స్కూటీతో సేద్యానికి...

22 May, 2019 00:07 IST|Sakshi

‘నాకు రాదు’అంటే ఏదీ రాదు!లక్ష్మీపూర్‌ అయితే అసలే ఊరుకోదు.‘బండి నేర్చుకో’ అంటుంది.ఆ ఊళ్లో ఏడాదంతా పంటకాలమే.మహిళలు బండి వెనుక కూర్చున్నంతకాలంకాలంతో పోటీపడలేకపోయారు.బండి ముందు కూర్చున్నాకకాలమే వారితో పోటీ పడలేకపోతోంది!ఇప్పుడు వాళ్లు.. బండెనక బండి కడుతున్నారు.ఊరికి ధాన్య‘లక్ష్మీకళ’ను తెస్తున్నారు.

ఆ గ్రామంలో యువ మహిళా రైతులు చదివింది పదోతరగతి లేదంటే ఇంటర్‌మీడియట్‌. అయినప్పటికీ.. ఓ వైపు సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూనే, మరోవైపు దానికి ఆధునికతను జోడిస్తూ పంటల సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడూ భర్త చాటు భార్యగా మోటర్‌ సైకిల్‌పై వెనుక సీట్లోనే కూర్చుని వెళ్లేవారు ఇప్పుడు అదే మోటర్‌ సైకిల్‌పై డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని తాము ముందుకు వెళ్లడమే కాదు, కుటుంబాన్ని సైతం ముందుకు తీసుకెళ్లుతున్నారు! ఈ దృశ్యం మీకు.. ఇప్పటికే రైతుల ఐకమత్యంతో లక్ష్మీపూర్‌ రైస్, లక్ష్మీపూర్‌ సీడ్‌తో రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా వెలుగొందిన లక్ష్మీపూర్‌లోనే కనిపిస్తుంది.  ఇప్పుడా ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ ఓ స్కూటీ ఉందంటే అశ్చర్యం కలుగక మానదు. ఆ గ్రామ మహిళా యువ రైతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఏడాదంతా వ్యవసాయం!
జగిత్యాల జిల్లా కేంద్రానికి 7 కి.మీ దూరంలో ఉండే లక్ష్మీపూర్‌ గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎంత చదువుకున్నా వ్యవసాయాన్ని వదిలిపెట్టరు. అలాగే, వారి భార్యలు సైతం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిందే. ఈ గ్రామంలో ఏదో ఒక్క పంటనే పండించకుండా పసుపు, వరి, మొక్కజొన్న, వేరుశెనగ.. ఇలా అన్నిరకాల పంటలు పండిస్తూ మిశ్రమ వ్యవసాయ సాగు చేస్తూ, ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఎండకాలంలో 10–20 రోజులు మినహాయిస్తే, ఏడాది మొత్తం  వ్యవసాయ పనులు చేస్తూనే ఉంటారు. గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో, వారి కుటుంబ నిర్వహణలో కూడా అధునికత సంతరించుకుంటుంది. దీంతో ఈ గ్రామానికి ఆడపిల్లను ఇచ్చేందుకు తల్లితండ్రులు పోటీ పడుతుంటే, మరికొందరు ఆడపిల్లలు మాత్రం వ్యవసాయంపై ఉన్న అభిమానంతోనే ఇక్కడి వారిని పెళ్లి చేసుకుంటున్నారు.

అప్పటి వరకు కాలే జీలకు వెళ్లిన ఆడపిల్లలు సైతం ఒకరిని చూసి ఒకరు వ్యవసాయం చేసేందుకే ఉత్సాహం చూపించడమే కాకుండా.. పాత వ్యవసాయ పనులకు భిన్నంగా నూతన ఒరవడితో సాగును ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏడాది పొడవునా పురుష రైతులతో సమానంగా మహిళా రైతులు తోటలకు వెళ్లి వ్యవసాయ పనులు చేయాల్సి ఉంటుంది. రైతులు ఉదయాన్నే పనులకు వెళ్లుతుంటే, వారి భార్యలు, పిల్లలను స్కూళ్లకు పంపించి, అన్నం వండుకుని, నడుచుకుంటూ 2–3 కి.మీ దూరంలో ఉన్న పంట పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. భార్యాభర్తలకు తోడు మరో ఇద్దరు కూలీలు అవసరమైనప్పుడు, వారిని తోటల వద్దకు తీసుకెళ్లడం కష్టంగా మారడంతో.. స్కూటీలు వారి పనిని సుళువు చేశాయి.

