ఓం..శాంతి పట్టు!

1 Oct, 2018 00:58 IST|Sakshi

గాంధీజీ 150 వ జయంతి రేపు. సమాజంలోని అణువణువులో ఆయన ప్రవచించిన అహింస.. ఓంకార నాదంలా ధ్వనిస్తోంది. శాంతి మార్గమై నడిపిస్తోంది. జ్యోతిరెడ్డి ఆ ధ్వనికి... ప్రతిధ్వని అయ్యారు. ఆ శాంతిమార్గంలో ఓ ‘పట్టు’ కొమ్మ అయ్యారు. పట్టుకు ఆయువు పట్టు అయిన పురుగు ప్రాణం తియ్యకుండా దారాన్ని సేకరించే ‘ఇంటెలిజెంట్‌ డిజైనర్‌’ అయ్యారు.

‘‘ప్రకృతి మనకు పత్తితోపాటు పట్టును కూడా ఇచ్చింది. పట్టు కోసం పట్టు పురుగును పెంచి, చంపడం అనే అమానుషానికి పాల్పడనక్కర్లేదు’’ అంటారు జ్యోతిరెడ్డి. అందంగా కనిపించడానికి చక్కటి పట్టు దుస్తులు ధరించాలనుకుంటాం. అందుకోసం పట్టు పురుగు మనకు అమూల్యమైన సేవలందిస్తోంది. దాని జీవితమంతా పట్టును పుట్టించడంలోనే గడుపుతుంది. పట్టు పురుగులు మల్బరీ ఆకులను తిని తమ చుట్టూ గూడు అల్లుకుంటాయి. అదే పట్టుగూడు. పురుగు గూడు లోపల ఉంటుంది.

ఆ పట్టు గూళ్లను వేడి నీటిలో వేసినప్పుడు దారం వస్తుంది, కానీ పురుగు ప్రాణం పోతుంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న పట్టు సేకరణ విధానంలో పట్టు దారం కోసం పట్టు పురుగును నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అహింసాయుతంగా జీవించడానికి గాంధీజీ చెప్పినట్లు ‘విలువైనది మనిషి ప్రాణం మాత్రమే కాదు, అన్ని జీవుల ప్రాణమూ అంతే సమానమైనది’ అని జ్యోతిరెడ్డి నమ్ముతారు. నిజమే. మన మనుగడ కోసం ప్రాణుల్ని చంపాల్సి రావడాన్ని తప్పు పట్టలేం. కానీ మన అందం, ఆనందం కోసం ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.

అహింస పట్టు
ప్రకృతి మనకు జీవించడానికి అన్ని వనరులనూ ఇచ్చింది. అలాగే హింసకు తావులేని పట్టును కూడా ఇచ్చింది. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగే పట్టు పురుగులు స్వేచ్ఛాజీవులు. వాటికి ఆముదం ఆకులే ఆహారం. అక్కడ ఆముదం చెట్లు విస్తారంగా ఉంటాయి. ఆ పట్టుపురుగులు తమ చుట్టూ గూడు కట్టుకోవు. ఆకుల మీద పట్టు దారాలతో గూడు అల్లుతాయి. కొన్నాళ్లకు పాత గూడుని వదిలి మరో ఆకు మీదకు వెళ్లి కొత్త గూడు అల్లుతాయి.

స్థానిక గిరిజనులు పురుగు వెళ్లిపోయిన ఆకును ఇట్టే గుర్తించగలుగుతారు. అలాంటి ఆకుల నుంచి మాత్రమే పట్టును సేకరిస్తారు. అంతే తప్ప పట్టు కోసం పురుగుకు హాని కలిగించరు. వారి జీవనం లాగానే వారి పట్టు వస్త్రాల తయారీ కూడా శాంతియుతంగానే ఉంటుంది. పట్టుదారం వడకడం, పట్టు వస్త్రాలను నేయడం అసోంలో కుటీరపరిశ్రమ. ఆ వస్త్రాలను పవిత్రంగా భావిస్తారు. పండుగలు, వేడుకలప్పుడు ధరిస్తారు. అహింసాయుత జీవితాన్ని ఆచరించే జైన, బౌద్ధులు ఈ వస్త్రాలను ధరిస్తారు.

నేను వెదికింది అదే
‘ద వరల్డ్‌ నీడ్స్‌ ఇంటెలిజెంట్‌ ఫ్యాబ్రిక్‌ ’అన్న మాటలే తనను ఈ శాంతి పట్టు వైపు నడిపించాయంటారు జ్యోతి. ‘‘ఎక్స్‌పోర్ట్‌ వ్యాపారంలో అంతర్జాతీయ ట్రేడ్‌ షోలకు వెళ్లినప్పుడు ఇటాలియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ అన్న ఆ మాటకు అర్థం అప్పట్లో తెలియలేదు. ఇండియాకి వచ్చిన తర్వాత నా పనుల్లో నేను ఉన్నప్పటికీ వస్త్రరంగం మీద పరిశోధన మొదలు పెట్టాను. అంతకుముందు నేనే సొంతంగా డిజైన్‌ చేస్తూ బొటీక్‌ నడిపిన అనుభవాన్ని జోడించి రకరకాల వస్త్రరీతులను అధ్యయనం చేశాను.

