పఠనంతో మాలిన్యం దూరమౌతుంది

1 Sep, 2019 08:02 IST|Sakshi

ఇస్లాం వెలుగు

ఒక ఊరిలో ఓ ధార్మిక గురువు ఓ పురాతన మస్జిదులో ప్రవచనం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక యువకుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి,‘అయ్యా..! ఖురాన్‌ పారాయణం వల్ల హృదయానికి పట్టిన తుప్పు వదిలి పోతుంది. అని చెబుతారు గదా..! అది ఎలా సాధ్యం?’ అని సందేహం వెలిబుచ్చాడు.

దానికి ఆ గురువుగారు, ‘అదిగో అక్కడొక బిందె ఉంది. అది తీసుకెళ్ళి, కోనేటిలో నీళ్ళు ముంచుకురా..’ అన్నాడు.‘నేనేదో ధార్మిక సందేహం తీర్చుకుందామని వస్తే.. పని చెప్పాడేమిటి.. ఈ గురువుగారు...’ అనుకుంటూనే, బయటికి వెళ్ళాడు. తీరా చూస్తే అందులో బొగ్గులున్నాయి. అదే విషయం గురువుగారికి చెప్పాడు. ‘అవి పారబోసి నీళ్ళు తీసుకురా...’ అన్నారు గురువుగారు.

ఆ యువకుడు బిందె తీసుకువెళ్ళి, నీళ్ళు ముంచుకొని వచ్చాడు. కాని దానికి చిల్లి ఉండడం వల్ల నీళ్ళన్నీ దారిలోనే కారిపొయ్యాయి. గురువుగారి దగ్గరికొచ్చేసరికి ఖాళీ బిందె మిగిలింది. గురువుగారు మళ్ళీ నింపుకు రమ్మన్నారు. మళ్ళీ అదే పరిస్థితి. ఈ విధంగా నాలుగైదు సార్లు తిరిగిన తరువాత, గురువుగారు ఇలా చేయడంలో ఏదో మర్మం ఉండి ఉంటుందని గ్రహించిన యువకుడు, ఇక లాభం లేదనుకుని.. ‘గురువు గారూ అసలు విషయం ఏమిటో చెప్పండి.’ అని వినయంగా ముందు కూర్చున్నాడు.
గురువుగారు చిన్నగా నవ్వి, ‘బాబూ.. గమనించావా..? నువ్వు బిందె తీసుకు వెళ్ళినప్పుడు, అది మసి కొట్టుకొని ఉంది. అవునా..?’ అన్నారు.

‘అవును’ అన్నాడు యువకుడు.
‘మరి ఇప్పుడెలా ఉందో చూడు.’ అన్నారు.గురువుగారు.
‘బొగ్గుల మసంతా పోయి శుభ్రంగా తయారైంది.’అన్నాడు యువకుడు.
‘ఆ శుభ్రత అన్నది నీటిలో ఉన్నటువంటి గుణ ప్రభావం. నీరు అందులో ఆగకపోయినా, అది మసిని శుభ్రం చేసింది. ఒకటికి నాలుగుసార్లు నువ్వు అలా చేయడం వల్ల మసి కొద్ది కొద్దిగా శుభ్రమవుతూ, చివరికి పూర్తిగా  లేకుండానే పోయింది.

అలాగే ఖురాన్‌ కూడా మాటిమాటికీ పఠిస్తూ ఉంటే, దాని గుణ ప్రభావం కారణంగా మనసులోని మాలిన్యమంతా కొద్దికొద్దిగా కొట్టుకుపోయి శుభ్రమైపోతుంది. హృదయం స్వచ్ఛంగా, నిర్మలంగా తయారవుతుంది. అందుకే పవిత్ర గ్రంథాన్ని ఒకటికి రెండుసార్లు చదవడం వల్ల అందులోని విషయం అవగతమవుతుంది. మంచి అనేది మనసును హత్తుకొని మనసులోని మాలిన్యం దూరమవుతుంది’’ అని వివరించారు గురువుగారు.  
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

మరిన్ని వార్తలు