మన్నించు ఇర్ఫాన్...

17 Oct, 2016 23:09 IST|Sakshi
మన్నించు ఇర్ఫాన్...

జీవన ప్రవాహం


జూన్, 8, 2014. పనికిరాని చదువులకు బైబై చెప్పి జర్నలిజంలో చేరిన తొలి రోజులు. అప్పుడప్పుడే పుస్తకాల విలువ తెలిసింది. ఆదివారం కావడంతో గురువుగారి ఆదేశం గుర్తొచ్చింది. తొలిసారి శ్రీశ్రీ మహాప్రస్థానం, దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి వరస పెట్టి చదివాను. సందర్భం వచ్చింది కాబట్టి ఈ పుస్తకాల గురించి ఒక్క వాక్యంలో చెప్పాలి. 21వ శతాబ్దపు సమాజంలో బతకాలంటే దయచేసి ఈ పుస్తకాలు చదవకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనిషిలో సమాధి అవుతున్న నీతి, నిజాయతీ, ప్రేమ, కరుణ లాంటి ఈ సమాజానికి సరిపడని ఎన్నో ‘అవలక్షణాల’కు ఈ రెండు పుస్తకాలు మళ్లీ ఊపిరి పోస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషిలోని మనిషితనాన్ని మళ్లీ తట్టిలేపుతాయి. అంతే జీవితం నాశనం. సంపాదన అనే ప్రవాహంలో ఈదడం చేతకాక, విలువలు, సమాజం అని ‘పనికిరాని’ వాటి గురించి ఆలోచించడం మొదలు పెట్టేస్తాం.

 
సరే అవన్నీ పక్కనపెడితే.. శ్రీశ్రీ విప్లవ సాహిత్యం తాలూకు ఆవేశమో లేక తిలక్ భావ కవిత్వంలోని ఆవేదనో మనసు భారంగా, మెదడు దూరంగా వెళుతున్నాయి. ఇలా అయితే కష్టమని తలచి, వెంటనే జన జీవన స్రవంతిలో కలవాలని నా వసతి గృహానికి రెండు కిలోమీటర్ల దూరంలో సరూర్ నగర్ చెరువు అంచున ఉన్న ప్రియదర్శిని ఉద్యానవనానికి సాయంకాలపు వ్యాహ్యాళికి బయలు దేరా. మధ్యలో శివ టీ స్టాల్‌లో ఛాయ్ అదనపు ఖర్చు. అలా చెరువు అంచున ఉన్న ప్రేమ జంటల్ని ఓ కంట కనిపెడుతూ మొత్తానికి పార్కుకు చెరుకున్నా. టికెట్ తీసుకొని అలా లోపలికి వెళ్లి పచ్చని గడ్డిలో కూర్చొని సేద తీరుతున్నా.

 
అన్ని కథల్లోలాగే ఆకాశం కూడా నిర్మలంగానే ఉంది. ఆదివారం, పైగా వేసవి సెలవులు కూడా దగ్గర పడటంతో పార్క్ అంతా పిల్లలు, వారి తల్లిదండ్రులతో నిండిపోయింది. తుప్పల్లో ప్రేమ జంటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో చివర కాస్త ఓపెన్ ప్లేస్‌లో  వృద్ధులంతా ఒక చోట చేరి ఆ మధ్యే వచ్చిన ఎన్నికల ఫలితాలతో పాటు రాజకీయాలు, సినిమాలు, అవి చేస్తున్న చేటు, చెడిపోతున్న యువత అంటూ వాళ్ల రొటీన్ కబుర్లలో మునిగిపోయారు. మళ్లీ అదే గోల ఎందుకని వారికి కాస్త దూరంగా వెళ్లి పచ్చని గడ్డిలో పడుకొని, ఏవో కాలేజీ రోజుల జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నా.

 
ఇంతలో ఒక చెయ్యి నా భుజాన్ని తడుతున్నట్లు అనిపించింది. కళ్లు తెరచి చూస్తే ఒక బాలుడు. భుజాల దగ్గర కిందికి చిరిగిన చొక్కా. మూమూలు పాత ప్యాంటు.  దరిద్ర నారాయణుడికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు. ఏడెనిమిదేళ్లుంటాయి అనుకుంటా. ఏదో చెబుతూ చివర్లో ఏక్ రూప్యా దేదోనా భయ్యా.. అని అన్నాడు. అదొక్కటే స్పష్టంగా అర్థమైంది. సరే ఒక్కణ్నే ఉన్నా కదా. కాసేపు వాడితో సంభాషించాలని డిసైడ్ అయ్యా. అదే నా మొదటి ఇంటర్వ్యూలా భావించి మాటలు కలిపా. నాకు ఉర్దూ రాదు. కానీ వాడికి తెలుగు వచ్చు. హమ్మయ్య అనుకున్నా. అలా మా మధ్య జరిగిన సంభాషణ..

