కాడి పట్టింది

8 Mar, 2019 01:57 IST|Sakshi

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రాతన గ్రామానికి చెందిన లాలూబీ తన భర్త పెద్ద మౌలాలితో కలిసి ఉన్న నాలుగన్నర ఎకరాలతో పాటు, మరికొంత పొలం గుత్తకు తీసుకుని పంటలు పండించుకుంటూ జీవించేవారు. తీవ్ర వర్షాభావం, పంట పెట్టుబడులు భారీగా పెరగడం, దిగుబడులు తగ్గడం తదితర కారణాలతో తీవ్ర నష్టాలను చూశారు. పంటల సాగు, కుటుంబ పోషణకు చేసిన అప్పులు కూడా పెరిగిపోయాయి. అప్పుల బాధ తాళలేక 2014 నవంబర్‌ 20న పెద్ద మౌలాలి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాలూబీ భర్తను కోల్పోయింది, కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. ఇద్దరు కుమారులు, కోడళ్లు, వారి పిల్లల బాధ్యత లాలూబీపై పడింది.

ఉన్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని గుత్తకు తీసుకుని వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వరుస కరువులతో పంటలు పండకున్నా చేసిన అప్పులు తీర్చేందుకు పిల్లలతో పాటు కూలి పనులకెళుతోంది. పెద్దకొడుకు చాంద్‌బాష పొలం పనులతో పాటు, జేసీబీ డ్రైవర్‌గా, చిన్న కుమారుడు మున్నా సైకిల్‌ షాపు నడుపుకుంటూ లాలూబీకి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అప్పుల బాధతో కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకున్నా, ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి పరిహారం రాకపోయినా కుంగిపోకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఆత్మస్థైర్యంతో నిలబడి కుటుంబాన్ని నడుపుతోంది. 
 

మరిన్ని వార్తలు