స్త్రీలోక సంచారం

23 Dec, 2018 01:14 IST|Sakshi

జనవరి 19 నుంచి అలహాబాద్‌లో మొదలయ్యే ప్రయాగ కుంభ మేళా ఉత్సవాలకు వచ్చే మహిళా భక్తులతో మర్యాదగా ఎలా మసులుకోవాలో, వారికి అవసరమైన సదుపాయాలకు లోటు రాకుండా ఎలా నిర్వహణ ఏర్పాట్లు చేయాలో పోలీస్‌ సిబ్బందికి, పారామిలటరీ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయాగ్‌రాజ్‌ (ఉత్తరప్రదేశ్‌)లోని ‘గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ సోషల్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (జీబీపీఎస్‌ఎస్‌ఐ) ముందుకొచ్చింది. మార్చి 4 వరకు జరిగే ఈ కుంభమేళాకు దాదాపు 10 కోట్ల మంది వస్తుండగా, వారిలో సగం మంది మహిళలే ఉంటారన్న అంచనా ఉంది కనుక ఎన్నడూ లేని విధంగా మహిళలకు ప్రత్యేక ఘాట్లను నిర్మిస్తున్నారు. కుంభ్‌ ఏరియా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ కె.పి.సింగ్‌కి వచ్చిన ఈ ఆలోచనతో కుంభమేళ ఉత్సవాలను ఈసారి ‘ఉమెన్‌ ఫ్రెండ్లీ’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది.

ఇవాళ ఆదివారం ఈ రద్దీ మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో ‘ట్రావంకోర్‌ దేవస్వం బోర్డు’ అందోళన చెందుతోంది. అయితే అందుకు వేరే కారణం ఉంది. కోర్టు తీర్పుతో లభించిన స్వేచ్ఛతో చెన్నైలోని ‘మానితి’ అనే సంస్థ సభ్యులు (వీరంతా యాభై ఏళ్లలోపు వారే) 50 మంది ఇవాళ అయ్యప్ప దర్శనానికి శబరిమల చేరుకోబోతున్నారు. వారి రాకను ప్రతిఘటిస్తున్న స్థానిక రాజకీయ పక్షాల కారణంగా తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించి వీలైనంత వరకు ఇరువైపుల వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసేందుకు దేవస్వం బోర్డు పోలీసు యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతోంది.  

మరిన్ని వార్తలు