అందులో భాగంగా ముంబయిలో నాకు తెలిసిన డిజైనర్లతో కూడా మాట్లాడాను. అసోం గిరిజనులు పట్టు దారాన్ని సేకరించే విధానం, ఎరికల్చర్, ఎరి సిల్క్‌తో చేనేత గురించి తెలిసింది. ఓపెన్‌ కకూన్‌ని చూద్దామని వెళ్లాను. అక్కడ ఇది కుటీరపరిశ్రమ. ఇంట్లో అందరూ పని చేస్తారు. పట్టు దారం వడకడం నుంచి వస్త్రం నేయడం వరకు అన్నింటినీ స్వయంగా చేస్తారు. ప్రతి ఇంటి ముందు వెదురు కర్రల ఫ్రేమ్‌ ఉంటుంది. పట్టు వస్త్రం మీద కళాత్మకమైన డిజైన్‌తో నేసి ఆ ఫ్రేమ్‌కి తగిలిస్తారు.

ఎవరి డిజైన్‌ వాళ్లదే. తల్లి నుంచి కూతురు నేర్చుకుంటుంది, ఆమె మరింత సృజనాత్మకత జోడించి కొత్త డిజైన్‌ను రూపొందిస్తుంది. అది ఆ కుటుంబానికే సొంతం. ఆ వస్త్రం చాలా అందంగా, ఒంటికి హాయిగా ఉంటుంది. రోజంతా ధరించినా ఒక్క ముడత కూడా పడదు. ఎన్ని రకాలుగా కట్టినా చక్కగా అమరిపోతుంది. ఆ పట్టు మీద మరెన్నో ప్రయోగాలు చేయవచ్చనిపించింది. ఇటాలియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ అన్న మాటల అర్థం అప్పుడు తెలిసింది. నిజంగా అది ఇంటెలిజెంట్‌ ఫ్యాబ్రికే. దీని మీద ఐదేళ్ల పాటు పరిశోధించాను. సురయ్యా హసన్‌ బోస్, ఉజ్రమ్మ, బీనారావు వంటి వాళ్ల అనుభవాలను తెలుసుకున్నాను.

అసోం టు అమెరికా  
అసోం పట్టు దారాన్ని సన్నగా చేయగలిగితే విప్లవమే తీసుకురావచ్చనిపించింది. ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నాలు చేసేటప్పుడు.. ‘దీని మీద సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించరాదు, మీ ఆలోచనను నిరూపించాలనే తపన ఉంటే మాత్రం ముందుకెళ్లవచ్చు’ అని చెప్పారు ఆడిటర్‌. నా ప్యాషనే నన్ను ముందుకు నడిపించింది. నాలాగే ఆలోచించే మరికొందరం కలిసి చైనా మిషనరీతో కో ఆపరేటివ్‌ విధానంలో ఫ్యాక్టరీ పెట్టాం.

నాలుగు వందల మంది చేనేతకారులు మాతో పని చేస్తున్నారు. మేము తయారు చేస్తున్న సన్నటి దారాన్ని ఇకత్, జామ్‌దాని, పైథాని, జకార్డ్‌ నేతలతో మిళితం చేస్తున్నాం. అందుకోసం వివిధ రాష్ట్రాల్లో నిపుణులైన చేనేతకారులను కలిశాను. పుట్టపాక, పోచంపల్లి, చౌటుప్పల్‌ నుంచి కోల్‌కతా, మిడ్నాపూర్‌ వరకు మొత్తం ఎనభై మంది మాస్టర్‌ వీవర్స్‌ మాతో పని చేస్తున్నారు. వాళ్ల సంప్రదాయ డిజైన్‌లకు కొత్త రీతులను జోడించి వైవిధ్యంగా తెస్తున్నాం.

కలంకారీ అద్దకం చేస్తున్నాం. నా ప్రయత్నం అన్నింటిలోనూ విజయవంతమైంది. కానీ అడ్డంకి ఒక్క బాతిక్‌ దగ్గరే వచ్చింది. ఓపెన్‌ కకూన్‌లు ఆముదం ఆకును తింటాయి, కాబట్టి వాటి నుంచి వచ్చిన పట్టు కూడా చాలా స్మూత్‌గా జారుడుగా ఉంటుంది. దాంతో బాతిక్‌ ప్రింట్‌ కుదరలేదు. బాతిక్‌ కోసం పట్టులో ఆర్గానిక్‌ కాటన్‌ మిక్స్‌ చేసి ప్రయోగం చేస్తున్నాం.

ఎరీనా బ్రాండ్‌ కోసం...
ఎరి సిల్క్‌లో ప్రయోగాలతోపాటు ఇప్పుడు మా ఉత్పత్తుల బ్రాండింగ్‌ మీద దృష్టి పెట్టాను. జర్మనీలో సిల్క్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లో మా పట్టు వస్త్రాలకు మంచి ఆదరణ వచ్చింది. స్థానిక మ్యాగజైన్‌లలో మంచి కథనాలు రాశారు. అమెరికాకీ పరిచయం చేశాను. మనదేశంలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసుకోవడంలో ఇప్పటికే చాలా వెనుకపడిపోయాం. దాంతో కొన్ని తరాల వెనుక మన చేనేతకారుల్లో ఉండిన కళ యథాతథంగా తర్వాతి తరాలకు కొనసాగలేదు.

