అల్లాహ్‌ అన్నీ చూస్తూనే ఉన్నాడు!

25 Aug, 2019 08:54 IST|Sakshi

ఇస్లాం వెలుగు

పూర్వకాలంలో దైవ విశ్వాసి, దైవభీతి పరుడు అయిన ఒక రాజు ఉండేవాడు. ఎప్పుడూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఆ రాజు అప్పుడప్పుడూ మారువేషంలో తిరుగుతూ ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు.

యధాప్రకారం ఒకరోజు మారువేషంలో తిరుగుతూ, చెరసాల వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో ఇద్దరు సిపాయీలు దొంగతనం చేసిన నేరంపై ఒక వ్యక్తిని పట్టుకొని చెరసాలకు తీసుకు వెళుతున్నారు. తను కూడా లోపలికి వెళ్ళి ఏం జరుగుతోందో చూడాలనుకున్నాడు. చెరసాల ప్రధానద్వారం దగ్గరకు చేరుకోగానే, ద్వారపాలకుడు రాజును గుర్తుపట్టి గౌరవంగా లోపలికి తోడ్కొని వెళ్ళాడు. రాజు జైలు పరిసరాలన్నీ నిశితంగా పరిశీలించాడు. అధికారులతో చెరసాల విషయాలను చర్చించాడు. ఒక్కొక్క ఖైదీని పిలిపించి, ఏ కారణంగా జైలుకు రావలసి వచ్చిందని ప్రశ్నించాడు. దానికి, ప్రతి ఒక్కరూ తాము ఏ నేరం చేయలేదని, అనవసరంగా తమపై అభియోగాలు మోపి జైలు పాలు చేశారని వాపోయారు. అలా ఎవరికి వారు ప్రతి ఒక్కరూ తాము ఏ పాపమూ చేయలేదనే చెప్పారు.

కాని అందులో ఒకడు మాత్రం ఉదాసీనంగా ఒక మూలన కూర్చొని ఉన్నాడు. మిగతా ఖైదీలంతా పోటీలు పడి రాజు గారికి తమ నిర్దోషిత్వాన్ని గురించి చెప్పుకుంటుంటే, అతను మాత్రం కూర్చున్న చోటునుండి కదలకుండా పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నాడు. ఇది గమనించిన రాజు అతన్ని దగ్గరికి పిలిచి, ‘‘నువ్వేమైనా నేరం చేశావా.. లేక నిన్ను కూడా అనవసరంగా జైల్లో వేశారా?’’ అని అడిగాడు.దానికతను, ‘లేదు రాజా.. నేను నేరం చేశాను. ఒకానొక బలహీన స్థితిలో, గత్యంతరం లేక చిన్న దొంగతనం చేశాను. నా తప్పును దేవుడు క్షమిస్తాడా.. లేదా.. అని పశ్చాత్తాప పడుతున్నాను. అలాంటిది, దొంగతనం చేసి, చెయ్యలేదని నేను మీతో అబద్ధం ఎలా చెప్పగలను?.’ అంటూ సిగ్గుతో తల దించుకున్నాడు.

‘‘అవునా..? సరే.. ఇంతమందిలో తప్పు చేసిన వాడివి నువ్వొక్కడివే కనబడుతున్నావు. ఇంత మంది నిరపరాధుల మధ్య ఒక అపరాధి, ఇంతమంది మంచి వాళ్ళలో ఒక చెడ్డవాడు ఉండడం మంచిది కాదు, సమంజసమూ కాదు. అందుకని నిన్ను విడుదల చేస్తున్నాను’’ అని ప్రకటించి, తన దారిన తను వెళ్ళిపోయాడు రాజు.

మళ్ళీ కొన్నాళ్ళకు రాజు చెరసాల సందర్శనకు వచ్చాడు. ఈ సారి ఖైదీలందరూ రాజు గారిచుట్టూ గుమిగూడారు. ఒక్కొక్కరూ రాజును సమీపించి తాము నేరం చేశామని విన్నవించుకున్నారు. అందరి మాటలూ సావధానంగా విన్న రాజు ‘వీరందరికీ మరో రెండు నెలలు అదనంగా జైలు శిక్షను పొడిగించండి.’అని ఆదేశించి వెళ్ళిపొయ్యాడు. దీంతో లబో దిబో మన్న ఖైదీలు ‘ఏమిటీ ఇలా జరిగిందీ  గతంలో రాజు గారు వచ్చినప్పుడు తప్పును అంగీకరించిన ఫలానా వ్యక్తిని విడుదల చేశారు కదా... మరి మేమంతా ఈ రోజు తప్పును అంగీకరిస్తే మా శిక్షను రెట్టింపు చేశారేమిటీ?’అని కారాగారాధికారి వద్ద వాపోయారు. 
రాజుగారి అంతరంగం బాగా తెలిసిన ఆ అధికారి, వారికి సమాధానమిస్తూ..‘ఆ రోజు మీరంతా రాజుగారికి అబద్ధం చెప్పి, బయట పడాలని అనుకున్నారు. రాజుగారు మీ మాటలు నమ్మి మిమ్మల్ని విడిచి పెడతాడని ఆశించారు. కాని ఆ వ్యక్తి అలా చేయలేదు.

చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ, నేరాన్ని నిజాయితీగా అంగీకరించాడు. నేరాంగీకారానికి కారణం ఏదో ఒక విధంగా బయట పడదామని కాదు. తనవల్ల తప్పు జరిగినందుకు సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపంతో కుమిలి పొయ్యాడు... భవిష్యత్తులో తప్పు చేయకూడదన్న బలమైన సంకల్పం అతనిలో కనిపించింది. కాని మీరు ఆరోజు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూశారు. మీమాటలు నమ్మి రాజుగారు విడుదల చేస్తారని ఆశించారు. ఈ రోజు కూడా అంతే.. చేసిన తప్పుల పట్ల ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోగా, పోటీలు పడి చేసిన ఘనకార్యాలను గర్వంగా చెప్పుకున్నారు. ఇలా నిజం చెప్పినందుకు అతణ్ణి విడిచి పెట్టారు కదా.. మమ్మల్ని కూడా అలాగే విడుదల చేస్తారని భావించి అలా చెప్పారు. అంతే తప్ప, నిజమైన పశ్చాత్తాప భావన మీలో ఏకోశానా కనిపించలేదు. అందుకే రాజు మిమ్మల్ని వదిలిపెట్టకపోగా శిక్షను పెంచాడు’’అనిఆ వివరించాడు. ఖైదీలు సిగ్గుతో తల దించుకున్నారు. 

అల్లాహ్‌ వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది. నిజమైన పశ్చాత్తాపాన్ని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. తప్పు చేసిన మనిషి తన తప్పు తెలుసుకొని, అంగీకరించి, మరలా మరలా అలాంటి తప్పులకు, పాపాలకు పాల్పడనన్న పశ్చాత్తాప భావనతో అల్లాహ్‌ను వేడుకుంటే, ఆయన తప్పకుండా మన్నిస్తాడు. తప్పులు చేస్తూ కూడా, పశ్చాత్తాప భావన లేకుండా ఏదో ఒకవిధంగా తప్పించుకోవాలని చూస్తే మాత్రం రెట్టింపు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

మరిన్ని వార్తలు