ఆటిజమ్‌కు బయోమెడికల్ చికిత్స పనిచేస్తుందా?

12 Oct, 2013 00:54 IST|Sakshi
ఆటిజమ్‌కు బయోమెడికల్ చికిత్స పనిచేస్తుందా?

మా అబ్బాయి వయసు నాలుగేళ్లు. వాడు ఆటిజమ్ చైల్డ్. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదని చాలా చోట్ల చదివాను. బయోమెడికల్ విధానం ద్వారా ఈ వ్యాధికి చికిత్స ఉందని విన్నాను. మా అబ్బాయి విషయంలో ఈ చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో తెలియ చేయండి.
 - సత్యవాణి, విశాఖపట్టణం

 
 ఆటిజమ్‌తో బాధపడే పిల్లల త ల్లులలో మీరు కూడా ఒకరు. పిల్లలు ఆటిజమ్‌తో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులకి డిప్రెషన్ ఉండటం సహజమే. ఆటిజమ్ అనేది ఒక విచిత్రమైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్న పిల్లలు చాలా తెలివిగలవారిలా కనిపిస్తారు కానీ, వీరిలో వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదు. అలోపతిలో ఈ వ్యాధికి మందులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే బయోమెడికల్ ట్రీట్‌మెంట్ కూడా ఉంది. అయితే ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేదు. కేవలం వ్యాధి లక్షణాల తీవ్రత మాత్రమే తగ్గించగలుగుతారు. అందువల్ల వీరు మిగతా విద్యార్థులలాగే స్కూల్‌కి వెళ్తారు. కాకపోతే కొద్దిగా డల్‌గా ఉంటారు.
 
 బయోమెడికల్ ట్రీట్‌మెంట్‌లో... ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులలో ఉన్న లక్షణాలను సూక్ష్మంగా పరిశీలించి, వారిలో ఉన్న లక్షణాలను అనుసరించి, ఎటువంటి మందులు వాడాలో నిర్ధరిస్తారు. ఇటువంటి పిల్లల తల్లిదండ్రులకు మనోధైర్యం ఎక్కువగా ఉండాలి. కుటుంబంలో ఇటువంటి వారు ఉండటం వల్ల ఇవి వంశపారంపర్యంగా వస్తాయని ఎక్కడా చెప్పలేదు. నెట్‌లో మీరు చదివినది అవగాహన కోసం మాత్రమే. అందులోని విషయమంతా మీవాడికి చెందినది కాదు.
 
 చాలామంది తల్లిదండ్రులు అక్కడా ఇక్కడా చదివిన దాన్ని బట్టి, తెలుసుకున్న దాన్ని బట్టి తమంతట తాముగా వారి పిల్లలకు సిఎఫ్‌జిఎఫ్ డైట్ విధానం అనుసరిస్తారు. మీరు చైల్డ్ సైకియాట్రిస్ట్ సూచన మేరకు మాత్రమే ఈ విధానం అనుసరించాలి.
 
మీ అబ్బాయి గురించి మీరు పాజిటివ్‌గా ఆలోచించడం ప్రారంభించండి. ఆటిజమ్ వలన భవిష్యత్తంతా అంధకారమని భావించకండి. అనుభవజ్ఞులైన చైల్డ్ సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తు ఆనందమయంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్.
 
 డాక్టర్ కల్యాణ్
 సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్,
  సెక్రటేరియట్ రోడ్,  హైదరాబాద్

 

మరిన్ని వార్తలు