అన్ని వ్యాధులకూ చెక్‌ పెట్టే టైమొచ్చిందా?

23 May, 2018 01:21 IST|Sakshi

భూమ్మీద వ్యాధులన్నవి లేకుండా పోతే ఎంత బాగుంటుందో అని మనలో చాలామందికి అనిపిస్తూంటుంది. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధన పుణ్యమా అని సమీప భవిష్యత్తులోనే ఇలాంటి అద్భుతం సాధ్యం కానుంది. అనేకరకాల వైరస్‌లను మట్టుబెట్టగల సామర్థ్యమున్న ప్రొటీన్లను తయారు చేసేందుకు వీరో వినూత్న పద్ధతిని ఆవిష్కరించడం దీనికి కారణం. ఇప్పటివరకూ మనకు ప్రకృతిలో అందుబాటులో ఉన్న ప్రొటీన్లనే కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి మందులుగా వాడుతూండగా.. వీరు ఒక అడుగు ముందుకేసి అమినోయాసిడ్ల నుంచి ఎక్కడా లేని లక్షల రకాల ప్రొటీన్లను తయారు చేయవచ్చునని నిరూపించారు.

పైగా వీటిని రిఫ్రిజిరేటర్లలో చల్లగా ఉంచాల్సిన అవసరం కూడా లేదని.. రోగ నిరోధక వ్యవస్థ స్పందించే అవకాశాలూ తక్కువేనని అంటున్నారు. అమెరికా రక్షణ సంస్థ డార్పా కోసం నాలుగేళ్ల క్రితం తాము ఈ ప్రాజెక్టును మొదలుపెట్టామని... గతంలో తాము ప్రొటీన్‌ శృంఖలాలను కృత్రిమంగా తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని దీంట్లో వాడామని పెంటల్యూట్‌ అనే శాస్త్రవేత్త వివరించారు. ఈ కొత్త రకం ప్రొటీన్లను ఎబోలా, నీపా వైరస్‌ వంటి అనూహ్యమైన వైరస్‌ ఇన్ఫెక్షన్లకు సమర్థమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని అంచనా.   

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు