జీమెయిల్ ఇన్‌బాక్స్...

5 Nov, 2014 00:48 IST|Sakshi
జీమెయిల్ ఇన్‌బాక్స్...

భలే ఆప్స్
గూగుల్ కంపెనీ తాజాగా సిద్ధం చేసిన సరికొత్త ఈమెయిల్ అనుభూతి ఈ ఇన్‌బాక్స్ అప్లికేషన్. జీమెయిల్‌తోపాటు ఇతర అకౌంట్లతోనూ పనిచేసుకోగల సౌకర్యం కల్పిస్తుంది ఇది. స్మార్ట్‌ఫోన్లలో జీమెయిల్ అప్లికేషన్ స్థానంలో దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం ఆహ్వానాల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. మీ మిత్రుల్లో ఎవరికైనా ఆహ్వానం అందిఉంటే వారి నుంచి ఇన్‌బాక్స్ ఇన్వైట్‌ను అందుకోవచ్చు. లేదంటే నేరుగా జీమెయిల్‌కే ఓ మెయిల్ పెట్టాల్సి ఉంటుంది.

ఈ కొత్త అప్లికేషన్ ద్వారా జీమెయిల్ మరిన్ని అదనపు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌బాక్స్ స్క్రీన్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడంతోపాటు స్క్రీన్ పైభాగంలో కుడివైపున మీ ఫొటో కనిపించే చోట ఓ డ్రాప్‌డౌన్ మెనూను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చదవని మెయిళ్లు స్పష్టమైన అక్షరాలతో కనిపించేలా... మిగిలినవి కొంచెం మసకబారిన చందంగా చేశారు. కొత్త మెయిల్‌ను కంపోజ్ చేసుకునేందుకు ఉద్దేశించిన బటన్ స్క్రీన్ అడుగుభాగంలో తేలియాడుతున్నట్లు ఓ పెన్ ఐకాన్‌తో ఏర్పాటు చేయడం విశేషం. యాహూ, ఔట్‌లుక్, ఏఓఎల్, తదితర ఐఎంఏపీ/పీఓపీ ఆధారిత మెయిల్ అకౌంట్లన్నింటినీ దీనికి అనుసంధానించుకునే అవకాశం ఉండటం మరో గమనించదగ్గ మార్పు.

ఒక పేజీ వెబ్‌సైట్లకు టాక్...
నెట్‌లో ఒక పేజీ మాత్రమే ఉండే వెబ్‌సైట్లను సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది ఈ అప్లికేషన్. ఒక పేజీకి మించని సమాచారాన్ని అందమైన డిజైన్లను ఉపయోగించి ప్యాక్ చేయడంతోపాటు పబ్లిక్‌గానైనా, ప్రైవేట్‌గానైనా ఇతరులతో పంచుకోగలగడం దీని ప్రత్యేకతలు. ఇతరులు షేర్ చేసుకుని టాక్ వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయగలగడం, మీ అభిరుచులకు సరిపోయే ఇతర వెబ్‌సైట్లను ఫాలో కావచ్చు కూడా. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్లు కొలాబరేటివ్‌గానూ పనిచేస్తాయి. అంటే మీరే ఏదైనా ఒక సంభాషణను మొదలుపెట్టవచ్చు. లేదా ఇతరుల వెబ్‌సైట్‌లకు మీరు సమాచారం అందించవచ్చు కూడా. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆపిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

కెమెరా 51....
స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తరువాత కెమెరాలకు కాలం చెల్లిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫోన్లతో తీసే ఫొటోలేవీ అంత ప్రొఫెషనల్‌గా ఉండవన్నదీ నిష్టుర సత్యం. ఈ సమస్యను అధిగమించాలనుకుంటున్నారా? అయితే కెమెరా 51 అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసేసుకోండి. గూగుల్ ప్లేలో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్ ప్రత్యేకమైన అల్గారిథమ్‌ల ద్వారా మీరు తీసే ఫొటోల్లోని లోపాలను కొన్నింటినైనా సవరిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఏ కోణంలో పట్టుకోవాలన్న అంశం మొదలుకొని ఎప్పుడు క్లిక్ చేయాలన్న విషయం వరకూ అనేక అంశాల్లో సలహాలు ఇచ్చే ఈ అప్లికేషన్‌తో ఓ చిన్న చిక్కూ ఉంది. రకరకాల కంప్యూటేషన్లు చేస్తూంటుంది కాబట్టి ప్రాసెసర్ సామర్థ్యంలో ఎక్కువ భాగం వాడేస్తూంటుంది ఈ అప్లికేషన్. మీ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ సామర్థ్యానికి అనుగుణంగా ఈ అప్లికేషన్ వాడకంపై ఒక నిర్ణయం తీసుకుంటే మేలు.

మరిన్ని వార్తలు