మంచుకొండల్లో...పట్టపగలే పండు వెన్నెల

22 May, 2014 23:01 IST|Sakshi

యాత్ర
 
హిమాలయ పర్వతశ్రేణులలో విహారం... గడ్డకట్టిన సరస్సులో నడక.. పువ్వుల తివాచీ కప్పుకున్న కొండ ప్రాంతాలు... కార్గిల్ విజయ్‌ఘాట్‌లో వందనం.. ఇన్ని అద్భుతాలను చూసే అదృష్టం కలిసి వస్తే..! ఆ పర్యటన జీవితాంతం మరపురాని మధురానుభూతి. కార్గిల్, లడఖ్ ప్రాంతాల సందర్శన జీవితకాలపు జ్ఞాపకం అని వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులు ముసునూరు రాజేశ్వరి...

 
 ‘ముంబయ్‌లో ఉంటున్న స్నేహితురాలి నుంచి కార్గిల్, లడఖ్ ప్రయాణ కబురు అందగానే నేనూ ‘గురుద్వారా గ్రూప్’లో మెంబర్‌గా చేరిపోయాను. అందులో భాగంగానే కిందటేడాది జూలై నెలలో హైదరాబాద్ నుంచి ముంబయ్ వెళ్లాను. అక్కడ నుంచి ‘గురుద్వారా గ్రూప్’ వంద మందితో కలిసి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్‌లో 26 గంటలు ప్రయాణించి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న చక్కీబాంక్ రైల్వేస్టేషన్‌లో దిగాను.

జమ్మూ కన్నా ముందు రైల్వే స్టేషన్ అది. అక్కడ ముందే ట్రావెల్ ఏజెంట్స్ ఏర్పాటు చేసిన పది మినీ బస్సులలో మా గ్రూపు సభ్యులు సర్దుకున్నారు. అటు నుంచి గంట ప్రయాణించాక మధ్యలో భోజన ఏర్పాట్లు. ఆ ప్రదేశంలో... చుట్టూ మంచు కొండలు... వాటి మధ్య నుంచి నీటి పాయలు... చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అక్కడ నుంచి బయల్దేరి జమ్మూకు 112 కిమీ దూరంలో ఉన్న పట్నీటాప్ చేరుకున్నాం.

హోటల్‌లో బస. మర్నాడు ఉదయం లేచి చూస్తే... హిమాలయాల పర్వత శ్రేణి పొగమంచు తెరలు తెరలుగా కదిలిపోతోంది. పచ్చని చెట్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆనందిస్తూనే బస్సులలో బయల్దేరాం. మధ్యలో అమరనాథ్ యాత్రికుల కోసం భోజనాలు పెట్టే గుడారాలు లెక్కలేనన్ని కనిపించాయి. అనంత్‌నాగ్ దాటి ఆ సాయంత్రానికి శ్రీనగర్ చేరాం. రాత్రి అక్కడే బస చేసి మరునాటి ఉదయం కార్గిల్‌కు బయల్దేరాం. మధ్యలో సోనామార్గ్ వద్ద ఆగాం.
 
మంచు కొండలలో... సోనామార్గ్!


‘బంగారు మైదానం’గా సోనామార్గ్‌కు పేరుంది. దూరం నుంచి మంచు కొండలు వెండికొండల్లా మెరిసిపోతుండగా, కింద ప్రవహిస్తున్న సింధు నదిలో పడవలు పరుగులు పెడుతున్నాయి. సోనామార్గ్‌లో హిమాలయ సరస్సులు నాలుగుకు పైగా ఉన్నాయి. సరస్సులోని చల్లటి నీటిలోకి వెళ్లి కాసేపు, ఆ రాళ్లపై కాసేపు విహరిస్తూ ఫొటోలు తీసుకున్నాం. భోజనాల అనంతరం కార్గిల్‌కు మా ప్రయాణం సాగింది.
 
బరువెక్కిన హృదయం... కార్గిల్ విజయ్‌ఘాట్!

