పున్నాగ పూలు

30 Apr, 2018 01:06 IST|Sakshi
పున్నాగ పూలు

డాక్టర్‌ జి.కె., డాక్టర్‌ క్రిష్ణ, షీలా మేడమ్‌ పాత్రల ద్వారా ‘జలంధర’ విభిన్న మనస్తత్వాలపై జరిపిన సైకో అనలిటికల్‌ పరిశోధన ఈ నవల. డాక్టర్‌ జి.కె. ఇచ్చిన స్ఫూర్తితో, మానవతా దృష్టితో ఆయన ప్రియ శిష్యుడు డాక్టర్‌ క్రిష్ణ స్థాపించిన జి.కె. హీలింగ్‌ సెంటర్‌ ఎందరికో శారీరక, మానసిక స్వాంతన కలిగిస్తూ ఉంటుంది.ఈ నవల జి.కె.కు స్వయానా తమ్ముడి కూతురైన ‘రాధ’ పాత్ర చుట్టూ ప్రధానంగా అల్లారు. రాధ సగటు ఆడపిల్లల ఆలోచనా సరళి కలిగి ఉంటుంది. తనకేం కావాలో తెలియని రాధ ‘మంచి అమ్మాయి’ అన్న ముద్ర ఉంటే చాలనుకుంటుంది. డాక్టర్‌ క్రిష్ణ రాధకు చిన్నతనంలో తెలిసిన వ్యక్తే. క్రిష్ణ రాధను ఎంతో ప్రేమిస్తాడు.

కానీ రాధ తల్లి, క్రిష్ణ తల్లి వారి వారి ‘కచ్చలు’ తీర్చుకోవటానికి ఆడిన ఆటలో రాధ పావుగా మారి అనూహ్యంగా చెడు అలవాట్లు కలిగిన రాజారావ్‌కు భార్య అవుతుంది. క్రిష్ణ తనను ప్రేమించిన విషయం చివరి వరకూ రాధకు తెలియదు. రాజారావ్‌కు బాగా జబ్బు చేస్తే జి.కె. హీలింగ్‌ సెంటర్‌లో చేర్పిస్తారు. అక్కడి డాక్టర్స్‌ డివోషన్, షీలా మేడమ్‌ కౌన్సిలింగ్, లైబ్రరీలోని పుస్తకాలు ఇవన్నీ రాధలో గొప్ప మార్పు తీసుకొస్తాయ్‌. అప్పుడనిపిస్తుంది రాధకు, ‘తను ఇన్ని రోజులూ ఒక అనారోగ్యకరమైన సాంఘిక వాతావరణంలో బందీనైపోయాననీ, అందులోంచి బయటపడాలీ’ అని. ఇంతలోనే రాజారావ్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్‌ ఉన్నట్లూ వారికో బాబు కూడా ఉన్నట్లు తెలుస్తుంది రాధకు.

హీలింగ్‌ సెంటర్‌లో ఎంతో మెచ్యూర్డ్‌గా తయారైన రాధ ఆమెను కలిసి ఆమె రాజారావ్‌ను పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. విడాకులు తీసుకుని రాజారావ్‌ జీవితం నుంచి హుందాగా తప్పుకుంటుంది. ఆస్ట్రేలియాలో పైచదువులు చదవడానికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి స్కైప్‌లో ఛాట్‌ చేస్తున్నప్పుడు, పెదనాన్న ఫొటో, క్రిష్ణ ఉత్తరాలతో పాటు రాజారావ్‌ ఇచ్చిన డెబిట్‌ కార్డ్‌ని చూసి తల్లి అడుగుతుంది. ‘‘అవన్నీ సరే కానీ రాజారావ్‌ జ్ఞాపకాలెందుకు ఇంకా’’ అని. ‘‘అన్నీ జీవితంలో భాగాలే కదమ్మా’’ అంటూ చిరునవ్వుతో రాధ చెప్పే ముగింపు వాక్యాలతో నవల ముగుస్తుంది.
-డాక్టర్‌ సి.ఎం. అనూరాధ 

మరిన్ని వార్తలు