పూజించడమే కాదు... ఆచరించాలి ..!

7 Nov, 2017 00:04 IST|Sakshi

ఆత్మీయం

హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుందని ప్రతీతి. శ్రీరామచంద్రుని పక్షాన చేరి ఆయన విజయానికి మూల కారణమయ్యాడు. మహాభారతయుద్ధంలో పాండవ మధ్యముడైన అర్జునుని పతాకంపై నిలిచి, పాండవుల విజయానికి కారణభూతుడయ్యాడు. అందుకే ఆంజనేయుని ప్రార్థించి చేసే ఏ పని అయినా తప్పక నెరవేరుతుందని నమ్మకం. అయితే, ఇంతటి బలం, శక్తిసామర్థ్యాలు ఆయనకు ఎక్కడినుంచి వచ్చాయంటారు? అచంచలమైన భక్తే ఆంజనేయుని బలం. తనస్వామి ఎక్కడో లేడంటూ గుండెను చీల్చి హృదయంలో సీతారామలక్ష్మణులను చూపిన ధీమంతుడు ఆయన. అప్పగించిన పని వరకే చేస్తాను, మొత్తం పనితో నాకు సంబంధం లేదు అని అనుకోలేదు. సీతను చూసి రమ్మంటే లంకానగరం నిర్మాణం, రావణుని బలాబలాలు, యుద్ధవ్యూహం వంటివన్నీ అంచనా వేసి అనేక కార్యాలు చక్కబెట్టుకు వచ్చి తన స్వామి మెప్పు పాందాడు హనుమ.

యువత హనుమను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. స్వామి కార్యాన్ని నెరవేర్చడం కోసం నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. తాను కనీసం ఎప్పుడూ చూసి ఎరుగని సీతామాతను గుర్తించి, ఆమె ముందు శ్రీరాముని గుణగానం చేశాడు. తనపై ఆమెకు ఏమూలో శంక మిగిలి ఉన్నదని గ్రహించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూపం చూపాడు. అడ్డువచ్చిన రాక్షసులను అవలీలగా మట్టుపెట్టాడు. బ్రహ్మాస్త్రం ఏ హానీ చేయదన్న వరం ఉన్నా, రావణుని సమక్షానికి వెళ్లేందుకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి బ్రహ్మపట్ల తన విధేయతను చాటుకున్నాడు. లంకాధీశుని కంటే ఎత్తుగా ఉండేట్లు తన వాలంతో ఆసనాన్ని ఏర్పరచుకుని దాని మీద ఆసీనుడయ్యాడు. నిష్కారణంగా అవతలివారికి హాని తలపెడితే తమకంతకన్నా ఎక్కువ కీడు జరుగుతుందన్న వాస్తవాన్ని నిరూపించేందుకు తన తోకకు పెట్టిన నిప్పుతోనే లంకాదహనం చేశాడు. సీతజాడకోసం పరితపిస్తున్న రామునికి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ‘దృష్ట్వాన్‌ దేవి’ (చూశాను సీతను) అని చెప్పి కొండంత ఉపశమనం కలిగించాడు. తాను ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, ఆదర్శదంపతులైన సీతారాములను కలిపి భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. హనుమను పూజించేవారు ఆయనలోని మంచి లక్షణాలను గ్రహించాలి. అలవరచుకోవాలి. అప్పుడే ఆ భక్తికి సార్థకత. కేవలం పూజలు చేయడం వల్ల, ఉపవాసాలుండటం వల్ల కాదు...

మరిన్ని వార్తలు