భూసార నిపుణుడు డా. లాల్‌కు ‘జపాన్‌ ప్రైజ్‌’

22 Jan, 2019 06:23 IST|Sakshi

దుక్కి చెయ్యకుండా పంట విత్తటం, వాతావరణంలోని ఉద్గారాలను భూమి పీల్చుకునేలా సాగు పద్ధతులను రూపొందించడంలో విశేష కృషి చేసిన  భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌ రత్తన్‌ లాల్‌ ప్రతిష్టాత్మకమైన జపాన్‌ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీలో భారతీయ సంతతికి చెందిన భూసార శాస్త్రవేత్త డాక్టర్‌ రత్తన్‌ లాల్‌ ప్రతిష్టాత్మకమైన జపాన్‌ ప్రైౖజ్‌ –2019ను గెల్చుకున్నారు. పంజాబ్‌లో జన్మించిన డాక్టర్‌ లాల్‌ ఓహియో స్టేట్‌ యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్, అగ్రికల్చర్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

భూసార శాస్త్రవేత్తగా సుమారు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. డా. లాల్‌కు జపాన్‌ ప్రైజ్‌ కింద 4.5 లక్షల డాలర్ల నగదు పురస్కారాన్ని జపాన్‌ రాజు అకిహిటో, ప్రధాని షింజో అబెల నుంచి ఏప్రిల్‌ 8న ప్రదానం చేస్తారు. ఇంతకుముందు గ్లింకా వరల్డ్‌ సాయిల్‌ ప్రైజ్‌ను, వరల్డ్‌ అగ్రికల్చర్‌ ప్రైజ్‌లను కూడా ఆయన అందుకోవడం విశేషం. నగదు బహుమతులను కర్బన ఉద్గారాలపై పరిశోధనలకే వెచ్చిస్తానని ఈ సందర్భంగా డా. లాల్‌ ప్రకటించి తన ఉదాత్తతను చాటుకున్నారు.

మరిన్ని వార్తలు