సాయంత్రం కార్గిల్‌కు వెళ్తుండగా, మధ్యలో విజయ్‌ఘాట్ వచ్చింది. ‘జూలై 26 - విజయ్ దివస్’ చేరువలో ఉండడంతో అక్కడ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అక్కడే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ఫలకాలు వందల సంఖ్యలో కనిపించాయి. వాటిని చూస్తూ, బరువెక్కిన హృదయాలతో మేం కదులుతుండగా ‘ఆవేదన చెందకండి, మీ ఆశీర్వాదం మాకివ్వండి చాలు’... అంటున్న ఆ జవాన్లకు నమస్కరించాం.
 
రెయిన్ బో కలర్స్ - పెంగ్విన్ లేక్

మరునాడు మధ్యాహ్నం లేహ్ సిటీకి చేరుకున్నాం. అక్కడ కాసేపు వర్షం, చలి, ఆ వెంటనే మండే ఎండ. రోజంతా వాతావరణం ఇలాగే ఉంటుంది. లేహ్‌కు 140 కిమీ దూరంలో ఉన్న పాంగాంగ్‌కు మరునాడు బయల్దేరాం. దీన్నే ‘పెంగ్విన్ లేక్’ అని కూడా అంటారు. చైనా, భారతదేశ సరిహద్దుల్లో ఈ సరస్సు ఉన్నందున తప్పనిసరిగా మన గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుంది. అయిదు గంటలు ప్రయాణించి పెంగ్విన్ లేక్ చేరుకున్నాం. అద్భుతం... సరస్సు ముందుభాగంలో ఐదు కిలోమీటర్ల వరకు మంచు గడ్డ కట్టుకుని ఉంటుంది.

మధ్యాహ్నం ఒంటి గంటకు మంచు నెమ్మదిగా కరుగుతుంది. మళ్లీ రాత్రి ఎనిమిది గంటల వరకు గడ్డకడుతుంది. కనుక, లేహ్ సిటీ నుంచి ఈ సరస్సుకు వెళ్లాలనుకునేవారు ఉదయం 4 - 5 గంటల మధ్యన బయలుదేరితే అటు మంచును, ఇటు రంగులు మారే నీటిని చూసి ఆనందించ వచ్చు. మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ సరస్సు సందర్శనకు అనువైన సమయం అని గైడ్ తెలిపారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత.. వలస పక్షులు. పెంగ్విన్ పక్షుల సందడి అబ్బురమనిపించింది. బహుశా వీటి వల్లే ఈ సరస్సుకు పెంగ్విన్‌లేక్ అని పేరు వచ్చి ఉంటుంది.
 
లేహ్ - గురుద్వారా

లే్‌హ సిటీకి పాతికమైళ్ల దూరంలో పత్తర్ సాహెబ్ గురుద్వారా ఉంది. ఆ గురుద్వారా కూడా మిలటరీ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మూడోరోజు గురుద్వారాను దర్శించుకుని అక్కడ వారు పెట్టిన భోజనాన్ని స్వీకరించి, మళ్లీ కార్గిల్‌కు తిరుగు ప్రయాణమయ్యాం. కార్గిల్‌లో బ్రేక్ జర్నీ చేసి సోనామార్గ్ ద్వారా శ్రీనగర్‌కు వెళ్లాం.
 
మరునాడు మళ్లీ శ్రీనగర్ నుంచి అమృతసర్‌కు ప్రయాణించి మూడో రోజు ముంబయ్ చేరుకున్నాం. అలా మొత్తం 20 రోజుల మా ప్రయాణానికి ముందుగా మేము చెల్లించిన రూ.18వేలు కాక, మరో ఆరు వేల రూపాయలు అదనంగా ఖర్చయ్యాయి. వెలకట్టలేని ప్రకృతి అందాలు, ప్రయాణానుభూతులు జీవితాంతం మిగిలిపోయే కానుకలయ్యాయి.        
 
 పువ్వుల తివాచీ... గుల్‌మార్గ్!

 శ్రీనగర్ నుంచి 52 కిమీ దూరంలోని గుల్‌మార్గ్‌లోని కొండప్రాంతమంతా చామంతుల ను పోలి ఉండే తెల్లటి పువ్వులతో పట్టపగలే వెన్నెలను తలపించింది. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తై రెండో కేబుల్‌కార్‌లో కంగ్డూరీ పర్వతంపైకి వెళ్లాం. వెళ్తున్నంతసేపు మంచు నిండి ఉన్న  కొండప్రాంతాల్లోని అందాలు కనువిందు చేశాయి.
 

మరిన్ని వార్తలు