ఆ ధగధగలు తగ్గకూడదంటే...

3 Dec, 2014 22:27 IST|Sakshi
ఆ ధగధగలు తగ్గకూడదంటే...

ఆభరణాలను అలంకరించుకోవడంలో ఉన్నంత శ్రద్ధ వాటిని శుభ్రంగా ఉంచడంలో చాలామందికి ఉండదు. అందుకే ఆభరణాలు త్వరగా మెరుపు కోల్పోయినట్టుగా కనపడతాయి. బంగారు ఆభరణాలను శుభ్రపరచడానికి మేలైన చిట్కాలు...
 
ఆభరణాలను దాదాపుగా ఇంట్లోనే శుభ్రపరుచుకోవడం శ్రేయస్కరం. ఖర్చు తక్కువ అవుతుంది. బయట శుభ్రపరచడానికి ఇచ్చినప్పుడు తలెత్తే మోసాలనూ అరికట్టవచ్చు.

వేటికవి విడిగా

విభిన్నరకాల ఆభరణాలు ఉంటాయి. వెండి, బంగారు, ప్లాటినమ్, పూసలు, రాళ్లు.. ఇలా ఆభరణాలను వేటికవి విడివిడిగా ఉంచాలి. లిక్విడ్ సోప్ డ్రాప్ట్స్ (మార్కెట్లో లభిస్తాయి) వీటిని ఆభరణాల మీద వేసి మృదువుగా రుద్ది, కడిగి, మెత్తని నూలు వస్తంతో తుడవాలి. ఇంకా దుమ్ము, జిడ్డు ఉన్నాయి.. పోవడం లేదు అనుకుంటే క్లబ్ సోడాను ఉపయోగించాలి. బంగారు ఆభరణాల జిడ్డు వదలాలంటే 15 నిమిషాల పాటు సబ్బు నీటిలో ఉంచి, తర్వాత శుభ్రపరచాలి.

మృదువైన టూత్ బ్రష్

ఆభరణాల మురికిని తీసివేయడానికి బ్రష్‌ను వాడుతుంటారు. ఇందుకు మృదువైన బ్రష్‌ను ఉపయోగించాలి. టూత్‌బ్రష్ కొనుగోలు చేసే ముందు లేబుల్‌పై ‘సాఫ్ట్ బ్రిస్టల్స్’అని ఉన్నది తీసుకోవాలి. బ్రష్‌తో ఆభరణాలను శుభ్రం చేయడానికి ముందు దానిని 10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉపయోగించాలి. దీని వల్ల బ్రష్ కుచ్చు మృదువుగా తయారవుతుంది. ఫలితంగా ఆభరణాలకు హాని కలగదు. మురికి కూడా వదులుతుంది. ఐబ్రో బ్రష్, హెయిర్ డై బ్రష్‌లను ఆభరణాల శుభ్రతకు ఉపయోగించకూడదు.
 
అమ్మోనియా ద్రావణం

అమ్మోనియా ద్రావణానికి ఆరు భాగాల నీళ్లు కలపాలి. ఆభరణాలను సబ్బు నీటితో శుభ్రపరిచిన తర్వాత వాటిని అమ్మోనియా నీటిలో ముంచి, తడి లేకుండా తుడవాలి. ఇలా చేస్తే ఆభరణాలకు మెరుపు వస్తుంది. అయితే ధరించిన ప్రతీసారి అమ్మోనియాతో శుభ్రపరచకూడదు. ఒక్కోసారి అమ్మోనియా కారణంగా ఆభరణం రంగు మారే అవకాశం ఉంటుంది.
 
వెచ్చని నీరు

ఆభరణాన్ని బ్రష్‌తో రుద్దుతున్నప్పుడు గోరువెచ్చని నీటిని పోస్తూ రబ్ చేస్తూ ఉంటే మురికి వదులుతుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఉండదు. అయితే, ఆభరణాలను అన్నింటినీ కలిపి కాకుండా విడి విడిగా శుభ్రపరచాలి.
 
రత్నాలను నీటిలో ఉంచరాదు

 రత్నాలు పొదిగి ఉండే ఆభరణాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచకూడదు. సబ్బు నీటిలో ముంచి, వెంటనే తీయాలి. గోరువెచ్చని నీటిని పోస్తూ మృదువుగా రుద్దాలి. తర్వాత మెత్తని వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. ఆభరణం వెనకవైపు కూడా తడి లేకుండా తుడిచి, భద్రపరచాలి.

 టూత్‌పేస్ట్ ఉపయోగం

టూత్‌బ్రష్‌కి కొద్దిగా పేస్ట్ అద్ది, దాంతో బంగారు ఆభరణాలను శుభ్రపరచాలి. గోరువెచ్చని నీళ్లు పోస్తూ రుద్దుతూ కడిగితే, చక్కగా శుభ్రపడతాయి.

మరిగితే మెరుపు

మైనం, గ్రీజ్ వంటివి ఆభరణాలకు అంటితే త్వరగా పోవు. ఇలాంటప్పుడు మరుగుతున్న నీటిలో ఆభరణాలను వేసి, తర్వాత సబ్బునీటితో శుభ్రపరచాలి.
 

మరిన్ని వార్తలు