నాలుగో నెల గర్భిణిని...దంతచికిత్స చేయించుకోకూడదా?

5 Oct, 2013 00:23 IST|Sakshi
నాలుగో నెల గర్భిణిని...దంతచికిత్స చేయించుకోకూడదా?

నా వయసు 26. నేను నాలుగు నెలల గర్భవతిని. నా దవడ పళ్లు పుచ్చిపోయి, విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. చిగుళ్లు కూడా వాచాయి. డెంటిస్ట్‌ను కలిస్తే ఇప్పుడు చికిత్స కష్టం అన్నారు. డెలివరీ అవడానికి ఇంకా అయిదు నెలలకు పైగా సమయం ఉంది. నొప్పి, బాధ అంతకాలమూ భరించక తప్పదంటారా? సలహా ఇవ్వండి.
 - పి. వసంత, ఆదిలాబాద్


గర్భంతో ఉండటం అనేది ఒక ప్రత్యేక సందర్భం. ఈ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులతో శరీరంలోని ఎన్నో అవయవాలు రకరకాల ఒడిదుడుకులకు గురవుతుంటాయి. వీటి ప్రభావం నోటి ఆరోగ్యం పైన కూడా పడుతుంది. దానికితోడు గర్భిణులు జంక్‌ఫుడ్ లేదా పంటికి అతుక్కుపోయే ఆహారం తీసుకోవడం వల్ల పళ్లు పుచ్చిపోతాయి. దాంతో చిగుళ్లు వాచి, బ్రష్ చేసినప్పుడు, చిగుళ్ల నుంచి రక్తం రావటం లేదా చెడురక్తం చిగుళ్లమీద బుడిపెలుగా చేరటం, నోటి దుర్వాసన లాంటి సమస్యలు కూడా సహజంగానే కనిపిస్తుంటాయి.

ఇక్కడున్న మరొక సమస్య ... గర్భంతో ఉన్నప్పుడు మామూలు వ్యక్తులకులా చికిత్స చేయించుకోలేకపోవటం.  గర్భిణులు దంత చికిత్సలకు వచ్చినప్పుడు ఎక్స్‌రేలు తీసే విషయంలో కూడా డాక్టర్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. లెడ్ ఏప్రాన్‌ని కప్పడం ద్వారా ఎక్స్‌రేలు శరీరంలోకి పోకుండా జాగ్రత్త పడతారు. అయితే వీరికి దంతచికిత్స చేయడం కొంచెం కష్టమే. గర్భిణులు 4, 5, 6 నెలల్లో మాత్రమే సురక్షితంగా చేయించుకునే అవకాశం ఉంది. కాని, మీరు విపరీతమైన నొప్పి, బాధతో ఉన్నప్పుడు డెలివరీ అయ్యే దాకా బాధ భరించమని చెప్పడం భావ్యం కాదు. పంటి నొప్పి ఎంతో భయంకరమైనది.

కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు భరించడం కూడా కష్టమే. అందుకే డెంటిస్ట్ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుని పిప్పి పళ్లలో ఉన్న ఇన్ఫెక్షన్‌ని సాధ్యమైతే రూట్ కెనాల్ చికిత్స ద్వారా నయం చేస్తారు. అందుకే గర్భం దాల్చే అవకాశాలు ఉన్నప్పుడు నోటి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది. పళ్లలో చిన్న చిన్న రంధ్రాలుంటే, ఫిల్లింగ్ చేయించుకోవటం, తప్పనిసరిగా మూడవ నెలలో ఒకసారి, 6 లేదా 7వ నెలలో ఒకసారి పళ్లను శుభ్రపరిచే స్కేలింగ్ ప్రక్రియ చేయించుకోవడం ద్వారా డెలివరీ తర్వాత చాలా మందికి ఎదురయ్యే చిగుళ్ల జబ్బులు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం, నోటి దుర్వాసన, పళ్ల మధ్య సందులు ఏర్పడటం, పళ్లు ఎత్తుగా రావటం లాంటి  ఎన్నో సమస్యలు రాకుండా నివారింవచ్చు. మంచి స్పెషలిస్టును కలిసి, మీ సమస్యను పరిష్కరించుకోండి.
 
 డాక్టర్ పార్థసారథి,
 కాస్మటిక్ డెంటల్ సర్జన్,
 పార్థా డెంటల్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు