మీరేం చేయగలరు...

5 Dec, 2014 23:34 IST|Sakshi
మీరేం చేయగలరు...

వ్యవసాయం నుంచి మెలమెల్లగా పెట్టుబడిని తరలించి  ఫలసాయం లేనిది ఎవుసం అనగలరు ఇంటింటికి టివి అందించి వస్తువులు అక్కర లేకున్నా  అవసరమని ఒప్పించి ఇల్లును బోల్తా కొట్టించగలరు మనిషి మనిషికి ఒక సెల్‌ను అమ్మి  బంధాలను విడగొట్టగలరు  కుదిరిన పెండ్లిల్లను చెడగొట్టగలరు
 
రైతులను  స్వచ్ఛందంగా ఆత్మహత్యల వైపు  కూలీలను లేబర్ అడ్డాల వైపు తరిమి  రోడ్లు ఊడ్చేవారిగా భవన నిర్మాణ కార్మికులుగా పరిమార్చగలరు తరి భూములను  బరాబరి గుంజుకుని పరిశ్రమలకు దానధర్మం చేయగలరు .  సహజ ఆత్మీయుల మధ్య పొగలేని మంటపెట్టి మసలివారిని పాత సామానులా  వృద్ధాశ్రమాలకు తరిమికొట్టగలరు దిక్కుతోచక తల్లిదండ్రులు పుటుక్కున చనిపోతే పిల్లలను అనాథాశ్రమాలకు దయతో పంపించగలరు
 
ఫోర్‌లైన్ల రోడ్లేసి  గ్రామ సంపదను క్షణాల్లో తరలించగలరు  తాగే నీళ్లు లేకుండా చేసి  ఇంటింటికి మంచినీళ్లు అమ్మగలరు తిండి అందకుండా చేసి  బియ్యం పంచగలరు  ఆహారానికి భద్రతను కల్పించగలరు పని దొరక్కుండా చేసి ఉపాధి హామీ ఇవ్వగలరు .పరిహాస పరిహారాలు ఇవ్వగలరుగాని  ఊరితో ముడిపడిన జ్ఞాపకాలను ఇవ్వలేరు . స్థూపాలను కట్టగలరు కానీ గుండెల్లో గడ్డపారలా దిగబడిన
 మనఃస్తాపాలను మాన్పలేరు
 
రాత్రులకు లెసైన్స్ ఇచ్చి ఉదయాలను బంధించాలని చూస్తారు. రాజ్యాంగం పేర నియంతృత్వం చేయగలరు  చట్టం పేర దేశాన్ని నేలమట్టం చేయగలరు మీరేం చేయగలరు  మహా అయితే  పాత గోడలకు పూత సున్నం పూయగలరు .మీరేం చేయగలరు  నిరసన చేసే ప్రజలకు
 మోచేతికి బెల్లం పెట్టి నాకమనగలరు.  కాదంటే చచ్చేలా చేసి  చావు డప్పు కొట్టగలరు.


 - జూకంటి జగన్నాథం 9441078095
 
 

మరిన్ని వార్తలు