ధైర్యం చేసి నేర్చుకున్నారు
వివిధ పనుల్లో నిమగ్నమయ్యే రైతులకు, ప్రతిరోజూ మహిళా రైతులను తమ మోటర్‌ సైకిల్‌పై తోట వద్ద విడిచిపెట్టడం కుదరడం లేదు. దీంతో, మూడేళ్ల క్రితం కొంతమేర చదువుకుని, ధైర్యంగా ఉండే యువ మహిళా రైతుల్లో ఒకరిద్దరు నూతన మోడళ్లలో వచ్చిన స్కూటీలను కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టారు. ఆ స్ఫూర్తితో దాదాపు 50 నుండి 60 మంది మహిళా రైతులు స్కూటీలు కొనుగోలు చేసి, వాటిపై కూలీలను, తోటి మహిళా రైతులను ఎక్కించుకుని రయ్‌..రయ్‌ మంటూ పంటపొలాలకు వెళ్లుతున్నారు. అంతేకాదు, దగ్గర్లోని బంధువు ఇళ్లకు, జగిత్యాల లాంటి పట్టణాలకు వచ్చినప్పుడల్లా తమ స్కూటీపైనే వస్తుంటారు.

రైతులు జగిత్యాలకు వచ్చినప్పుడు పెట్రోల్‌ కొని తీసుకెళ్లి, స్కూటీల్లో పోస్తుంటారు. దీంతో, తోటలో వ్యవసాయ పని ఉన్నప్పుడల్లా భర్త కోసం ఎదురు చూడకుండా, తోటలో అవసరమయ్యే ఒకరిద్దరు కూలీలను ఎక్కించుకుని పనికి వెళ్లుతున్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో భర్తకోసం భార్య, భార్య కోసం భర్త ఇలా.. ఒక్కరి కోసం ఒకరి సాయం కోసం ఒకరు చూసే అవసరం లేకుండా పోయింది. ఎవరి మోటర్‌ సైకిళ్లపై వారు వెళ్తున్నారు.

స్కూటీ కంపెనీల ఆశ్చర్యం
గ్రామానికి చెందిన మహిళా యువ రైతులు పోటీ పడి స్కూటీలు కొనుగోలు చేస్తుండటంతో, చాల కంపెనీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, చివరకు ఈ గ్రామంలో స్కూటీ మోటర్‌ సైకిల్‌ మేళాలు కూడా ఏర్పాటు చేసాయి. మహిళా యువ రైతులను ఆకర్షించేందుకు కంపెనీలు పలు ఆఫర్లు కూడా ప్రకటించాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా తీసుకుని, వ్యవసాయ పనులతో పాటు మహిళలు పలు శుభకార్యాలకు తమ బంధువులను ఎక్కించుకుని వెళ్లడానికి కుదురుతోంది. ఇదిలా ఉంటే,  లక్ష్మీపూర్‌కి ఎవరైనా చుట్టం చూపుగా వచ్చిన వారు ఆ గ్రామ మహిళా యువ రైతులు స్కూటీలపై వెళ్లడం చూసి నోరు వెళ్లడం విశేషం.
– పన్నాల కమలాకర్‌ రెడ్డి, సాక్షి, జగిత్యాల
ఫొటోలు : ఏలేటి శైలేందర్‌ రెడ్డి

బర్రెకు గడ్డి సైతం
తోటలకు వెళ్లిన తర్వాత, అక్కడ గట్ల వెంబడి ఉండే గడ్డిని స్కూటీపై బర్రెలకు తీసుకు వస్తాను. మొదట స్కూటీ నడపడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు స్కూటీ నడపడం తేలిక కావడంతో రోజు స్కూటీపైనే వ్యవసాయ పనులకు వెళుతున్నాను. నాతోపాటు కూలీలను సైతం తీసుకెళ్తున్నాను.
– మిట్టపల్లి వరలక్ష్మి

సామానంతా స్కూటీపైనే
వ్యవసాయ పనులకు అవసరమైన పార, గుల్ల, ఇతర సామానంతా స్కూటీపైనే తీసుకుని వెళ్తాను. తోటలు దూరంగా ఉండటంతో స్కూటీ బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తోట వద్ద దించి రావాలంటే భర్తకు కూడా కష్టమే. అందుకే స్కూటీ నేర్చుకుని నేను నడుపుతున్నా.


కూలీలను ఎక్కించుకుని వెళ్తున్నా
ప్రతిరోజూ ఇద్దరు కూలీలను ఎక్కించుకుని వ్యవసాయ పనులకు వెళుతుంటాను. మొదట స్కూటీ కొనిచ్చేందుకు నా భర్త భయపడ్డాడు. ఇప్పుడు నేనే స్వయంగా నడుపుకుంటూ వ్యవసాయ పనులకు వెళుతుండటంతో, నా భర్త ఇతర వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు