మాతో సమానమా?!

19 Sep, 2018 00:27 IST|Sakshi

చెట్టు నీడ 

చివరగా ఆ విద్యాలయంలోనే ఉంటూ ఉన్న వంట సిబ్బందిని, నౌకర్లను కూడా వేదికపైకి ఆహ్వానించి వారినీ సత్కరించారు. ఇది కొందరు గురువులకు నచ్చలేదు.అదొక పెద్ద జెన్‌ విద్యాలయం. అక్కడ రెండు తరాలుగా ఎందరో సాధువులు క్రమపద్ధతిలో తర్ఫీదు పొందారు. ఆ విద్యాలయం ఆరంభించి ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ స్థాయిలో వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన గురువుతోపాటు ఎందరో తరలివచ్చారు. ఈ సంస్థ పురోగాభివృద్ధికి కృషి చేసిన వారినీ, గురువులను, ప్రముఖులను, దాతలను పేరుపేరునా కొనియాడారు. అంతేకాదు, ఈ గుర్తుగా వారందరికీ జ్ఞాపికలు కూడా అందజేశారు. చివరగా ఆ విద్యాలయంలోనే ఉంటూ ఉన్న వంట సిబ్బందిని, నౌకర్లను కూడా వేదికపైకి ఆహ్వానించి వారినీ సత్కరించారు. ఇది కొందరు గురువులకు నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది. వంట సిబ్బందినీ, నౌకర్లనూ వేదిక మీదకు పిలిచి మాతోపాటు సత్కరించడం బాగులేదని కొందరు బహిరంగంగానే విమర్శించారు.

నానా మాటలన్నారు. ఉపదేశ పాఠాలు చెప్పిన తాము, ఈ వంటవాళ్లూ నౌకర్లూ సమానమా అని దుయ్యబట్టారు. అప్పుడు ప్రధాన గురువు వారి మాటలకు ఏ మాత్రం కోప్పడకుండా నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘‘వంట సిబ్బంది, ఇతర నౌకర్లూ మీతో సమానులే అందులో అనుమానమేమీ అక్కర్లేదు. ధమ్మపథంలో బుద్ధుడు ఏం చెప్పాడో గుర్తు చేసుకుంటే మీకీ ఆగ్రహం రానే రాదు. ఈ ఆశ్రమంలో, ఈ ఊళ్లో, ఈ దేశంలో, ఈ సమాజంలో ఎటు చూసినా రెండే వర్గాలున్నాయి. వాటిలో మొదటి వర్గం వారు పాఠాలు చెప్తారు. రెండో వర్గంవారు చదువుకుంటున్న వారికీ, పాఠాలు బోధించేవారికీ సాయపడతారు. ఈ రెండు వర్గాల సభ్యులు సరి సమానమే. వీరిద్దరూ ఒకరి అవసరాలను మరొకరు తెలుసుకుని కలసిమెలసి పని చేస్తేనే ఈ సమాజం మెరుగుపడుతుంది. వికసిస్తుంది’’ అని  చెప్పారు.
– యామిజాల జగదీశ్‌  

మరిన్ని వార్తలు