 
నీ పేరేంటి తమ్ముడు? ... ఇర్ఫాన్ అన్నా. ఎక్కణ్నుంచి వచ్చావు?... భగత్‌సింగ్ నగర్. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు?... మా నాయిన సచ్చిపోయిండు. అయ్యో ఎలా? మాది మహబూబ్‌నగర్ అన్నా. రెండేండ్ల కింద అణ్నే ఉంటుండే. మా నాయిన కిరాయి ఆటో నడుపుతుండే. ఒక రోజు రాత్రి ఆటో కిరాయికి వోయి మళ్ల ఇంటికి వస్తుండు. మందు తాగి నడిపిండంట. లారీ గుద్ది సచ్చిపోయిండు. ఆడ బత్కనీకి ఏం లే. అందుకే ఈడొచ్చి ఉంటున్నాం. మరి ఇక్కడేం చేస్తుంది మీ అమ్మ?

 
మా గల్లీ దగ్గర పెద్ద బిల్డింగ్ ఉంది. దాంట్ల పనిచేస్తది. ఏం చేస్తుంది?  పెద్దొళ్లు ఉంటరు కదా. వాళ్ల ఇంట్ల గిన్నెలు కడిగి, బట్టలు ఉతుకుద్ది.  మీ ఇంట్ల ఎవరెవరు ఉంటారు? అమ్మ, ఇమ్రాన్, నేను.  సరే. మరెందుకు ఇలా డబ్బులు అడుక్కుంటున్నవ్? మా అమ్మ అడుకొచ్చుకోమన్నది. ఇయ్యాల జరమొచ్చి పనికి పోలే. ఎవలు అన్నం పెట్టలే. పైసల్ అడుకొచ్చుకొని ఏమన్న కొనుకోమని చెప్పింది.

 
మరి రోజూ ఎలా తింటారు?  పొద్దున మా అమ్మ ఎంట నేను తమ్ముడు పోతం. ఆడ ఆళ్లు కొంచెం అన్నం పెడ్తరు. మధ్యానం మళ్ల ఉస్కూల్ పోత కదా. ఆడ తింట. మళ్ల పొద్దూకంగ మా అమ్మ ఎంట పోతం మళ్ల ఆళ్లు ఏమన్న పెడ్తరు. మరి ఎవరూ డబ్బులు ఇవ్వకపోతే?  మా అమ్మ నీళ్లు తాగి పండుకోమంటదన్నా. ఏమన్న పెట్టమంటె పైసల్లేవంటది. మాకు మస్తు ఆకలైతదన్నా. మా తమ్ముడు మస్తేడుస్తడన్నా.

 
అంతే నా నోటి నుంచి మరో ప్రశ్న రాలేదు.. కళ్ల వెంట రెండు చుక్కలు తప్ప. వాడు అలా చెప్పగానే రోజూ నేను వృథా చేస్తున్న వాటిని తలుచుకుంటే సిగ్గేసింది. ఆ క్షణం నేనేం చేయ్యలేకపోయా.. నా జేబులో ఉన్న పది రూపాయల నోటు వాడికి ఇవ్వడం తప్ప. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. అలా ఖాళీ జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్లిపోయా.. ‘అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం.. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో’ అని ఆవేశాన్ని, ఆవేదనను కలిపి దాశరథి రాసిన కవితను గుర్తుతెచ్చుకుంటూ.


ఇర్ఫాన్ విషయాన్ని కొద్ది రోజుల తర్వాత కొంతమంది మిత్రులతో కూడా పంచుకున్నా. చాలా మంది హేళనగా మాట్లాడారు. ‘కష్టం చేతగాని వాళ్లు అలా అడుక్కొని తింటారు అని ఏవోవో చెప్పారు. ఏమో నిజమే కావచ్చు. వాళ్లకు తారసపడిన  వాళ్లు అలాంటి వాళ్లే అయ్యుండొచ్చు. కానీ, ఇర్ఫాన్ మాత్రం అలా కాదు. తనతో మాట్లాడుతున్నంత సేపు వాడి మాటల్లో నిజాయతీ వినిపించింది. కళ్లల్లో ఆకలి స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత పార్కుకు వెళ్లినప్పుడు వాడు రాలేదు. కానీ, అలాంటి ఇర్ఫాన్‌లు మాత్రం చాలా మంది కనిపించారు. ‘మన్నించు ఇర్ఫాన్ నేను నీకేం చేయలేనా?’ అంటూ ఆ పార్కుకు వెళ్లినప్పుడల్లా గుర్తు చేసుకుంటున్నా.

 
- శివశంకర్

 

మరిన్ని వార్తలు