకొండ చౌరస్తా

మరిన్ని వార్తలు