ఇప్పుడు అనేక ప్యాటర్న్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఉన్న వాటినైనా పరిరక్షించుకుంటే.. ఇండియా వేల ఏళ్ల కిందటే ఫ్యాషన్‌కు ప్రతీక అని ప్రపంచానికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరినీ నేను కోరేది ఒక్కటే. ‘బయటి దేశాలకు వెళ్లినప్పుడు మన వస్త్రాలను ధరిస్తే... మనదేశానికి మనమే బ్రాండ్‌ అంబాసిడర్‌లం అవుతాం’. అలాగని చీరలే కట్టాల్సిన పనిలేదు. కుర్తాలు, దుపట్టాలు, స్టోల్స్‌ ధరించినా చాలు. మన దగ్గర ఉన్న కళాత్మకతను గర్వంగా ప్రదర్శించవచ్చు’’.

జర్మనీ ఫ్రెండ్‌ నుంచి ఫోన్‌ కాల్‌
నేను పుట్టింది, పెరిగింది ముంబయిలో. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లాను. ఎంబీఏ అక్కడే చేశాను. పిల్లలిద్దరూ అక్కడే పుట్టారు. నాకేమో ఇండియా అంటే చాలా ఇష్టం. మనదేశంలో లేననే బెంగ ఉండేది. మా వారు (చంద్రశేఖర్‌) హైదరాబాద్‌లో బిజినెస్‌ ప్లాన్‌ చేయడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇండియాకి వచ్చేటప్పటికి పిల్లలు కొంచెం పెద్దయ్యారు.

నేను కూడా ఏదైనా చేయాలనే ఆలోచనతో షూషాప్, బొటీక్‌ పెట్టాను. అమెరికాలో ఉన్న జర్మన్‌ ఫ్రెండ్‌కి ఎంబ్రాయిడరీ దుస్తులు ఎక్స్‌పోర్ట్‌ చేయాల్సిన ఎక్స్‌పోర్టర్‌ హటాత్తుగా సప్లయ్‌ ఆపేయడంతో ఆమె నాకు ఫోన్‌ చేసింది. ఆమెకు వస్త్రాలను ఎక్స్‌పోర్ట్‌ చేయడం కోసం 1996లో ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ మొదలైంది. ఆ బిజినెస్‌ని విస్తరించడం కోసం వెళ్లిన ఫ్రాన్స్, స్వీడన్‌లలో ట్రేడ్‌ ఫెయిర్‌లతో శాంతియుతమైన ఎరి సిల్క్‌ బాట పట్టాను.
 

డిన్నర్‌ టేబుల్‌ స్టోరీలు
మా అమ్మానాన్నల అనుభవాలే మాకు పాఠాలు. నాన్న వరంగల్‌లో చిన్న గ్రామం నుంచి ముంబయికి వెళ్లారు. అక్కడ షిప్పింగ్‌ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. రాత్రి భోజనాలప్పుడు అన్ని విషయాలనూ చెప్తుండేవారు. ఒక సమస్యను అధిగమించడానికి ఎంత చాకచక్యంగా వ్యవహరించాలనేది ఆయన ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ మాలో వ్యాపార నైపుణ్యాలు పెరగడానికి అవన్నీ ఉపకరించాయి.

అమ్మ ప్రతి పనినీ చాలా క్రియేటివ్‌గా చేసేది. అప్పట్లో మాకు భోజనాలకు కేసరోల్స్‌ ఉండేవి కాదు, స్టీలు గిన్నెలనే టేబుల్‌ మీద చక్కగా అమర్చేది. పూలను ఒకసారి కట్టినట్లు మరోసారి కట్టేది కాదు. ముగ్గులు కూడా నేర్చుకున్న వాటిని నేర్చుకున్నట్లు యథాతథంగా వేసేది కాదు. తన సృజనను జోడించేది. వీటన్నింటినీ చూస్తూ పెరిగాను. కాబట్టే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేయకపోయినా ఈ రంగంలో విజయవంతం కాగలుగుతున్నాను.

నా ఈ ప్రయత్నంలో ప్రత్యక్షంగా వందల కుటుంబాలకు ఉపాధి దొరకడంతోపాటు పరోక్షంగా వేలాది కుటుంబాలకు రాబడి పెరుగుతోంది. భారతీయ వస్త్ర కళ అంతర్జాతీయ వేదిక మీద మన్ననలు పొందేలా చేయాలనేది నా ఆకాంక్ష. నా రక్తంలో భారతీయత ఉంది. దేశగౌరవాన్ని పెంచడానికి నా వంతుగా ఏదైనా చేయాలి. నేను చేస్తున్న దేశసేవ ఇది.

మరిన్ని వార్తలు