అవిశ్వాసులపై దండయాత్ర!

12 Dec, 2016 13:50 IST|Sakshi
అవిశ్వాసులపై దండయాత్ర!

ప్రవక్త జీవితం

ఒక్క అబూ లహబ్  తప్ప, అందరూ అబూ తాలిబ్ మాటలతో ఏకీభవించారు. ముహమ్మద్ (స)ను ఒంటరిగా వదిలిపెట్టబోమని ప్రకటించారు. ‘ఇన్నాళ్ళూ సహించి ఊరకున్నాం. ఇక సహించే ప్రసక్తే లేదు’ అన్నారందరూ ముక్తకంఠంతో. అబూ లహబ్ మాత్రం కుటుంబ సభ్యులతో విభేదించి, శతృపక్షంలో చేరిపోయాడు.ఈ విషయం ముహమ్మద్‌కు చెబుదామని చాలా సంతోషంగా బయలుదేరారు అబూ తాలిబ్. కానీ ఆయన ఇంట్లో లేరు. ఎటువెళ్ళారో తెలియదన్నారు ఇంట్లోవాళ్ళు. అబూ తాలిబ్ మనసు కీడు శంకించింది. దుర్మార్గులు అబ్బాయికి ఏమైనా కీడు తలపెట్టారేమో అని తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే యువకులందర్నీ ఆయన సమీకరించి, కరవాలాలు తీసుకొని తన వెంట బయలుదేరమన్నారు. క్షణాల్లో యువకులంతా ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. అబూ తాలిబ్ సూచన మేరకు అవి కనబడకుండా చొక్కాల లోపల దాచుకున్నారు. అబూ తాలిబ్ నేరుగా కాబా వైపు దారితీశారు. దారిలో ప్రవక్త పెంపుడు కొడుకు జైద్ బిన్ హారిసా (ర) ఎదురుపడి, ఏమిటీ విషయమని ఆరా తీశారు. ‘ముహమ్మద్ (స) హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి’ అని బదులిచ్చారు అబూ తాలిబ్. ‘అదేమిటీ! ఆయన నిక్షేపంగా కాబాలో ఉన్నారు. నేనిప్పుడు ఆయన దగ్గర నుండే వస్తున్నాను’ అన్నారు జైద్.

జైద్ మాటలతో అబూతాలిబ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆయన మనసుకు ప్రశాంతత చేకూరింది. అయినా కాబా ఆలయానికి వెళ్ళి, అబ్బాయిని కళ్ళారా చూసుకోవాలని ముందుకు సాగారు.అకస్మాత్తుగా బనూహాషిం యువకుల్ని వెంటబెట్టుకొని అబూతాలిబ్ రావడం చూసి అవిశ్వాసులు ఆశ్చర్యపోయారు. ప్రశ్నార్థకంగా వాళ్ళంతా ఒకరి ముఖాలొకరు చూసుకొన్నారు. అది చూసి, అబూ తాలిబ్ ‘ఏమిటి ఆశ్చర్యపోతున్నారు? నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలుసా?’ అని ప్రశ్నించారు.

‘దేవుని తోడు. మాకు అసలు ఏమీ తెలియదు’ అన్నారు వారంతా ముక్తకంఠంతో. అప్పుడు అబూ తాలిబ్ విషయం వివరించి, యువకుల వైపు సైగ చేశారు. వెంటనే బనూహాషిం యువకిశోరాలు తాము లోపల దాచిన ఆయుధాలు బయటికి ప్రదర్శించారు.అప్పుడు అబూతాలిబ్, ‘దైవసాక్షిగా చెబుతున్నాను. మీరు గనక మా ముహమ్మద్‌కు హాని కలిగించి ఉన్నట్లయితే, మిమ్మల్ని కత్తికో కండగా కోసి, కుక్కల పాలు చేసేవాణ్ణి. ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలేవాణ్ణి కాదు. మా ప్రాణాలు పోయినా సరే, చివరి రక్తపుబొట్టు వరకు మీతో పోరాడేవాణ్ణి’ అన్నారు.యువకుల ఖడ్గప్రదర్శన, అబూ తాలిబ్ ఉగ్రరూప వాగ్ధాటిని చూసి అవిశ్వాసుల గుండెలు జారిపోయాయి. బిత్తరపోయి ఒకరి ముఖాలొకరు చూసుకోవడం ప్రారంభించారు.

- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

మరిన్ని వార్తలు